Begin typing your search above and press return to search.

యూఎస్ లో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలపై ఆసక్తి చూపించడం లేదా..?

By:  Tupaki Desk   |   27 April 2022 8:30 AM GMT
యూఎస్ లో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలపై ఆసక్తి చూపించడం లేదా..?
X
కరోనా పాండమిక్ నేపథ్యంలో సినిమాల ఓవర్ సీస్ మార్కెట్ కుదేలైపోయిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు పరిస్థితులు చక్కబడటంతో మెల్లగా పుంజుకుంటోంది. ఇటీవల కాలంలో విడుదలైన కొన్ని తెలుగు సినిమాలు యూఎస్ఏలో విశేష ప్రేక్షకాదరణ తెచ్చుకొని.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టాయి.

ప్రమోషనల్ కంటెంట్ తో మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షించిన 'డీజే టిల్లు' లాంటి చిన్న చిత్రాలు కూడా యునైటెడ్ స్టేట్స్ లో మంచి వసూళ్ళు సాధించాయి. అలానే RRR మరియు 'కేజీయఫ్ 2' వంటి భారీ బడ్జెట్ సినిమాలు అక్కడ సెన్సేషనల్ కలెక్షన్స్ అందుకున్నాయి.

అయితే RRR & KGF-2 సినిమాల తర్వాత ఓవర్ సీస్ ఆడియన్స్ పెద్దగా రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. USAలో 'ఆచార్య' అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ చాలా తక్కువగా ఉండటంతో ఇలాంటి సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన సినిమా ''ఆచార్య''. మెగా తండ్రీకొడుకులను స్ర్కీన్ పై చూసేందుకు అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మెగా మూవీ.. ఈ శుక్రవారం (ఏప్రిల్ 29) గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

రేపు గురువారం 'ఆచార్య' యూఎస్ ప్రీమియర్స్ పడనున్నాయి. ఈ నేపథ్యంలో చాలా రోజుల క్రితమే ఓవర్ సీస్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. అయితే ప్రీ సేల్స్ ఆశించిన స్థాయిలో లేవు. చాలా ఏరియాలలో అడ్వాన్స్ బుకింగ్స్ డల్ గా ఉన్నాయి.

తండ్రీకొడుకులు చిరంజీవి - చరణ్ తొలిసారిగా కలిసి నటిస్తున్న పూర్తి స్థాయి సినిమా ''ఆచార్య''. అందులోనూ RRR మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకుని ఫుల్ జోష్ లో ఉన్నారు చెర్రీ. క్రేజీ కాంబోను పరిగణనలోకి తీసుకుంటే బుకింగ్స్ చాలా తక్కువగానే ఉన్నాయని అనుకోవాలి.

యూఎస్ లో బిగ్ స్టార్ హీరోల చిత్రాలు మరియు ప్రమోషనల్ కంటెంట్ తో బజ్ క్రియేట్ చేసిన సినిమాలను చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ 'ఆచార్య' సినిమా విషయంలో అలా జరగలేదు. దీనిని బట్టి ఇటీవల రెండు భారీ సినిమాలు చూసిన తర్వాత.. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు చూడటానికి అక్కడి జనాలు ఆసక్తి కనబరచడంలేదని అర్థం అవుతుంది.

గురువారం ప్రదర్శించే ఎర్లీనూన్ ప్రీమియర్ షోలకు వచ్చే ఫస్ట్ టాక్ ని బట్టి సినిమా ఓపెనింగ్స్ ఆధారపడి ఉంటాయి. మొదటి షోకు వచ్చే డీసెంట్ టాక్.. ప్రీమియర్ సేల్స్ మరియు అడ్వాన్స్ బుకింగ్స్ పెంచడంలో సహాయపడుతుంది. మరి 'ఆచార్య' విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

ఇక 'ఆచార్య' చిత్రానికి టికెట్ ధరలు పెంచుకోడానికి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. దీంతో మేకర్స్ రేట్లు పెంచి బుకింగ్స్ ఓపెన్ చేశారు. టికెట్ ధరల పెంపు కారణంగా తెలుగు రాష్ట్రాల్లోనూ బుకింగ్స్ స్లో గా ఉన్నాయని తెలుస్తోంది. మరి ఈ రెండు రోజుల్లో పుంజుకుంటాయేమో చూడాలి.

కాగా, ధర్మస్థలి నేపథ్యానికి నక్సలిజం బ్యాక్ డ్రాప్ ను జోడించి 'ఆచార్య' సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో చిరు - చరణ్ ఇద్దరూ నక్సలైట్స్ గా కనిపించనున్నారు. చెర్రీ కి జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ మరియు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు.