Begin typing your search above and press return to search.

మెగాస్టార్ తర్వాత ఎవరు..? శ‌ర్వా వ్యాఖ్య‌ల‌తో అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌!

By:  Tupaki Desk   |   9 March 2021 5:32 AM GMT
మెగాస్టార్ తర్వాత ఎవరు..? శ‌ర్వా వ్యాఖ్య‌ల‌తో అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌!
X
తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో మెగాస్టార్ స్థానం ఎవ‌రెస్ట్ వంటిది. అనిత‌ర సాధ్య‌మైన ఆ స్థాయిని.. అకుంఠిత దీక్ష‌తో, అంత‌కు మించిన సంక‌ల్పంతో అందుకున్నారాయ‌న‌. స్వ‌యం కృషితో ఒక్కో మెట్టు ఎక్కారు.. ఈ స్థాయికి ఎదిగారు. దాదాపు రెండు ద‌శాబ్దాల‌పాటు టాలీవుడ్ లో మ‌కుఠం లేని మ‌హారాజుగా వెలుగొందారు. నెంబ‌ర్ 1 హీరోగా త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అందుకే, ఆయ‌న రాజ‌కీయాల్లోకి వెళ్లిన త‌ర్వాత కూడా.. చిరంజీవి త‌ర్వాత ఎవ‌రు అనే చ‌ర్చ మాత్ర‌మే సాగింది త‌ప్ప‌, చిరంజీవి స్థానాన్ని భ‌ర్తీచేసేదెవ‌రు అన్న డిస్క‌ష‌న్ రాలేదు. అదీ.. మెగాస్టార్ స్టామినా. ఇప్పుడు, సెకండ్ ఇన్నింగ్స్ లోనూ హ‌వా కొన‌సాగుతోంది.

ఇటు కుటుంబ‌ విష‌యానికి వ‌స్తే.. ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఓ వ‌ట‌వృక్షం. చిరంజీవి నాటిన ఆ వృక్షం ఏపుగా ఎదిగింది. ఎదుగుతూనే ఉంది. దాదాపు డ‌జ‌ను మంది హీరోలు ఆ ఫ్యామిలీ నుంచి ఉన్నారు. చిరంజీవి వార‌సుడిగా రామ్ చ‌ర‌ణ్‌, న‌ట వార‌సులుగా మిగిలిన వారు త‌మ‌దైన టాలెంట్ తో దూసుకుపోతున్నారు. మ‌రి, వీరిలో మెగాస్టార్ త‌ర్వాత ఆ స్థాయిని అందుకునే కెపాసిటీ ఎవ‌రికి ఉంద‌న్న‌ది ప్ర‌శ్న‌. ఈ చ‌ర్చ కొంత‌కాలంగా సాగుతూనే ఉన్న‌ప్ప‌టికీ.. తాజాగా శ్రీకారం సినిమా ఈవెంట్లో శ‌ర్వానంద్ చేసిన కామెంట్స్ తో మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది.

నిజానికి.. చిరంజీవి త‌ర్వాత ఆ స్థాయిని అందుకునే కెపాసిటీ ప‌వ‌ర్ స్టార్ దే అన్న విష‌యం నిర్వివాదం. ఇందులో రెండో మాట‌కు తావులేదు. ఆయ‌న మైండ్ బ్లోయింగ్‌ ఫ్యాన్ ఫాలోయింగే ఈ విష‌యాన్ని తేల్చి చెబుతుంది. కానీ.. ఆయ‌న ఇప్పుడు సీరియ‌స్ పొలిటీషియ‌న్ గా కూడా ఉన్నారు. ఇటు సినిమా, అటు రాజ‌కీయాల‌ను బ్యాలెన్స్ చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వీలైన‌న్ని సినిమాలు పూర్తిచేయాల‌ని టార్గెట్ తో వ‌రుస‌గా మూవీస్ అనౌన్స్ చేస్తున్నారు ప‌వ‌ర్ స్టార్‌. ఒక‌వేళ రాబోయే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన స‌త్తాచాటితే మ‌ళ్లీ రాజ‌కీయాల‌తో బిజీ అయిపోతార‌నే విష‌యంలో నో డౌట్. సో.. ఏం జ‌రుగుతుంద‌న్న‌ది చెప్ప‌లేం.

