Begin typing your search above and press return to search.

PK వార్: `మా` ఎన్నిక‌ల్లో ఎవ‌రికి క‌లిసొస్తుందంటే?

By:  Tupaki Desk   |   30 Sep 2021 6:35 AM GMT
PK వార్: `మా` ఎన్నిక‌ల్లో ఎవ‌రికి క‌లిసొస్తుందంటే?
X
అక్టోబ‌ర్ 10న జ‌ర‌గ‌నున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌ల నేప‌థ్యంలో తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాలు ఎవ‌రికి క‌లిసి ర‌నున్నాయి? ప‌వ‌న్ క‌ళ్యాణ్ (PSPK) వ‌ర్సెస్ ఏపీ మంత్రుల వార్ ఈ ఎన్నిక‌ల్లో ఎవ‌రికి ఫేవ‌ర్ గా మార‌బోతోంది? అంటే ర‌క‌ర‌కాల ఊహాగానాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే `మా` ఎన్నిక‌ల‌కు సంబంధించి రెండు గ్రూపులుగా విడిపోయిన‌ట్లు ప్ర‌చారం ఉంది. ప్ర‌కాష్ రాజ్ ప్యాన‌ల్ కి మెగాస్టార్ చిరంజీవి మ‌ద్ద‌తిస్తున్నారని..కాబ‌ట్టి ఆ ప్యాన‌ల్ బ‌లంగా ఉండే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం లో ఉంది. ఇది ఓ సామాజిక వ‌ర్గానికి చెందిన ప్యాన‌ల్ గా ప్ర‌చారం సాగుతోంది. ఇక మంచు విష్ణు వైపు మ‌రో వ‌ర్గం ఉంద‌ని మ‌రో ప్ర‌చారం కూడా ఉంది. కృష్ణంరాజు..కృష్ణ స‌హా ప‌లువురు పెద్ద‌లు విష్ణుకు మ‌ద్ద‌తుగా నిలుస్తున్న‌ట్లు..ఇదంతా ఓ వ‌ర్గంలో భావిస్తున్న‌ట్లు మీడియా ప్ర‌చారం ఇప్ప‌టికే పీక్స్ లో జ‌రిగింది.

అయితే ఇప్పుడు ఈ వేడిలోనే తాజాగా పవ‌న్-మంత్రుల వ్య‌వ‌హారం కూడా కీల‌కం కాబోతుంద‌ని మీడియా క‌థ‌నాలు వేడెక్కిస్తు న్నాయి. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై ప్ర‌కాష్ రాజ్ ఇప్ప‌టికే క‌ర్ర విర‌గ‌ని చందంగా స్పందించగా మ‌రికొంత మంది బాహాటంగా ప‌రిశ్ర‌మ‌కి...ప‌వ‌న్ రాజ‌కీయ వ్యాఖ్య‌ల‌కి సంబంధం లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసారు. అయితే ఇదంతా విష్ణుకు క‌లిసొచ్చే అంశంగా క‌నిపిస్తోంది. ప‌రిశ్ర‌మ‌లో వైసీపీ మ‌ద్ద‌తుదారులంతా క‌చ్చితంగా విష్ణుకే స‌పోర్ట్ చేస్తార‌ని గుస‌గుస వినిపిస్తోంది. మోహ‌న్ బాబు కూడా ఆ పార్టీకి తొలి నుంచి స‌న్నిహితుడు కాబ‌ట్టి..అవ‌స‌రం మేర ప్ర‌భుత్వం నుంచి స‌హ‌కారం తీసుకునైనా కొడుకు గెలుపుకోసం పాటు ప‌డే అకాశం ఉంద‌ని తెలుస్తోంది. ప‌వ‌న్ వ్యాఖ్య‌లంటే చేసారు గానీ.. నిత్యం ప‌రిశ్ర‌మ‌ని అంటిపెట్టుకుని ఉండే వ్య‌క్తి కాదని... మెగా ఫ్యామిలీపై పై ఓ వ‌ర్గం లోపాయికారిగా విషం చిమ్ముతుంద‌నే ప్ర‌చారం ఉండ‌నే ఉంది.

