Begin typing your search above and press return to search.

దీక్ష కోసం మానేశాడా...?

By:  Tupaki Desk   |   14 Aug 2020 11:30 AM GMT
దీక్ష కోసం మానేశాడా...?
X
మెగా బ్రదర్ నాగబాబు ఏకైక కుమార్తె నిహారిక కొణిదెల నిశ్చితార్థ వేడుక అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్ లోని ఓ హోటల్ లో నిర్వహించిన ఈ వేడుకకి నిహారిక పెదనాన్న చిరంజీవి - సురేఖ దంపతులతో పాటు అల్లు అరవింద్ రామ్ చరణ్ - ఉపాసన, అల్లు అర్జున్ - స్నేహారెడ్డి, వరుణ్ తేజ్, సాయి ధ‌ర‌మ్ తేజ్, వైష్ణవ్ తేజ్, కళ్యాణ్ దేవ్ - శ్రీజతో సహా మెగా ఫ్యామిలీకి చెందిన అందరు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. అయితే ఈ ఎంగేజ్మెంట్ వేడుకలో నిహారిక బాబాయ్ అయిన పవన్ కళ్యాణ్ కనిపించకపోవడం అనేక చర్చలకు దారితీసింది. నాగబాబు పవన్ కి సొంత అన్నయ్య అనే కాకుండా జనసేన పార్టీ వ్యవహారాల్లో కూడా భాగం పంచుకుంటూ ఉంటారు. అలాంటిది అన్నయ్య కూతురి నిశ్చితార్థ వేడుకకు పవన్ హాజరుకాకపోవడానికి కారణం ఏమిటని అందరూ ఆలోచించారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కావాలనే రాలేదా లేదా కుదరక రాలేదా అని అనేక ప్రశ్నలు లేవనెత్తారు. అయితే పవన్ ప్రస్తుతం స్వామీజీలు పీఠాధిపతులు ఆచరించే చాతర్మాస్య దీక్ష ఆచరిస్తున్నాడు. అందువల్ల ఈ వేడుకకి అటెండ్ కాలేకపోయుండొచ్చు అని కూడా అనుకున్నారు. కానీ ఇటీవల పవన్ కళ్యాణ్ తన అభిమాని నితిన్ పెళ్లి కొడుకు ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు కూడా దీక్షలోనే ఉన్నాడు. అలాంటప్పుడు ఇంటిలో జరిగే శుభకార్యానికి పవన్ రాకపోవడం పెద్ద చర్చనీయాంశం అయింది.

పవన్ కళ్యాణ్ గతంలో కూడా చాలాసార్లు మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ కి డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ఎన్నిసార్లు డిస్కషన్ జరిగినా అదే రిపీట్ అవుతూ వచ్చింది. ఒకానొక సందర్భంలో నాగబాబు సైతం సహనం కోల్పోయి 'మేము అన్ని ఫంక్షన్స్ కి పవన్ కళ్యాణ్ ని పిలుస్తాం.. వాడు రాడు. మమ్మల్ని ఏమి చేయమంటారు' అంటూ ఆవేదన వ్యక్తం చేసాడు. అయితే ఆ తర్వాత కొన్ని ఫ్యామిలీ వేడుకల్లో పవన్ కనిపించాడు. మళ్ళీ ఇప్పుడు ఇంట్లో జరిగే వేడుకలో కనిపించకపోవడంతో పవన్.. ఈ వేడుకకు రాకపోవడానికి బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అని అనుమానాలు వ్యక్తం చేసారు. అయితే పవన్ తన అన్న కూతురు ఎంగేజ్మెంట్ కి అటెండ్ కాకపోవడానికి దీక్షలో ఉండటమే కారణమని మెగా అభిమానులు చెప్తున్నారు. చాతర్మాస్య దీక్షలో ఉండగా సాయంత్ర 6 గంటలు దాటితే బయటకి రాకూడదనే నియమం పాటిస్తూ పవన్ ఈ వేడుకకి హాజరు కాలేదని అంటున్నారు. అంతేకాకుండా పవన్ నిన్న డే టైంలో వచ్చి నిహారికని ఆశీర్వదించి వెళ్లారని కూడా చెప్తున్నారు. మెగా ఫ్యాన్స్ చెప్తున్న రీజన్ ఎంత నిజమో తెలియదు కానీ పవన్ తన సొంత అన్న కూతురు నిశ్చితార్థ వేడుకలో కనిపించలేదనేది మాత్రం నిజం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఇది వారి ఫ్యామిలీ సమస్య.. పవన్ కళ్యాణ్ ఈ వేడుకు రావడం రాకపోవడం అనేది ఆయన వ్యక్తిగత నిర్ణయం.. ఆ విషయంలో జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదని మరికొందరు అంటున్నారు.