Begin typing your search above and press return to search.

ఎన్నికలకు దూరంగా మహేష్.. కారణమేంటి?

By:  Tupaki Desk   |   13 April 2019 11:45 AM GMT
ఎన్నికలకు దూరంగా మహేష్.. కారణమేంటి?
X
మహేష్ బాబు ఈసారి పట్టించుకోలేదు.. ఓటేయమని అడగలేదు.. తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పాలుపంచుకోలేదు. గత డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ ఓటు వేయాలని.. అది మన బాధ్యత అని ట్విట్టర్ ద్వారా ఓటర్లు, అభిమానులకు పిలుపునిచ్చిన మహేష్ బాబు స్వయంగా కదిలివచ్చి ఓటు కూడా వేశారు. మీడియాకు తాను ఓటు వేశానని సిరా గుర్తు ఉన్న వేలు చూపించి స్ఫూర్తిని చాటారు. కానీ ఈ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం స్పందించకపోవడం హాట్ టాపిక్ గా మారింది.

ఈసారి మహేష్ బాబు ట్విట్టర్ లోనూ, డైరెక్ట్ గానూ ఎన్నికలపై స్పందించలేదు. ఓటు వేయమని కోరలేదు.. వచ్చి ఓటు వేయలేదు. మహేష్ బాబు తరుఫున సోషల్ మీడియా వింగ్ నిర్వహించే వారు కూడా ఓటు గురించి కనీసం ప్రచారం కూడా చేయలేదు. ఈ సారి మహేష్ బాబు ఇలా ఎందుకు ప్రవర్తించాడో అర్థం కాక అభిమానులు, ప్రజలు అర్థం కాక తలలు పట్టుకున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు తన ‘మహర్షి’ సినిమా విడుదల చేసేందుకు షూటింగ్ లో కష్టపడుతున్నాడు. మే 9న రిలీజ్ దగ్గరపడడంతో దానిమీదే దృష్టి పెట్టాడని.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడని.. అందుకే హైదరాబాద్ లో ఓటు వేయడానికి రాలేదని మహేష్ అభిమానులు చెబుతున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు తన ‘మహర్షి’ సినిమా ప్రమోషన్ పై కూడా దృష్టి సారించారు. వరుసగా తన ట్విట్టర్ ద్వారా సినిమా పాటలు విడుదల చేస్తూ బిజీగా ఉన్నాడు. అందుకే తన బావ పోటీచేస్తున్న ఏపీ ఎన్నికలపై కానీ.. నివాసం ఉంటున్న తెలంగాణలో ఎన్నికలపై స్పందించడానికి.. ఓటు వేయాలని కోరడం చేయకుండా మహేష్ సైలెంట్ గా ఉన్నాడని తెలుస్తోంది.