`మా` ఎన్నిక‌ల్ని ప‌వ‌న్ ఎలాగూ ప‌ట్టించుకోరు కాబ‌ట్టి ఇప్పుడిది కూడా ప్ర‌కాష్ రాజ్ ప్యాన‌ల్ కి ప్ర‌తికూల అంశంగా మారొచ్చ‌ని ప‌లువురు అభిప్రాయ ప‌డుతున్నారు. ప‌వ‌న్ ని వ్య‌క్తిగ‌తంగా ఎంత అభిమానించినా ప్రాక్టిక‌ల్ స‌న్నివేశం వ‌చ్చే స‌రికి కొంత సంఘ‌ర్ష‌ణ‌కు లోనుకాక త‌ప్ప‌దు. ఆ ప‌రిస్థితుల్ని ప్ర‌త్య‌ర్ధులు త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకునే అవ‌కాశం క‌నిపిస్తుంద‌ని అంటున్నారు. ఇలాంటి వాటిని అన్నింటిని ప్ర‌కాష్ రాజ్ ఫ్యాన‌ల్ అధిగ‌మించాల్సి ఉంది. ఎటు చూసినా ఈ వార్ విష్ణు ఫ్యాన‌ల్ కి క‌లిసొచ్చే విధంగానే క‌నిపిస్తోంది.

నామినేష‌న్ వేశాక‌ విష్ణు ఫైరింగ్

మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌లు ఇంకో 10 రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. నామినేష‌న్లు ముగిసాయి. ప్ర‌కాష్ రాజ్ ఆయ‌న ప్యానెల్ నామినేష‌న్లు వేశారు. మంచు విష్ణు ఆయ‌న ప్యానెల్ స‌భ్యులు కూడా నామినేష‌న్లు వేశారు. అనంత‌రం ప్ర‌చారార్భాటం తెలిసిన‌దే. విష్ణు తెలుగు ఇండ‌స్ట్రీ బిడ్డ‌గా న‌టుడిగా ఛాంబ‌ర్ వారు ఏపీ ప్ర‌భుత్వానికి బాస‌ట‌గా (ప‌వ‌న్ కి వ్య‌తిరేకంగా) ఇచ్చిన లేఖ సారంతో ఏకీభ‌విస్తున్నాను అని ప్ర‌క‌టించారు. నేను తెలుగు ఇండ‌స్ట్రీ ప‌క్క‌న ఉన్నాను. ఫిలింఛాంబ‌ర్ రిలీజ్ చేసిన స్టేట్ మెంట్ .. నిర్మాత‌ల వెర్ష‌న్ అది. దాని కి నేను క‌ట్టుబ‌డి ఉన్నాను. నిర్మాత లేక‌పోతే డ‌బ్బు పెట్టేవాళ్లు లేన‌ట్టే. వాళ్లే లేక‌పోతే ఇండ‌స్ట్రీ లేదు. వాళ్లు ప్ర‌భుత్వంతో చ‌ర్చ లు సాగిస్తున్నారు. ప్రాసెస్ సాగుతోంది. అని విష్ణు అన్నారు. అంటే ప‌వ‌న్ ని వ్య‌తిరేకిస్తున్నాన‌నే దాన‌ర్థం. అలాంట‌ప్పుడు విష్ణుకు ప‌వ‌న్ వ్య‌తిరేక వ‌ర్గం ఓట్లు ప‌డ‌తాయ‌న‌డంలో సందేహం లేదు.

