Begin typing your search above and press return to search.

మంచు విష్ణూ.. 'మా' బిల్డింగ్ ఎప్పుడు..??

By:  Tupaki Desk   |   8 Nov 2021 8:30 AM GMT
మంచు విష్ణూ.. మా బిల్డింగ్ ఎప్పుడు..??
X
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) కొత్త అధ్యక్షుడుగా టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఎన్నికైన సంగతి తెలిసిందే. MAA కు శాశ్వత భవనం కట్టిస్తాననే ప్రధాన హామీతో ఎన్నికల బరిలో దిగిన విష్ణు.. ప్రత్యర్థి ప్రకాష్ రాజ్ ప్యానల్ మీద ఘన విజయం సాధించారు. మంచు హీరో అధ్యక్ష పీఠం ఎక్కి రెండు నెలలు గడుస్తున్న నేపథ్యంలో.. 'మా' బిల్డింగ్ కు ఎప్పుడు శ్రీకారం చుట్టబోతున్నారనే ప్రశ్నలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

'మా' ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను గెలిస్తే సొంత డబ్బుతో 'MAA' బిల్డింగ్ నిర్మిస్తానని మంచు విష్ణు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని కోసం ఇప్పటికే రెండు మూడు స్థలాలను కూడా పరిశీలించినట్లు ఎలక్షన్స్ ముందు తెలిపారు. విష్ణు గెలుపుకు 'మా' సొంత భవనం హామీ పని చేసిందనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అందుకే ఇప్పుడు నూతన అధ్యక్షుడు ఏ ట్వీట్ చేసినా, దాని కింద కామెంట్ సెక్షన్ లో 'మా బిల్డింగ్ ఎప్పుడు కడుతున్నారు?' అని నెటిజన్స్ ప్రశ్నిస్తూ వస్తున్నారు.

అలానే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెర్మినెంట్ బిల్డింగ్ కు ఎప్పుడు భూమి పూజ చేస్తారని మా సభ్యులు సైతం ఎదురు చూస్తున్నారట. 'మా' భవనం కోసం మూడు స్థలాలు కూడా చూసిపెట్టానని మంచు విష్ణు చెప్పిన నేపథ్యంలో.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ స్థలాలను సభ్యుల్లో ఎవరికైనా చూపించారా? అని టాలీవుడ్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

'మా' అధ్యక్షుడు పదవీకాలం రెండేళ్లు మాత్రమే ఉంటుంది. అందుకే వీలైనంత త్వరగా బిల్డింగ్ కోసం శంకుస్థాపన చేస్తే బాగుంటుందని మాట్లాడుకుంటున్నారట. ఇక ఎన్నికల్లో ఓడిపోయిన ప్రకాష్ రాజ్ వర్గం కూడా త్వరలోనే దీనిపై విష్ణు ను ప్రశ్నించడానికి రెడీ అవుతున్నారట. మరి రాబోయే నూతన సంవత్సరం కానుకగా మంచు విష్ణు 'మా' భవనం గురించి మంచి కబురు చెబుతారేమో చూడాలి. ఒకవేళ ఇదే జరిగితే 'మా' చరిత్రలో విష్ణు పేరు నిలిచిపోతుందని చెప్పవచ్చు.

ఇకపోతే 'మా' నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న మంచు విష్ణు.. తమ ప్యానల్ మేనిఫెస్టో హామీల అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మహిళా ఆర్టిస్టుల భద్రత కోసం విమెన్ ఎంపవర్మెంట్ అండ్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయనున్నట్లు కీలక ప్రకటన చేశారు. ఈ కమిటీలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉంటారని.. సోషల్ యాక్టివిస్ట్ సునీతా కృష్ణన్ దీనికి గౌరవ సలహాదారుగా ఉంటారని తెలిపారు.

అలానే 'MAA' కు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయడానికి ట్విట్టర్ - ఫేస్ బుక్ - ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ లో అధికారిక ఖాతాలను ఓపెన్ చేశారు. దీనిని బట్టి చూస్తే 'మా' అభివృద్ధితో పాటుగా అసోసియేషన్ లో నూతన సంస్కరణలు తీసుకురావాలని మంచు విష్ణు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.

ఇక మంచు విష్ణు మ్యానిఫెస్టోలో 'మా' భవనంతో పాటుగా సభ్యులకు సినిమా అవకాశాలు - మహిళా ఆర్టిస్ట్స్ భద్రత - సభ్యుల పిల్లలకు స్కాలర్ షిప్పులు - మెరుగైన మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ - ఇళ్లు లేని సభ్యులకు సొంతింటి కల నెరవేర్చడం - పెన్షన్ల సంఖ్య పెంపు వంటి పలు హామీలు ఉన్నాయి. మరి త్వరలోనే 'మా' బిల్డింగ్ తో పాటుగా మిగతా హామీలపై నూతన అధ్యక్షుడు దృష్టి సారిస్తారేమో చూడాలి.