Begin typing your search above and press return to search.

సుశాంత్ బ్యాంక్ అకౌంట్ ఎందుకు క్లోజ్ చేయాలి అనుకున్నాడు...?

By:  Tupaki Desk   |   8 Aug 2020 6:15 AM GMT
సుశాంత్ బ్యాంక్ అకౌంట్ ఎందుకు క్లోజ్ చేయాలి అనుకున్నాడు...?
X
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌ పుత్ సూసైడ్ కేసు మిస్ట‌రీ థ్రిల్లర్ ని తలపిస్తూ రోజుకో మ‌లుపు తిరుగుతోంది. జూన్ 8న సుశాంత్ మాజీ మేనేజర్ దిశా సలియాన్ ఆత్మహత్య చేసుకొని మరణించిన కొన్ని రోజుల్లోనే సుశాంత్ కూడా తన ఫ్లాట్ లో బలవన్మరణం పొందడం అనేక అనుమానాలను రేకెత్తించింది. అదే సమయంలో సుశాంత్ చనిపోవడానికి ఇండస్ట్రీలోని నెపోటిజం కారణమని.. తనకు అవకాశాలు రాకుండా చేసి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారు అనే వాదన కూడా వినిపించింది. సుశాంత్ ది ఆత్మ‌హ‌త్య అని పోస్ట్ మార్టం నివేదిక చెప్తున్నా.. ఆ త‌ర్వాత ద‌ర్యాప్తులో వెలుగుచూస్తున్న విషయాలు ఎన్నో సందేహాల‌కు తావిస్తోంది. అయితే సుశాంత్ సింగ్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం వెన‌క నిజానిజాలేమిటి? అన్న‌ది ఇప్పటి వరకు విచారించిన పోలీసులు తేల్చ‌లేదు. ఇప్పుడు ఈ కేసును సీబీఐకి బదిలీ చేయడంతో మరిన్ని విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి.

కాగా సుశాంత్ మరణించడానికి కొన్ని రోజుల ముందు ముంబైలోని ఓ బ్యాంక్ లో తనకు సంబంధించిన ఖాతాను క్లోజ్ వేయవలసిందిగా కోరాడని నేషనల్ మీడియా ఛానల్స్ వెల్లడించాయి. దీంతో ఈ కేసులో మరో చర్చకు దారితీసింది. ఇప్పటి వరకు సుశాంత్ ని హత్య చేసి ఉంటారనే కోణంలో ఆలోచిస్తున్నవారు.. ముందే అతను తన బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలని అనుకున్నాడని తెలియడంతో.. సుశాంత్ సూసైడ్ చేసుకోవాలని ముందే నిర్ణయించుకున్నాడా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం సుశాంత్ ఆత్మహత్య చేసుకొని మరణించినా.. దాని వెనుక బలమైన కారణాలని.. దానికి కారణమైన వారిని గుర్తించవలసిన అవసరం ఉందని.. సీబీఐ విచారణలో ఈ కేసుకి సంబంధించిన అన్ని విషయాలు బయటకి వస్తాయని ఆశిస్తున్నారు.

మరోవైపు ఈ కేసు దర్యాప్తుని సీబీఐ ముమ్మరం చేసింది. సుశాంత్‌ కేసులో ఆరుగురిని నిందితులుగా చేర్చుతూ ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు చేసింది. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని ఏ1 నిందితురాలుగా ప్రకటించింది. ఆమెతో పాటు ఏ2గా రియా తం‍డ్రి ఇంద్రజిత్ చక్రవర్తి, ఏ3గా తల్లి సంధ్య చక్రవర్తి, ఏ4గా సోదరుడు షోవిక్ చక్రవర్తి, ఏ5గా సుశాంత్ ఇంటి మేనేజర్ శామ్యూల్ మిరిండా, ఏ6గా సుశాంత్ బిజినెస్ వ్యవహారాలు చూసుకునే మాజీ మేనేజర్ శ్రుతి మోదీలను నిందితులుగా చేర్చింది. ఇక ఈడీ సైతం రియా చక్రవర్తితో పాటు పలువురిని విచారించింది.