Begin typing your search above and press return to search.

ఎక్కడ ఉగ్రమ్.. ఎక్కడ కేజీఎఫ్.. ఎక్కడ సలార్?

By:  Tupaki Desk   |   12 April 2022 3:38 AM GMT
ఎక్కడ ఉగ్రమ్.. ఎక్కడ కేజీఎఫ్.. ఎక్కడ సలార్?
X
కొంతకాలం క్రితం వచ్చిన 'కేజీఎఫ్' సంచలన విజయాన్ని సాధించింది. విజయ్ కిరగందూర్ నిర్మించిన ఆ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. 2018 లో విడుదలైన ఆ సినిమా, విడుదలైన ప్రతి భాషలో విజయవిహారం చేసింది. వసూళ్ల పరంగా కొత్త రికార్డులను సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆ సినిమాకి సీక్వెల్ ను చేశారు. 'కేజీఎఫ్ 2' టైటిల్ తో ఈ సినిమాను ఈ నెల 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు.
ఈ వేదికపై దిల్ రాజు మాట్లాడారు.

"కేజీఎఫ్ గురించి మాట్లాడాలంటే ముందుగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడాలి. బాలీవుడ్లో 100 .. 200 .. 300 కోట్ల ఫిగర్స్ చెబితే వినేవాళ్లం. సౌత్ విషయానికి వస్తే చిరంజీవిగారి సినిమా ఇంత కలెక్ట్ చేసిందనే మాటను వినేవాళ్లం. అలాగే తమిళనాడుకి వెళితే రజనీకాంత్ గారి సినిమా ఇంత వసూలు చేసిందని చెప్పుకునేవారు.

మలయాళ సినిమాల విషయానికి వస్తే, కాన్సెప్టులు చాలా కొత్తగా ఉంటాయని చెప్పేసి అంతా ప్రశంసిస్తూ ఉంటారు. కన్నడ సినిమా విషయానికి వచ్చేసరికి వాళ్లు చాలా చిన్న సినిమాలు తీస్తారని చెప్పుకునేవారు. వాళ్ల సినిమాల బడ్జెట్ 5 .. 6 కోట్లకు మించదని అనుకునేవారు .

అలాంటి పరిస్థితుల్లోనే నాకు ప్రశాంత్ నీల్ పరిచయమయ్యాడు. ఆయన 'ఉగ్రమ్' సినిమా చూసినప్పుడు చాలా కొత్తగా ఉందనిపించింది. అలాంటి ప్రశాంత్ నీల్ కన్నడలో అంతవరకూ అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాలకు మించిన బడ్జెట్ ను ఆ సినిమా కోసం ఖర్చు చేస్తున్నారని చెప్పుకున్నారు. అక్కడ ఉన్న రెవెన్యూను దాటుకుని సినిమా చేస్తే ఎలా వర్కౌట్ అవుతుందని అంతా ఆశ్చర్యపోయారు. ఆ సినిమా విడుదలైన తరువాత అన్ని ఇండస్ట్రీలు కన్నడ సినిమా వైపు చూసేలా చేసింది. అందుకు నేను ప్రశాంత్ నీల్ టీమ్ కి హ్యాట్సాఫ్ చెబుతున్నాను.

ఈ రోజున వీళ్లంతా కూడా ' కేజీఎఫ్ 2'తో చరిత్ర సృష్టించబోతున్నారు. మొన్న 'పుష్ప' .. ఆ తరువాత 'ఆర్ ఆర్ ఆర్' ఎలాంటి రికార్డులను సృష్టించిందో చూశాము. 'కేజీఎఫ్ 2' కూడా అలాంటి ఒక రికార్డు సృష్టిస్తుందని నమ్ముతున్నాను. ప్రశాంత్ సెట్ చేసుకున్న టీమ్ సూపర్బ్. ప్రశాంత్ గ్రోత్ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.

ఎక్కడ 'ఉగ్రమ్' .. ఎక్కడ 'కేజీఎఫ్' .. ఎక్కడ 'సలార్'. సినిమా .. సినిమాకి ఆయన ఎక్కడికో వెళుతున్నాడు. మా రాజమౌళిగారిలా ఆయన కూడా సినిమాను పెంచుతున్నందుకు థాంక్స్. ఒక సినిమా పూర్తయ్యేవరకూ మరో సినిమాను గురించి ఆలోచన చేయని యశ్ డెడికేషన్ కి హ్యాట్సాఫ్ చెబుతున్నాను" అంటూ ముగించారు.