Begin typing your search above and press return to search.

చిల్డ్ర‌న్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌ అవ‌స‌ర‌మా: త‌మ్మా రెడ్డి

By:  Tupaki Desk   |   8 Nov 2019 6:29 AM GMT
చిల్డ్ర‌న్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌ అవ‌స‌ర‌మా: త‌మ్మా రెడ్డి
X
బాల‌ల చ‌ల‌న చిత్రోత్స‌వాల‌కు హైద‌రాబాద్ ను శాశ్వ‌త వేదిక‌ని చేస్తూ గ‌తంలో కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఉత్త‌ర్వులు జారీ చేశాయి. అప్ప‌టి నుంచి బాల‌ల చ‌ల‌న చిత్రోత్స‌వాలకు హైద‌రాబాద్ శాశ్వ‌త వేదిక‌గా మారింది. అయితే ఈ చిత్రోత్స‌వాల‌కు ప్ర‌త్యేకంగా అంటూ ఓ ఆడిటోరియం.. ఓ థియేట‌ర్ అంటూ ఏదీ లేదు. చ‌ల‌న చిత్రోత్స‌వాల స‌మ‌యం లో ఎంచుకున్న థియేట‌ర్ల‌ని వాడుకుంటూ అందులోనే చిత్రాల‌ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఈ చ‌ల‌న చిత్రోత్స‌వాల‌ పై ప్ర‌ముఖ నిర్మాత త‌మ్మా రెడ్డి భ‌ర‌ద్వాజ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

బాల‌ల చ‌ల‌న చిత్రోత్స‌వాలు జ‌రిపించ‌క‌ పోవ‌డం త‌న‌కు సంతోషంగా వుంద‌ని త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ వెల్ల‌డించ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఈ ఏడాది నిర్వ‌హించాల్సిన బాల‌ల చ‌ల‌న చిత్రోత్స‌వాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం వివిధ కార‌ణాల‌ని చూపిస్తూ ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై త‌మ్మా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బాల‌ల చ‌ల‌న చిత్రోవ్స‌వాన్ని ర‌ద్దు చేయ‌డానికి వెన‌కున్న కార‌ణాలు మాత్రం నాకు తెలియ‌దు కానీ ఒక ర‌కంగా ఇవి ర‌ద్దు కావ‌డం మాత్రం త‌న‌కు సంతోషంగా వుంద‌ని వెల్ల‌డించారు. హైద‌రాబాద్ శాశ్వ‌త వేదిక అంటారు. కానీ ఒక్క‌రూ ఇక్క‌డివాళ్లు వుండ‌రు. ఫెస్టివ‌ల్ అన‌గానే ఉత్త‌రాది నుంచి వందలాది మంది వ‌చ్చేస్తారు.

కేంద్రం.. రాష్ట్రం విడుద‌ల చేసిన నిధుల్ని మెక్కేస్తారు. అయితే ఫెస్టివ‌ల్ ఇక్క‌డ జ‌రుగుతున్నా ఇక్క‌డి వారంటే వారికి గౌర‌వం వుండ‌దు. ఇక్క‌డ ప్ర‌భుత్వం అన్నా.. ఇక్క‌డి స్టార్స్ అన్నా గౌర‌వం వుండ‌దు. అలాంట‌ప్పుడు మ‌న వాళ్లు ఎందుకు వారితో క‌లుస్తారు. అందుకే మ‌న స్టార్స్ ఈ ఫెస్టివ‌ల్‌ కు దూరంగా వుంటుంటారు. అయినా నిర్వాహ‌కుల్లో మాత్రం మార్పురాదు. మొండి గా ఇలాగే నిర్వ‌హిస్తామంటూ ముర్ఖం గా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ప్ర‌భుత్వం కూడా ఈ చ‌ల‌న చిత్రోత్స‌వాల వ‌ల్ల రాష్ట్రానికి న‌ష్ట‌మే కానీ లాభం లేద‌ని నిర్వ‌హించ‌డానికి ఆస‌క్తి చూపించ‌డం లేదు. వ‌ర్షాలు ప‌డ్డాయ‌ని కార‌ణాలు చెబుతున్నారు. అది అస‌లు కార‌ణ‌మే కాదు. నిర్వ‌హించ‌డం ఇష్టం లేకే కార‌ణాలు చెబుతున్నారు. ఏది ఏమైనా బాల‌ల చ‌ల‌న చిత్రోత్స‌వాలు ఈ సారి హైద‌రాబాద్ లో నిర్వ‌హించ‌క‌ పోవ‌డం నాకు సంతోష‌మే` అని త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ అస‌లు విష‌యం వెల్ల‌గ‌క్కారు.