కాబ‌ట్టి.. ఇక మిగిలిన వారిలోనే ఆయ‌న సినీ వార‌సుడు ఎవ‌ర‌ని చ‌ర్చించుకుంటున్నారు. నిజానికి.. మెగా ఫ్యామిలీలో స‌క్సెస్ రేట్ అంద‌రిక‌న్నా ఎక్కువ‌గా ఉంది. ఒక్క‌రిద్ద‌రు మిన‌హా.. అంద‌రూ స‌క్సెస్ ఫుల్ జ‌ర్నీ కొన‌సాగిస్తున్నారు. ఈ విధంగా ఈ క‌జిన్స్ మ‌ధ్య హెల్దీ కాంపిటేష‌న్ ర‌న్ అవుతోంది. అయితే.. సాంకేతికంగా చూసుకున్న‌ప్పుడు రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ ముందు వ‌ర‌స‌లో ఉన్నారు. మెగాస్టార్ త‌ర్వాత స్థానం వీరిలో ఎవ‌రిది? అనే చ‌ర్చ వ‌చ్చిన‌ప్పుడు ఎవ‌రి లెక్క‌లు వారు చెబుతున్నారు.

రంగ స్థ‌లం ముందు వ‌ర‌కూ న‌టుడిగా ఓ లెక్క‌లో ఉన్న రామ్ చ‌ర‌ణ్‌.. ఆ సినిమాలో త‌న‌దైన న‌ట‌నా చాతుర్యాన్ని చూప‌డంతో మెగాస్టార్ బాట‌లోకి వ‌చ్చేసిన‌ట్టే అనే చ‌ర్చ జ‌రిగింది. ఇక‌, అల్లు అర్జున్ అల‌వైకుంఠ పురంలో సినిమాతో భారీ హిట్ కొట్ట‌డంతో బ‌న్నీకి కాస్త హెడ్జ్ వ‌చ్చింద‌నే టాక్ న‌డిచింది. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న RRRలో న‌టిస్తుండ‌డంతో చెర్రీ స్థాయి మ‌రో మెట్టు ఎక్కింద‌ని అంటున్నారు. ఇదే క్ర‌మంలో శ‌ర్వానంద్ ‌మాట్లాడుతూ.. మెగాస్టార్ త‌ర్వాత ఆ స్థాయి రామ్ చ‌ర‌ణ్ ది మాత్ర‌మే, ఇంకెవ్వరికీ లేదు అన‌డంతో.. ఈ విష‌యం మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

అయితే.. తోటివారిని మెగాస్టార్ ఎంత ప్రేమ‌గా చూసుకుంటారో, ఎలా ప్రోత్స‌హిస్తారో అంద‌రికీ తెలిసిందే. చెర్రీ కూడా అలాగే ఉంటాడు. త‌న ఫ్రెండ్‌ శ‌ర్వా విష‌యంలో ఇంకా ఎక్కువ‌గా స‌పోర్టుగా ఉన్నాడు. ఆ విధంగా.. మెగాస్టార్ వ్య‌క్తిత్వం చెర్రీదే అనే కోణంలో శ‌ర్వా మాట్లాడాడ‌ని ప‌లువురు అంటున్నారు. అయితే.. ఈ చ‌ర్చ‌లు, అభిప్రాయాలు ఎలా ఉన్న‌ప్ప‌టికీ అటు చెర్రీ, ఇటు బ‌న్నీ ఇద్ద‌రూ త‌మ‌ను తాము నిరూపించుకోవ‌డానికి వంద‌శాతం క‌ష్ట‌ప‌డుతున్నార‌నేది వాస్త‌వం.

అదే సంద‌ర్భంలో మ‌రో విష‌యం కూడా గుర్తించాల్సిన అవ‌స‌రం ఉంది. వీరిద్ద‌రికీ భ‌విష్య‌త్ ఇంకా ఎంతో ఉంది. వీరి కెరీర్ దాదాపు మ‌రో 30 సంవ‌త్స‌రాల పైనే కొన‌సాగొచ్చు. కాబ‌ట్టి.. ఈ సుదీర్ఘ కెరీర్లో ఏం జ‌రుగుతుంది.. అన్న విష‌యాన్ని ఇప్పుడే అంచ‌నా వేయ‌లేం. ఇప్పుడే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేయ‌డం కూడా స‌మంజ‌సంగా అనిపించ‌దు. అంతేకాదు.. ప‌వ‌న్ క‌నుక సినిమాల‌పైనే ఫుల్ ఫోక‌స్ పెడితే వీరిద్ద‌రూ వెన‌క్కి వెళ్లిపోయే అవ‌కాశాన్ని కూడా కాద‌న‌లేం. సో.. ఆవిధంగా మెగాస్టార్ త‌ర్వాత స్థానాన్ని అందుకునే ఆ మెగాహీరో ఎవ‌రు అనేది నిర్ణ‌యించాల్సింది కాలం మాత్ర‌మే!