Begin typing your search above and press return to search.

ఆమిర్ ఖాన్ ఇలా తయారయ్యాడేంటి?

By:  Tupaki Desk   |   9 Dec 2022 6:00 AM GMT
ఆమిర్ ఖాన్ ఇలా తయారయ్యాడేంటి?
X
కొన్నేళ్ల ముందు వరకు ఇండియాలో నంబర్ వన్ హీరో ఎవరు అంటే ఆమిర్ ఖాన్ పేరే చెప్పేవాళ్లు. లగాన్, రంగ్ దె బసంతి, త్రీ ఇడియట్స్, పీకే, దంగల్ లాంటి చిత్రాలతో అతను మామూలు విజయాలు అందుకోలేదు. బాలీవుడ్ అనే కాక ఇండియాలో మిగతా హీరోలందరినీ వెనక్కి నెట్టి తిరుగులేని స్థాయిలో నిలబడ్డాడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. అలాంటి హీరోకు కొన్ని నెలల కిందట 'లాల్ సింగ్ చడ్డా'తో దారుణమైన అనుభవం ఎదురైంది.

'దంగల్'తో రెండు వేల కోట్లు కొల్లగొట్టిన ఆమిర్... ఈ సినిమాతో కనీసం వంద కోట్ల మార్కును కూడా అందుకోలేకపోయాడు. విడుదలకు ముందే విపరీతమైన నెగెటివిటీని ఎదుర్కొన్న ఈ చిత్రానికి నెగెటివ్ రివ్యూలు మరింత చేటు చేశాయి. బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్‌గా నిలిచింది 'లాల్ సింగ్ చడ్డా'. ఆ దెబ్బతో సినిమాల నుంచి బ్రేక్ తీసుకుని కొంత కాలం సైలెంటుగా ఉండాలని నిర్ణయించుకున్నాడు ఆమిర్. కొత్తగా అతను ఏ సినిమానూ ప్రకటించలేదు కూడా.

ఐతే స్వతహాగా ఆమిర్ ముస్లిం అయినప్పటికీ.. గతంలో ఎవరూ అతణ్ని ఆ కోణంలో చూసేవారు కాదు. కానీ కొన్నేళ్ల ముందు మోడీ సర్కారును టార్గెట్ చేస్తూ అతను చేసిన 'ఇన్‌టాలరెన్స్' కామెంట్లు తనపై ఓ ముద్రే వేసేశాయి. ఆ తర్వాత మరి కొన్ని చర్యలు తనకు హిందూ వ్యతిరేకిగా పేరు తెచ్చాయి. 'లాల్ సింగ్ చడ్డా' సహా బాలీవుడ్ సినిమాలు చాలా వాటిని టార్గెట్ చేస్తున్నది హిందూ ప్రో గ్యాంగులే అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన మీద పడ్డ ముద్రను తొలగించుకోవడానికి ఆమిర్ గట్టి ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

తన కూతురిని ఒక హిందూ కుర్రాడికి ఇచ్చి అతను ఇటీవలే పెళ్లి చేసిన సంగతి తెలిసిందే. ఈ ముద్ర తొలగించుకోవడానికి ఏరి కోరి ఈ సంబంధం చేశాడని కాదు. నిజానికి ఆమిర్ కూతురిది ప్రేమ పెళ్లి. ఐతే ఈ పెళ్లికి ఆమిర్ అడ్డు చెప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

తాజాగా అతను హిందూ ఆలయంలో పూజలు చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో పూర్తిగా అవతారం మార్చి కనిపిస్తున్నాడు ఆమిర్. గుర్తు పట్టడమే కష్టమయ్యేట్లు ఉంది. లుక్ సంగతి పక్కన పెడితే ఆమిర్ ఇలా హిందూ ఆలయంలో, ఒక హిందువులా పూజలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. దీన్ని ఒక వర్గం స్వాగతిస్తుంటే.. ఇంకో వర్గం నెగెటివిటీని తగ్గించుకునేందుకు చేస్తున్న గిమ్మిక్కుగా అభివర్ణించింది. ఐతే ఆమిర్ గతంలో భగవద్గీత గొప్పదనాన్ని, హిందూ పురాణాలను కొనియాడాడు కాబట్టి ఇప్పుడేదో గిమ్మిక్ చేస్తున్నాడని అనలేం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.