Begin typing your search above and press return to search.

నెట్ ఫ్లిక్స్ విష‌యంలో జ‌క్క‌న్న ఎందుకు హ‌ర్ట్ అయ్యారు?

By:  Tupaki Desk   |   1 Aug 2022 2:30 AM GMT
నెట్ ఫ్లిక్స్ విష‌యంలో జ‌క్క‌న్న ఎందుకు హ‌ర్ట్ అయ్యారు?
X
ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన మూవీ `RRR`. టాలీవుడ్ టాప్ స్టార్స్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలిసారి క‌లిసి న‌టించారు. 1920 నేప‌థ్యంలో స్వాతంత్య్రానికి పూర్వం ఇద్ద‌రు పోరాట యోధులు అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీం ల పీరియాడిక్ ఫాంట‌సీ క‌థ‌గా ఈ మూవీని అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మించారు. బాలీవుడ్ న‌టులు అజ‌య్ దేవ‌గ‌న్‌, అలియాభ‌ట్, హాలీవుడ్ న‌టులు రే స్టీవెన్ స‌న్‌, ఒలివియా మోరీస్‌, అలీస‌న్ డూడీ, త‌మిళ న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

భారీ అంచ‌నాల మ‌ధ్య పాన్ ఇండియా మూవీగా ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ఈ సినిమా అంచ‌నాల‌కు మించి సంచ‌ల‌నాలు సృష్టించింది. మార్చి 25న విడుద‌లై వ‌ర‌ల్డ్ వైడ్ గా వ‌సూళ్ల ప‌రంగా రికార్డులు సృష్టించింది. బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల ప్ర‌భంజ‌నాన్ని సృష్టించింది. హిందీ మార్కెట్ లోనూ భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి అక్క‌డి ట్రేడ్ వ‌ర్గాల‌ని విస్మ‌య ప‌రిచింది. ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ఐదు భాష‌ల్లో ఈ మూవీ రూ. 1200 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది.

ఇదిలా వుంటే ఈ మూవీ హిందీ వెర్ష‌న్ మే 20 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ద‌క్షిణాది భాష‌ల‌కు సంబంధించి జీ5, డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ వెర్ష‌న్ ని నెట‌ఫ్లిక్స్ లో వీక్షిస్తున్న‌ హాలీవుడ్ స్టార్స్ ఫిదా అవుతున్నారు. విదేశీ ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అయితే నెట్ ఫ్లిక్స్ విష‌యంలో జ‌క్క‌న్న హ‌ర్ట్ అయ్యార‌ట‌. కార‌ణం తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో విడుద‌లైన ఈ మూవీ ఓటీటీ హ‌క్కుల్లో కేవ‌లం హిందీ వెర్ష‌న్ హ‌క్కుల్ని మాత్ర‌మే నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

మిగ‌తా భాష‌ల‌కు సంబంధించిన స్ట్రీమింగ్ హ‌క్కుల్ని జీ5, డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నాయి. ఇదే త‌న‌కు న‌చ్చ‌లేద‌ని రాజ‌మౌళి తాజాగా ఆగ్ర‌హాన్ని, అసంతృప్తిని వ్య‌క్తం చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇటీవ‌ల నెట్ ఫ్లిక్స్ ఓ ఈవెంట్ ని ఏర్పాటు చేసింది. ఇందులో `ది గ్రే మ్యాన్‌` డైరెక్ట‌ర్స్ రుసో బ్ర‌ద‌ర్స్ తో పాటు రాజ‌మౌళిని కూడా పాల్గోన్నాడు. ఈ సంద‌ర్భంగా రూసో బ్ర‌ద‌ర్స్ .. జ‌క్క‌న్న‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఈ సంద‌ర్భంగా రాజ‌మౌళి ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు. `RRR` కు విదేశీ ప్రేక్ష‌కుల నుంచి వ‌స్తున్న ప్ర‌శంస‌లు చూసి ఆశ్చ‌ర్య‌పోయాన‌న్నారు. అయితే నెట్ ఫ్లిక్స్ హిందీ వెర్ష‌న్ హ‌క్కుల్ని మాత్ర‌మే తీసుకుంద‌ని, మ‌గ‌తా నాలుగు భాష‌ల హ‌క్కుల్ని తీసుకోక‌పోడం త‌న‌కు ఆగ్ర‌హాన్ని క‌లిగించిందన్నారు.

మంచి క‌థ ప్ర‌తి ఒక్క‌రికీ మంచి క‌థే. కానీ విదేశీ ప్రేక్ష‌కుల అభిరుచికి త‌గ్గ‌ట్టుగా నేను సినిమాలు తీస్తానని, వాళ్లు ఆద‌రిస్తార‌ని ఊహించ‌లేద‌న్నారు. నెట్ ఫ్లిక్స్ లో `RRR` స్ట్రీమింగ్ మొద‌లు కాగానే అంద‌రూ చూడ‌టం ప్రారంభించారు. విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ప్ర‌శంస‌లు ద‌క్కాయి. కానీ విదేశీ ప్రేక్ష‌కుల‌కు సినిమా న‌చ్చ‌డంతో స‌ర్ ప్రైజ్ అయ్యాన‌న్నారు. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో రావ‌డం వ‌ల్లే ఎక్కువ మంది చూశార‌ని, అందుకు నెట్ ఫ్లిక్స్ కి రుణ‌ప‌డి వుంటాన‌ని జ‌క్క‌న్న అన‌డం విశేషం. నెట్ ఫ్లిక్స్ లో `RRR` 10 వారాల పాటు ట్రెండ్ అయింది. ప్ర‌పంచ వ్యాప్తంగా 47 మిలియ‌న్ గంట‌ల పాటు ఈ చిత్రాన్ని వీక్షించ‌డం విశేషంగా చెబుతున్నారు.