Begin typing your search above and press return to search.

దావూద్ ఇబ్ర‌హీంపై బాలీవుడ్ కు ఎందుకంత మోజు?

By:  Tupaki Desk   |   29 March 2021 7:56 AM GMT
దావూద్ ఇబ్ర‌హీంపై బాలీవుడ్ కు ఎందుకంత మోజు?
X
సినిమాల‌కు క్రైమ్ అనేది క‌థావ‌స్తువుగా మార‌డం స‌హ‌జం. క్రైమ్ సినిమాల‌కు ఒక వ్య‌క్తి జీవితం క‌థావ‌స్తువు కావ‌డం అరుదు. ఒక‌సారితో అదికూడా తీరిపోతుంది. కానీ.. ఒకే వ్య‌క్తి నేర‌చ‌రిత్ర‌తో మ‌ళ్లీ సినిమా వ‌స్తే..? మ‌ళ్లీ మ‌ళ్లీ సినిమాలు తీస్తే..? అది దావూద్ ఇబ్ర‌హీం జీవితం మాత్ర‌మే అవుతుంది. ముంబై నేర సామ్రాజ్యానికి అధిప‌తిగా వ్య‌వ‌హ‌రించిన దావూడ్ జీవితంపై ఇప్ప‌టి వ‌ర‌కూ చాలా సినిమాలు వ‌చ్చాయి. తాజాగా.. వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ‘డి కంపెనీ’ అంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తలెత్తుతున్న ప్రశ్న ఒక్కటే.. దావూద్ ఇబ్ర‌హీం అంటే బాలీవుడ్ కు ఎందుకు అంత మోజు అని!

దావూద్ ఇబ్ర‌హీం ఇప్పుడు ఎలా ఉంటాడో దాదాపుగా ఎవ్వ‌రికీ తెలియ‌దు.. కానీ, అత‌ని పేరు మాత్రం క్రైమ్ పై క‌నీస అవ‌గాహ‌న ఉన్న‌వారంద‌రికీ తెలుసు. ఇప్ప‌టి వ‌ర‌కూ దావూద్ బ్యాక్ డ్రాప్ తో అండ‌ర్ వ‌ర‌ల్డ్ సినిమాలు చాలా వ‌చ్చాయి. చోటా రాజ‌న్‌, చోటా ష‌కీల్‌, డోలాస్ వంటి మాఫియా డాన్ ల క‌థ‌లు కూడా వెండితెర‌పై ఆవిష్కృతం అయ్యాయి. ఇందులో.. దావూద్ పైనే రిపీటెడ్ గా సినిమాలు రావ‌డం గ‌మ‌నార్హం.

ప్ర‌ధానంగా బాలీవుడ్ లోనే ఈచిత్రాలు తెర‌కెక్కాయి. ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్‌వ‌ర్మ నుంచి అనురాగ్ క‌శ్య‌ప్ వ‌ర‌కు చాలా మంది త‌మ సినిమాల్లో దావూద్ జీవితాన్నిచూపించారు. అనురాగ్ క‌శ్య‌ప్ ‘బ్లాక్ ఫ్రైడే’, రామ్ గోపాల్ వ‌ర్మ ‘కంపెనీ’, నిఖిల్ అద్వానీ ‘డి డే’ వంటి సినిమాలన్నీ దావూద్ కథతోనే ప్రాణంపోసుకున్నాయి. మిలన్ లుథ్రియా ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై’ సినిమా.. దావూద్ మాఫియా డాన్ గా ఎలా ఎదిగాడ‌ని చూపించింది.

2002లో వ‌చ్చిన రామ్ గోపాల్ వ‌ర్మ ‘కంపెనీ’ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో దావూద్ ఇబ్ర‌హీం - చోటా రాజ‌న్ మ‌ధ్య ఏర్ప‌డిన వివాదాన్ని చ‌ర్చించారు. మ‌ళ్లీ ఇప్పుడు ‘డీ కంపెనీ’ పేరుతో వస్తున్నాడు ఆర్జీవీ. ఇందులో మాఫియా డాన్ కావ‌డానికి ముందు దావూద్ చ‌రిత్ర ఏంట‌నేది చూపించ‌బోతున్నారు.

అయితే.. ఇలా దావూద్ మీద బాలీవుడ్లో వ‌రుస సినిమాలు రావ‌డానికి కార‌ణాన్ని వివరించారు ఆర్జీవీ. క్రైమ్ అనేది ఎవ‌ర్ గ్రీన్ ఫార్ములా అని చెప్పారు. ప్రేక్ష‌కుల నుంచి మీడియా వ‌ర‌కు దీనిపై ఆస‌క్తి ఉంటుంది. అందుకే.. నేర సామ్రాజ్యం మీద చిత్రాలు వ‌స్తూనే ఉంటాయ‌ని తెలిపారు. అయితే.. అంత మాత్రాన నేర‌గాళ్ల‌ను హీరోలుగా అనుకోవ‌డానికి లేద‌ని, అది కేవ‌లం సినిమాగానే చూడాల‌ని చెప్పారు. ఇక‌, దావూద్ ను మ‌ళ్లీ మ‌ళ్లీ చూడ‌డానికి కార‌ణం.. అత‌ని గురించి ఎవ్వ‌రికీ పూర్తిగా తెలియ‌క‌పోవ‌డ‌మేన‌ని చెప్పారు. ఆయ‌న చేసిన నేరాల‌ను చూశారుగానీ.. అత‌న్ని ఎవ్వ‌రూ చూడ‌లేదు. అందుకే.. ఆయ‌న సినిమాల‌పై ఆస‌క్తి ఉంటుంద‌ని తెలిపారు.

కాగా.. ట్రేడ్ అన‌లిస్టులు మాత్రం మాఫియా చిత్రాల‌పై ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి త‌గ్గింద‌ని చెబుతున్నారు. గ‌తంలో మాదిరిగా సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌లేక‌పోతున్నాయ‌ని చెబుతున్నారు. వ‌ర్మ మాత్రం ఇందుకు భిన్న‌మైన కామెంట్స్ చేశారు. మ‌రి, నిజంగా ఆడియ‌న్స్ అభిరుచి మారిందా? అనేది చూడాలి.