Begin typing your search above and press return to search.

పోసాని వ్యాఖ్యలపై మెగా క్యాంప్ మౌనంగా ఉందేంటి..?

By:  Tupaki Desk   |   29 Sep 2021 3:30 PM GMT
పోసాని వ్యాఖ్యలపై మెగా క్యాంప్ మౌనంగా ఉందేంటి..?
X
జనసేన అధినేత పవన్ కల్యాణ్ - సినీ నటుడు, దర్శక నిర్మాత పోసాని కృష్ణమురళి మధ్య చెలరేగిన వివాదం అవాంఛనీయమైన మలుపు తిరిగింది. సినిమా ఫంక్షన్ లో పవన్ ఏపీ ప్రభుత్వం మీద చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. పోసాని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. దీంతో పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి అసభ్యకరమైన మెసేజ్ లు వేల కొలదీ ఫోన్ కాల్స్ వస్తున్నాయంటూ పోసాని మంగళవారం మరోసారి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో నిర్వహించారు. ఉద్వేగంగా ఆవేశంగా మాట్లాడిన పోసాని.. పవన్ కల్యాణ్ మీద తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డారు.

రెండు ప్రెస్ మీట్లలో పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణ మురళి అనేక ఆరోపణలు చేయడమే కాకుండా.. రాయలేని పదజాలంతో దూషించారు. తన భార్యను తిట్టించిన వాడిని ఎన్నైనా తిట్టిచ్చు అంటూ.. పవన్ ఫ్యామిలీని ఇన్వాల్స్ చేస్తూ కొన్ని షాకింగ్ కామెంట్స్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. దీంతో పవన్ ఫ్యాన్స్ - జనసేన పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియాలో పోసాని ని విమర్శించడమే కాకుండా.. ఆయనపై పోలీస్ కేసు కూడా పెట్టారు. పోసాని పరిమితులు దాటి కొన్ని వ్యాఖ్యలు చేసినా.. ఇంతవరకు దీనిపై మెగా క్యాంప్ స్పందించలేదు.

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీలోనే ఎక్కువ మంది నటీనటులు ఉన్నారు. సుమారు డజను మంది సినిమాల్లో నటిస్తుండగా.. వారిలో నలుగురైదుగురు స్టార్ డమ్ ఉన్నవారు. అయితే పవన్ మీద తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేసినా వీరిలో ఎవరూ ప్రత్యక్షంగా స్పందించలేదు. పవన్ కు సపోర్ట్ గా ఒక్కరూ బయటకు రాలేదు. మెగా బ్రదర్ నాగబాబు మాత్రం ఇన్స్టాగ్రామ్ లో మీమ్స్ తో నెటిజన్స్ అడిగే వాటికి సమాధానం చెప్పాడు తప్పితే.. దీనిపై తన సొంత అభిప్రాయాన్ని చెప్పలేదు.

గతంలో పవన్ కళ్యాణ్ ను ఓ మహిళ వ్యక్తిగతంగా దూషించడంతో మెగా ఫ్యామిలీ మొత్తం ఫిలిం ఛాంబర్ కు వచ్చి నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. కానీ ఈసారి మాత్రం ఎందుకనో మెగా ఫ్యామిలీ మౌనం వహిస్తోంది. పవన్ కళ్యాణ్ చిత్ర పరిశ్రమ కోసమే మాట్లాడారని చెబుతున్నా.. ఇండస్ట్రీ నుంచి మద్దతు లభించలేదు. పవన్ వ్యక్తిగత వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది. పవన్ తో ఏకీభవించనని.. తను నిర్మాతల వైపే ఉంటానాని మంచు విష్ణు అన్నారు. అక్కినేని నాగార్జున వంటి వారు కూడా తెలుగు రాష్ట్రాలు ఇండస్ట్రీ అభివృద్ధి కోసం పాటుపడుతున్నాయని చెబుతూ పరోక్షంగా పవన్ తో ఏకీభవించనని తెలియజేసారు. ఈ క్రమంలో పోసాని రెండుసార్లు మీడియా ముఖంగా పవన్ ను నిందించారు. మరి త్వరలోనే మెగా క్యాంప్ దీనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుందేమో చూడాలి.