Begin typing your search above and press return to search.

ఇక 'ఆర్.ఆర్.ఆర్' ఆగమనం అప్పుడేనా..?

By:  Tupaki Desk   |   22 Aug 2021 1:30 AM GMT
ఇక ఆర్.ఆర్.ఆర్ ఆగమనం అప్పుడేనా..?
X
దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా 'ఆర్.ఆర్.ఆర్'. ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీని ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని RRR చిత్రాన్ని మరోసారి వాయిదా వేస్తున్నారని తెలుస్తోంది.

'ఆర్ ఆర్ ఆర్' సినిమా విడుదలను ఇప్పటికే రెండు సార్లు వాయిదా వేశారు. మొదటగా 2020 జులై 30న‌ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఆ తర్వాత 2021 జ‌న‌వ‌రి 8న పక్కా ప్రేక్షకుల ముందుకు వస్తామని ప్రకటించారు. అయితే కరోనా ఫస్ట్ వేవ్ ప‌రిస్థితుల్లో మళ్ళీ పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ అక్టోబర్ 13న విడుదల చేస్తామని అనౌన్స్ చేశారు. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ రూపంలో ట్రిపుల్ ఆర్ మేకర్స్ ప్లాన్ కి బ్రేక్స్ వేసింది.

అయినప్పటికీ 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని చెప్పిన తేదీకి విడుదల చేయాలని గట్టిగా ట్రై చేస్తున్నట్లు చిత్ర బృందం షూటింగ్ జరుపుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేశారు. ఇటీవలే ఉక్రెయిన్ లో ఫైనల్ సాంగ్ షూట్ ముగించి తిరిగి హైదరాబాద్ కు వచ్చారు. రిలీజ్ డేట్ కి ఇంకా కొకొద్ది రోజులు మాత్రమే ఉంది కాబట్టి.. ఈపాటికి జక్కన్న అండ్ టీమ్ ప్రమోషన్స్ తో హోరెత్తించే వాళ్ళు. మరోసారి వాయిదా వేస్తున్నారు కనుకనే సైలెంట్ గా ఉంటున్నారని తెలుస్తోంది.

నిజానికి 'ఆర్ ఆర్ ఆర్' సినిమా దసరా పండక్కి విడుదల అవడం అసాధ్యమనే విషయం చిత్ర బృందానికి కొన్ని నెలల ముందే స్పష్టత వచ్చేసింది. రాజమౌళి సినిమాల షూటింగ్ పూర్తి చేయడం ఒక ఎత్తైతే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరపడం మరో ఎత్తు. ఇవన్నీ తెలిసినప్పటికీ.. ప్రమోషనల్ కంటెంట్ లో పదేపదే '2021 అక్టోబర్ 13 విడుదల' అని మెన్షన్ చేస్తూ వస్తుండటంతో సినీ అభిమానులు చెప్పిన వచ్చే అవకాశం ఉందేమో అనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఇప్పుడు RRR మరోసారి వాయిదా పక్కా అన్న విషయం అందరికీ అర్థం అయింది.

ఈ నేపథ్యంలో దసరా స్లాట్ కోసం టాలీవుడ్ లో పోటీ ఎక్కువైంది. ఇప్పటికే 'కొండ పొలం' వంటి సినిమా కర్చీఫ్ వేసుకొని కూర్చుంది. మరికొన్ని క్రేజీ మూవీస్ కూడా రానున్న రోజుల్లో విడుదల చేయనున్నారు. అయితే 'ఆర్ ఆర్ ఆర్' చిత్రాన్ని మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. దసరా సీజన్ ను మిస్ చేసుకున్న ట్రిపుల్ ఆర్ కు.. క్రిస్మస్ - సంక్రాంతి సీజన్లు దొరికే పరిస్థితులు లేవు. అందుకే ఈ చిత్రాన్ని 2022 ఉగాది సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారట.

ఉగాది పండక్కి కుదరకపోతే రాజమౌళి కి కలిసొచ్చిన 'బాహుబలి 2' రిలీజ్ రోజున ''ఆర్ ఆర్ ఆర్'' చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అంటే మరో ఏడెనిమిది నెలలు RRR సినిమా రిలీజ్ ని మర్చిపోవాల్సిందే. త్వరలోనే రాజమౌళి అండ్ టీమ్ ఓ ప్రెస్ మీట్ పెట్టి సినిమా వాయిదా గురించి మాట్లాడతారని వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే తదుపరి విడుదల తేదీపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.

కాగా, 'RRR' చిత్రంలో అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ - కొమురం భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఆలియా భట్ - ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవగన్ - శ్రియ - సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.