Begin typing your search above and press return to search.

డ‌జ‌న్ రిలీజ్ ల‌తో సెప్టెంబ‌ర్ బ్లో.. ఏది క్రేజ్‌?

By:  Tupaki Desk   |   30 Aug 2019 1:30 AM GMT
డ‌జ‌న్ రిలీజ్ ల‌తో సెప్టెంబ‌ర్ బ్లో.. ఏది క్రేజ్‌?
X
యంగ్ రెబ‌ల్ స్టార్ `సాహో` సంద‌డి త‌రువాత బాక్సాఫీస్ పై డ‌జ‌నుకు పైగా చిత్రాలు దండ‌యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. అందులో ఓ రెండు క్రేజీ స్టార్ లు న‌టిస్తున్న ఇంట్రెస్టింగ్ మూవీస్ తో పాటు అప్ క‌మింగ్ హీరోలు న‌టిస్తున్న చిత్రాలు కూడా పోటీప‌డుతున్నాయి. సెప్టెంబ‌ర్ తొలి వారం (6వ తేదీ) నుంచే ఈ చిత్రాల హ‌డావుడి మొద‌లు కాబోతోంది.  ఈ వ‌రుస‌లో ముందుగా వ‌స్తున్న చిత్రం `అశ్వ‌మేథం` న్యూక‌మ‌ర్ ధృవ్ క‌రుణాక‌ర్ హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. నితిన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం సైబ‌ర్ క్రైమ్ నేప‌థ్యంలో సాగుతుంది. దీనితో పాటు ఆది న‌టిస్తున్న `జోడీ` విడుద‌లవుతోంది.

చాలా కాలంగా స‌రైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆది కెరీర్‌ కి ఈ సినిమా అత్యంత కీల‌కంగా మారింది. `జెర్సీ` ఫేమ్ శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ హీరోయిన్‌ గా న‌టించిన ఈ సినిమాపై ఆది భారీ ఆశ‌లే పెట్టుకున్నాడు. అత‌ని న‌మ్మ‌కాన్ని ఈ సినిమా ఎంత వ‌ర‌కు నిజం చేస్తుందో తెలియాలంటే సెప్టెంబ‌ర్ 6 వ‌ర‌కు ఎదురుచూడ‌క త‌ప్ప‌దు. ఇక త‌రుణ్ తేజ్‌- లావ‌ణ్య జంట‌ను తెర‌కు ప‌రిచ‌యం చేస్తూ న‌వీన్ నాయ‌ని ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన చిత్రం `ఉండిపోరాదే` కూడా ఇదే రోజు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. తెలుగు భాష గొప్ప‌త‌నాన్ని చాటి చెప్పాల‌న్న ఉద్దేశంతో బ‌సిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. వీటితో పాటు ఇదే తేదీన ద‌ర్ప‌ణం, `వీడు స‌రైనోడు`, `మార్ష‌ల్‌` చిత్రాలు కూడా విడుద‌ల కాబోతున్నాయి.

చిన్నా చిత‌కా ఎన్ని చిత్రాలొచ్చినా ప్ర‌ధాన పోటీ మాత్రం నాని న‌టిస్తున్న `గ్యాంగ్ లీడ‌ర్‌`, వ‌రుణ్ తేజ్‌ తొలిసారి నెగెటివ్ పాత్ర‌లో న‌టిస్తున్న `వాల్మీకి` చిత్రాల మ‌ధ్యే వుండ‌బోతోంది. ఈ రెండు చిత్రాల మ‌ధ్య వారం రోజుల గ్యాప్ ఉంది. నాని `గ్యాంగ్ లీడ‌ర్` సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల‌వుతుండ‌గా, వ‌రుణ్ తేజ్ న‌టించిన `వాల్మీకి` 20న రాబోతోంది. రెండు చిత్రాలు దేనిక‌దే ప్ర‌త్యేక‌త‌తో బ‌రిలోకి దిగ‌బోతున్నాయి. అయితే `వాల్మీకి` విడుద‌ల‌వుతున్న సెప్టెంబ‌ర్ 20 రోజున త‌మిళ స్టార్ హీరో సూర్య న‌టించిన `బందోబ‌స్తు` విడుద‌ల‌వుతోంది. ఈ రెండు చిత్రాల్లో `వాల్మీకి`దే పై చేయి అవుతుందా అన్న‌ది చూడాలి. 

సందెట్లో స‌డేమియాలా సుదీప్ న‌టించిన `ప‌హిల్వాన్‌` సెప్టెంబ‌ర్‌ లోనే బ‌రిలోకి దిగుతోంది. 12న విడుద‌ల కాబోతున్న ఈ సినిమా తెలుగులో ఏ మేరకు ప్ర‌భావం చూపించ‌నుంది అన్న‌ది చూడాలి. ఎందుకంటే సుదీప్‌ కు తెలుగులో క్రేజ్ లేక‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణం. చోటా మోటా చిత్రాలన్నీ క‌లిసి డ‌జ‌నుకు పైగానే ఈ సెప్టెంబ‌ర్ భారీ స్థాయిలోనే బ్లాక్ అయినా అందులో చెప్పుకోద‌గ్గ చిత్రాలు రెండు మూడు మాత్ర‌మే వుండ‌టం గ‌మ‌నార్హం.