Begin typing your search above and press return to search.

ఇరు ముఖ్య‌మంత్రుల‌తో భేటీలో చిరు ఏం కోర‌తారు?

By:  Tupaki Desk   |   6 July 2021 5:34 AM GMT
ఇరు ముఖ్య‌మంత్రుల‌తో భేటీలో చిరు ఏం కోర‌తారు?
X
ఏపీలో టిక్కెట్టు ధ‌ర‌ల త‌గ్గింపు జీవో ఊహించ‌ని ముప్పుగా మారిన సంగ‌తి తెలిసిన‌దే. ప్ర‌తిపాదిత జీవో సినిమాకి తీవ్ర న‌ష్టాన్ని క‌లిగిస్తోంద‌ని ఇప్ప‌టికే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. తెలంగాణ‌లో థియేట‌ర్లు తెరిచినా ఏపీలో కొత్త జీవో వ‌ల్ల‌ న‌ష్టాలొస్తాయ‌నేది నిర్మాత‌లు స‌హా ఎగ్జిబిట‌ర్లు పంపిణీదారుల వాద‌న‌. అలాంట‌ప్పుడు ఏపీలో కొత్త జీవోని ర‌ద్దు చేసి టిక్కెట్టు పై పాత రేట్ల‌నే కొనసాగించాల్సి ఉంటుంద‌ని డిమాండ్ ఊపందుకుంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఒకే టిక్కెట్టు రేటు ఉండాల‌ని కూడా ప‌ట్టుబ‌డుతున్నారు. అస‌లే ఎగ్జిబిష‌న్ రంగం ఏడాది కాలంగా క్రైసిస్ లోకి వెళ్లిపోయింది. నెల‌ల త‌ర‌బ‌డి ఈ రంగంలో ఉపాధిని కోల్పోయారు. సినీప‌రిశ్ర‌మ‌ను మ‌హ‌మ్మారీ తీవ్రంగా దెబ్బ కొట్టింది. ఇలాంట‌ప్పుడు ప్ర‌భుత్వాలే పూనుకుని స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించ‌క‌పోతే పూర్తిగా దుంప‌నాశ‌న‌మేన‌ని భావిస్తున్నారు.

అయితే తెలుగు రాష్ట్రాల్లో ఎదురైన ఈ సమస్యలపై చర్చించడానికి గత వారం రోజులుగా పలువురు టాలీవుడ్ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి నివాసంలో సమావేశమవుతున్నారు. ఈ వారాంతంలో సినీపెద్ద‌ల బృందం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన టికెట్ ధరల జీవోను సవరించాలని అభ్యర్థిస్తారు. ఇప్ప‌టికే అపాయింట్ మెంట్ కోరార‌ని తెలిసింది. ఈ భేటీలో విశాఖ‌- టాలీవుడ్ ప్ర‌స్థావ‌న తెచ్చే వీలుంద‌ని కూడా ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.

ఏపీ ముఖ్య‌మంత్రితో మంత‌నాలు స‌హా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని క‌లిసి సినీ పరిశ్రమ స‌మ‌స్య‌ల‌ను వివ‌రిస్తారు. సీఎం త‌మ‌కు సహకరించాల‌ని కోర‌తారు. విద్యుత్ ఛార్జీలు మాఫీ.. పార్కింగ్ ఫీజులు వ‌గైరా అంశాల్ని ప్ర‌భుత్వాల‌తో ముచ్చ‌టిస్తారు. తెలుగు సినిమా ఎగ్జిబిష‌న్ స‌హా ఇత‌ర రంగాల్లో పెండింగ్ లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించడానికి సినీపెద్ద‌లు చొరవ తీసుకుంటున్నారు.

అయితే ఈ భేటీలు పూర్త‌యి థియేట‌ర్ల‌ను తిరిగి తెర‌వాలంటే ఇంకా ఎంత స‌మ‌యం ప‌డుతుంది? అంటే జూలై చివ‌రి నాటికి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే దిశ‌గా ఆలోచిస్తున్నార‌ట‌. ఆగస్టులో థియేటర్లు తిరిగి ప్రారంభమవుతాయని సమస్యలు పరిష్కరించాక‌ విడుదల తేదీలను ప్రకటించడానికి నిర్మాతలు ఆసక్తి గా ఉన్నార‌ని తెలుస్తోంది. సినీప‌రిశ్ర‌మ ప్ర‌ముఖుల్లో చిరంజీవి- మోహ‌న్ బాబు- నాగార్జున‌- బాల‌కృష్ణ‌- వెంక‌టేష్ - సురేష్ బాబు వంటి ప్ర‌ముఖులు ముఖ్య‌మంత్రుల‌ను క‌లిసేందుకు ఆస్కారం ఉంద‌ని చెబుతున్నారు.

స‌మ‌స్య ప‌రిష్కార‌మైతే థియేట్రిక‌ల్ రిలీజ్ ల కోసం వేచి చూస్తున్న సినిమాల జాబితా చాలా పెద్ద‌గానే ఉంది. చిరంజీవి న‌టించిన ఆచార్య‌.. అల్లు అర్జున్ పుష్ప‌1.. నాగ‌చైత‌న్య -లవ్ స్టోరీ,.. నాని- టక్ జగదీష్.. గోపిచంద్ -సీటీమార్ త‌దిత‌ర చిత్రాలు తెలుగులో విడుదలయ్యేందుకు వేచి ఉన్నాయి. కేజీఎఫ్ 2.. ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా చిత్రాల‌కు లైన్ క్లియ‌ర్ కావాల్సి ఉంది. ఇవ‌న్నీ కూడా మూడ‌వ వేవ్ రిలీజ‌వ్వాలి. లేదంటే మ‌ళ్లీ నెల‌ల త‌ర‌బ‌డి వేచి చూడాల్సిన ప్ర‌మాదం పొంచి ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మూడో వేవ్ లో స‌గం టిక్కెట్లు ఖాళీ అయ్యే ప్ర‌మాద‌ముంద‌ని కూడా నిపుణులు హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు.