Begin typing your search above and press return to search.

మొదట ఆ రిస్క్ తీసుకునేది ఎవరు?

By:  Tupaki Desk   |   6 May 2020 5:03 PM GMT
మొదట ఆ రిస్క్ తీసుకునేది ఎవరు?
X
కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించమునుపే థియేటర్లను మూసివేసిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ఎప్పుడు విరమిస్తారో ఎవరూ సరిగ్గా అంచనా వేయలేకుండా ఉన్నారు కానీ లాక్ డౌన్ విరమణ తర్వాత కూడా మొదటి దశలో థియేటర్లలో సినిమా ప్రదర్శనలకు అనుమతి ఇస్తారని ఎవరూ ఆశించడం లేదు. ప్రజలు గుమికూడే అవకాశం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో సినిమా థియేటర్లు కూడా ఉంటాయి కాబట్టి ఎంతో ఆలోచించిన తర్వాతే ప్రభుత్వం అనుమతి మంజూరు చేస్తుంది.

అయితే ఇప్పుడు చర్చ జరుగుతున్న అంశం ఏంటంటే సినిమా థియేటర్లను రీ ఓపెన్ చేసిన తర్వాత ఎవరు మొదటగా తమ సినిమాలను రిలీజ్ చేస్తారు? ఎందుకంటే మొదటగా రిలీజ్ చేస్తున్న సినిమాలకు రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుందనే అభిప్రాయాలు ట్రేడ్ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ప్రేక్షకులు భయం లేకుండా థియేటర్లకు వస్తారా? లేదా కొద్ది రోజులు వేచి చూసే ధోరణి అవలంబిస్తారా అనేది ఇప్పుడే ఎవరూ ఊహించలేకుండా ఉన్నారు. ఒకవేళ ప్రేక్షకులు మునుపటిలాగే టికెట్లు కొనుక్కుని సినిమాలు చూస్తే సరే కానీ అలా కాకుండా ఆక్యుపెన్సీ తక్కువగా ఉంటే మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంది.

దీంతో కొందరు మొదట చిన్న సినిమాలు లేదా డబ్బింగ్ సినిమాలను అనుమతించాలని..రిస్క్ ఫ్యాక్టర్ తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా లేదా అనే విషయం అంచనా వేసేందుకు వీలు చిక్కుతుందని అంటున్నారు. అయితే ఆ రిస్క్ తీసుకునేందుకు వారు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది ఆలోచించాలి. ఆగష్టు నాటికి థియేటర్ల విషయంలో క్లారిటీ వస్తుందని ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.