Begin typing your search above and press return to search.

నిన్న రిలీజైన సినిమాలలో ఏవి ప్రేక్షకులను మెప్పించాయి..?

By:  Tupaki Desk   |   20 Feb 2021 2:30 PM GMT
నిన్న రిలీజైన సినిమాలలో ఏవి ప్రేక్షకులను మెప్పించాయి..?
X
టాలీవుడ్ లో నిన్న శుక్రవారం ఒక్కరోజే నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అల్లరి నరేష్ హీరోగా నటించిన 'నాంది' - అక్కినేని హీరో సుమంత్ నటించిన 'క‌ప‌ట‌ధారి' సినిమాలతో పాటు కన్నడ డబ్బింగ్ సినిమా 'పొగరు' - విశాల్ నటించిన తమిళ తెలుగు ద్విభాషా చిత్రం 'చక్ర' థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి. ఇందులో ఏ సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయో చూద్దాం.

ఇప్పటికే కన్నడ తమిళ భాషల్లో హిట్ అయిన క్రైమ్ థ్రిల్లర్ స్టోరీతో "క‌ప‌ట‌ధారి"గా లక్ టెస్ట్ చేసుకోడానికి వచ్చాడు సుమంత్. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని క్రియేటివ్ ఎంటర్టైనర్స్ - బొఫ్తా మీడియా బ్యానర్స్ పై ధనుంజయన్ నిర్మించాడు. టీజర్ - ట్రైలర్స్ తో ఆసక్తిని కలిగించిన ఈ సినిమా లీస్ట్ ఓపెనింగ్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 'క‌ప‌ట‌ధారి' అనే టైటిల్ కార‌ణంగానే జనాలు థియేట‌ర్స్ వైపు చూడ‌లేదనే కామెంట్స్ వస్తున్నాయి. కాకపోతే ఈ సినిమాకి మంచి రివ్యూస్ రావడంతో సెకండ్ డే నుంచి మంచి వసూళ్ళు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

అల్లరి నరేష్ 'నాంది' సినిమా నిన్న మార్నింగ్‌ షో నుంచే పాజిటివ్‌ టాక్‌ తో నడుస్తోంది. నరేశ్‌ నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్‌.వీ 2 ఎంటెర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌ పై సతీష్ వేగేశ్న నిర్మించాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ. 49 లక్షలు షేర్.. రూ. 72 లక్షల గ్రాస్ రాబట్టింది. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు రూ. 2.70 కోట్ల జరిగిందని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో 'నాంది' బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు.

నిన్న రిలీజైన సినిమాల్లో 'పొగ‌రు' సినిమాకు మంచి ఓపెనింగ్స్ వ‌చ్చాయని అంటున్నారు. యాక్ష‌న్ కింగ్' అర్జున్ మేన‌ల్లుడు ధృవ స‌ర్జా - ర‌ష్మిక మంద‌న్న జంటగా నటించిన ఈ చిత్రాన్ని నంద‌ కిశోర్ తెరకెక్కించాడు. 'కరాబు' సాంగ్ తో ఈ డబ్బింగ్ చిత్రం ఆడియన్స్ ని రప్పించగలిగింది. అయితే రెండున్న‌ర గంట‌ల న‌ర‌కం కావాలంటే మాత్రం 'పొగ‌రు' సినిమాకి వెళ్లొచ్చ‌ని చూసిన వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వీకెండ్ లో మంచి వసూళ్ళు రాబడుతుందేమో చూడాలి.

కోలీవుడ్ స్టార్ విశాల్ హీరోగా ఎమ్.ఎస్ ఆనందన్ దర్శకత్వంలో తెరకెక్కిన ''చక్ర'' చిత్రం కూడా నిన్న ప్రేక్షకులను పలకరించింది. విశాల్ హోమ్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందింది. ఫైనాన్సియల్ ఇష్యూస్ కారణంగా విడుదల అవుతుందో లేదో అనే అనుమానం ప్రేక్షకుల్లో కలిగింది. అందులోనూ ప్రచార కార్యక్రమాలు కూడా జనాలను థియేటర్స్ కి రప్పించలేకపోయాయనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక సినిమా చూసిన వాళ్లు గ‌తంలో విశాల్ నుంచి ఈ త‌ర‌హా సినిమాలు చూశామని అంటున్నారు. తెలుగు, తమిళ భాష‌ల్లో వచ్చిన ఈ సినిమా కారణంగా విశాల్ కి నష్టాలు తప్పేలా లేవని ట్రేడ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.