Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: ఏపీ-ఎఫ్‌ డీసీ ఛైర్మ‌న్ ఎవ‌రు?

By:  Tupaki Desk   |   5 July 2019 1:30 AM GMT
ట్రెండీ టాక్‌: ఏపీ-ఎఫ్‌ డీసీ ఛైర్మ‌న్ ఎవ‌రు?
X
ఏపీ - టాలీవుడ్ కి దిశానిర్ధేశ‌నం చేసే అత్యంత కీల‌క‌మైన ఎఫ్‌ డీసీ (సినిమా - టీవీ - నాటక రంగ అభివృద్ధి సంస్థ) ఛైర్మ‌న్ పోస్ట్ ఖాళీ అయిన సంగ‌తి తెలిసిందే. గ‌త అధ్య‌క్షుడు అంబికా కృష్ణ రాజీనామా చేశాక ఆ పోస్టుకు ఎవ‌రినీ ఎంపిక చేయ‌లేదు. ఆ క్ర‌మంలోనే ఎన్నిక‌ల వేళ వైకాపా త‌ర‌పున విస్త్ర‌త ప్ర‌చారం చేసిన ప‌లువురు సినీ ప్రముఖుల్లో ఎవ‌రో ఒక‌రికి ఈ ప‌ద‌విని క‌ట్ట‌బెడ‌తార‌ని ప్ర‌చార‌మైంది. ప్రాబ‌బుల్స్ లిస్ట్ లో విజ‌య్ చంద‌ర్ - మంచు మోహ‌న్ బాబు- ఎస్వీ కృష్ణారెడ్డి- జీవిత రాజ‌శేఖ‌ర్ వంటి ప్ర‌ముఖుల పేర్లు వినిపించాయి.

ఈసారి ఏపీఎఫ్‌ డీసీ ఛైర్మ‌న్ గా న‌టుడు విజ‌య్ చందర్ కే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌న్న ముచ్చ‌టా ఫిలింస‌ర్కిల్స్ లో వినిపించింది. ఆయ‌న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కి వీరాభిమాని. తొలి నుంచి వైకాపా వెంట ఉన్నారు. అందువ‌ల్ల అత‌డిని కొత్త సీఎం జ‌గ‌న్ ఏపీఎఫ్‌ డీసీ ఛైర్మ‌న్ గా నియ‌మిస్తార‌ని భావించారు. అలాగే ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి.. జీవిత రాజ‌శేఖ‌ర్ వంటి వారి పేర్లు వినిపించినా ఛాయిస్ విజ‌య్ చంద‌ర్ కేన‌ని భావించారు. తాజాగా దీనిపై మ‌రో ఆస‌క్తిక‌ర ప్ర‌చారం తెర‌పైకొచ్చింది. సీఎం వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నామినేటెడ్ ప‌ద‌వుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నార‌న్న వార్త‌లు వెలువ‌డ‌డంతో ర‌క‌ర‌కాల ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ఈసారి ఆ ఛాన్స్ మంచు మోహ‌న్ బాబుకు ద‌క్క‌నుంద‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చార‌మ‌వుతోంది. ఇది నిజ‌మా? అంటే కానే కాద‌ని అట్నుంచి ఓ క్లారిటీ వ‌చ్చింది.

సోష‌ల్ మీడియా వార్త‌ల్ని ఖండిస్తూ మంచు కాంపౌండ్ అధికారికంగా వివ‌ర‌ణ ఇచ్చింది. ``ఆంధ్రప్రదేశ్ ఫిలిమ్‌ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్‌(ఎఫ్‌.డి.సి) చైర్మ‌న్‌ గా న‌టుడు.. నిర్మాత‌.. శ్రీవిద్యానికేత‌న్ సంస్థ‌ల అధినేత డా.మంచు మోహ‌న్‌ బాబుగారిని నియ‌మించార‌ని సోష‌ల్ మీడియాలో కొన్నిచోట్ల వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఆ వార్త‌ల్లో నిజం లేదు. రూమ‌ర్స్‌ ను న‌మ్మ‌కండి. ఒక‌వేళ అలాంటిదేమైనా ఉంటే అధికారికంగా మేమే తెలియ‌జేస్తాం`` అంటూ పీఆర్ లు ప్ర‌క‌టించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న‌దైన మార్క్ పాల‌న‌తో దూసుకుపోతున్న వేళ ఏపీ టాలీవుడ్ నిరంత‌రం హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో స‌రికొత్త‌ టాలీవుడ్ కు కొత్త సీఎం రూప‌క‌ల్ప‌నకు చేస్తున్నార‌ని ఇటీవ‌ల నిర్మాత‌ల మండ‌లి ఎన్నిక‌ల వేళ‌.. ఫిలింఛాంబ‌ర్ లో ముచ్చ‌టించుకోవ‌డం ఆస‌క్తిని రేపింది. ఆ క్ర‌మంలోనే ఎఫ్ డీసీ ప‌ద‌వికి ఎవ‌రిని ఎంపిక చేస్తున్నారో అన్న కుతూహాలం క‌నిపిస్తోంది. ఈసారి ఎఫ్ డీసీ ఛైర్మ‌న్ గా ఎవ‌రు ఎన్నికైనా అత‌డి ముందు అతి పెద్ద‌ ఛాలెంజ్ ఉంద‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే గ‌త పాల‌కుల వ‌ల్ల‌ ఏపీ టాలీవుడ్ ఆశ నీరుగారిపోయింది. అస‌లు కొత్త ప‌రిశ్ర‌మ‌ను అభివృద్ధి చేస్తారా లేదా? వినోద‌రంగాన్ని - సినిమాని గాలికి వ‌దిలేస్తారా? అంటూ ఏపీ యూత్ ఒక‌టే సీరియ‌స్ గా ముచ్చ‌టించుకుంటున్నారు. కొత్త సీఎం జ‌గ‌న్ ప‌రిశ్ర‌మ‌ను అమ‌రావ‌తిలో ఏర్పాటు చేస్తారా? లేక రెండో రాజ‌ధాని అని చెబుతున్న విశాఖ‌లో ప్లాన్ చేస్తారా? అన్న ముచ్చ‌టా వేడెక్కిస్తోంది.