ప్ర‌కాష్ రాజ్ గారు తెలుగు ఇండ‌స్ట్రీ వైపు ఉన్నారా? లేదా ప‌వ‌న్ క‌ల్యాణ్‌ వైపు ఉన్నారా? ఎవ‌రి వైపు ఉన్నారు? అన్న‌ది చెప్పాలి. తెలుగు ఫిలింఇండ‌స్ట్రీ వాళ్లంతా మిమ్మ‌ల్ని న‌మ్ముకున్నారు. మా జీవ‌నాధార‌మిదీ .. దీనికి మీరు స‌మాధానం ఇవ్వాలి... అంటూ త‌న‌దైన శైలిలో ప్ర‌శ్న‌లు కురిపించారు. మ‌రి దీనికి ప్ర‌కాష్ రాజ్ స‌మాధానం ఏమిటో.. ఇంత‌కుముందే ప్ర‌కాష్ రాజ్ కూడా ప‌వ‌న్ కి మ‌ద్ధ‌తు వ్య‌వ‌హారంలో డిప్ల‌మాటిగ్గా వ్య‌వ‌హ‌రించ‌డం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఈ ర‌కంగానూ వైకాపా ఆర్టిస్టుల ఓట్లు విష్ణుకు ప‌డ‌తాయ‌ని అంచ‌నా.

కొన్ని తీవ్ర వ్యాఖ్య‌ల అనంత‌రం ప‌వ‌న్‌ కు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డానికి ఏ ఒక్క‌రూ సాహ‌సించ‌డం లేదు. చివ‌రికి ప‌వ‌న్ మ‌ద్దుతుగా మాట్లాడిన ప్ర‌కాష్ ‌రాజ్ కూడా సోమ‌వారం `మా` అధ్య‌క్ష ప‌ద‌వి కోసం నామినేష‌న్ వేశాక‌ ఆచితూచి స్పందించాడు. ప్ర‌తి విష‌యాన్ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టు మాట్లాడే ప్ర‌కాష్ ‌రాజ్.. త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ ‌ని స‌మ‌ర్ధించ‌కుండా త‌ప్పించుకునే ప్రయ‌త్నం చేయడం గ‌మ‌నార్హం. సోమ‌వారం త‌న ప్యానెల్ స‌భ్యుల‌తో క‌లిసి నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప్ర‌కాష్‌ రాజ్ ఆ త‌రువాత మీడియాతో మాట్లాడారు. ఇవి రాజ‌కీయ ఎన్నిక‌లు కాద‌ని పోటీ మాత్ర‌మేన‌ని స్ప‌ష్టం చేశారు. గెలిపించేది.. ఓడించేది ఓట‌ర్లే అని చెప్పారు. అయితే ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ చేసిన విమ‌ర్శ‌ల‌పై ప్ర‌కాష్ రాజ్ స్పందించిన తీరు ప‌లువురికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది.

ప్ర‌తి ఒక్క‌రిలోనూ ప్రేమ‌.. ఆవేశం వుంటాయ‌ని.. వాళ్ల‌ని మాట్లాడ‌నివ్వాల‌ని ప్ర‌కాష్‌ రాజ్ కోరారు. త‌న ప్యానెల్ ల‌క్ష్యం అభ్యుద‌య‌మేన‌ని తెలిపిన ప్ర‌కాష్‌ రాజ్ రాజ‌కీయ వ్యాఖ్య‌ల‌పై ద‌య‌చేపి ఎవ‌రూ ప్ర‌శ్నించ‌వ‌ద్ద‌ని ప్ర‌కాష్‌ రాజ్ కోర‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. సూటిగా ప్రశ్నిస్తూ మాట్లాడే ప్ర‌కాష్ ‌రాజ్ ఇలా డిప్ల‌మాటిక్‌ గా మాట్లాడ‌టం ఏంట‌ని అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. తాను ఏం మాట్లాడినా అది `మా` ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం చూపుతుంద‌న్న ఆందోళ‌న ప్ర‌కాష్‌ రాజ్ మాటల్లో స్ప‌ష్టంగా క‌నిపించింద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై స్పందించ‌కుండా ప్ర‌కాష్‌ రాజ్ ఇత‌ర అంశాల గురించి మాట్లాడ‌టం ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని అర్థ‌మైంది. ప్ర‌కాష్‌ రాజ్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడ‌ని కూడా విమ‌ర్శ‌లు వినిపించాయి. దీంతో ప‌వ‌న్ అనుకూల ఓట్లు ప్ర‌త్య‌ర్థికే ప‌డ‌తాయ‌ని ఓ అంచ‌నా.