Begin typing your search above and press return to search.

అఖిల్ విషయంలో ఏం జరుగుతోందబ్బా..?

By:  Tupaki Desk   |   31 Jan 2019 10:52 AM GMT
అఖిల్ విషయంలో ఏం జరుగుతోందబ్బా..?
X
అక్కినేని అఖిల్ తన తాజా చిత్రం 'Mr. మజ్ను' హిట్ అవుతుందని.. తనకు బ్రేక్ ఇస్తుందని రిలీజ్ కు ముందు నమ్మకంగా ఉన్నా ఫలితం మాత్రం అందుకు తగ్గట్టుగా లేదు. నిజానికి ఈ సినిమాకు ఉన్నంత అనుకూలమైన పరిస్థితి అఖిల్ నటించిన గత రెండు సినిమాలకు లేదు. అయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మందకొడిగా వసూళ్లు నమోదు చేయడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసే అంశమే.

అఖిల్ మొదటి సినిమా నిజంగానే బాగాలేదు. దానికి తోడూ ఓవర్ హైప్.. స్టార్ హీరో అనే రేంజ్ లో ప్రొజెక్ట్ చేయడం సినిమాపై నెగెటివ్ గా ఇంపాక్ట్ చూపించింది. ఆ సినిమా ఎఫెక్ట్ రెండో సినిమా మీద కూడా పడిందనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. 'హలో' కు పాజిటివ్ టాక్ వచ్చినా జనాలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. సరే 'హలో' అంటే కాంపిటీషన్ లో రిలీజ్ అయింది కాబట్టి నిలబడలేదు అనుకున్నా అఖిల్ తాజా చిత్రం పరిస్థితి మరీ తీసికట్టులా ఉంది. కాంపిటీషన్ లేదు.. సినిమాకు యావరేజ్ రివ్యూస్.. డీసెంట్ మౌత్ టాక్ వచ్చింది. అయినా సినిమాకు బిలో యావరేజ్ కలెక్షన్స్ రావడం ఎందుకనేది ఇప్పుడు అంతుచిక్కడం లేదు. సినిమా బడ్జెట్ తక్కువే అయినా అందులో కూడా 60% రికవరీతో సరిపెట్టుకోవాల్సి రావడం నిజంగా ఆలోచించాల్సిన అంశమే.

అఖిల్ ను స్టార్ హీరోలా ప్రొజెక్ట్ చేయడం వల్లే నెగెటివిటీ ఏర్పడిందని కొందరు అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు కానీ దానికి మించి కూడా కొన్ని వేరే అంశాలు ఉన్నాయని మరికొందరు అంటున్నారు. నాగార్జునకు వయసు మీదపడడం తో అక్కినేని ఫ్యాన్ బేస్ తగ్గడం ఒక కారణం అయితే.. అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున తర్వాత ఫ్యాన్ బేస్ నిలబెట్టే హీరోలు ఒక్కరు కూడా లేకపోవడం పెద్ద మైనస్ అయింది. చైతు..సుమంత్.. సుశాంత్ ఇలా ఎంతమంది ఉన్నప్పటికీ వీరు ప్రేక్షకుల సహనానికి పరిక్షలు పెడుతున్నారు గానీ ఈ జెనరేషన్ యూత్ ను ఫ్యాన్స్ గా ఏర్పరుచుకునే సినిమాలు చేయడం లేదు. ఈ ముగ్గురిలో కొద్దో గొప్పో సక్సెస్ అయిన చైతు కూడా తనకంటూ ఒక ప్రత్యేకత చూపలేకుండా ఉన్నాడు. నాగార్జున తనయుడిగా.. ఎఎన్నార్ మనవడిగా కాకుండా నాగ చైతన్య కు ప్రత్యేకంగా ఫ్యాన్ ఒక్కరైనా ఉన్నారా అనే కఠినమైన ప్రశ్న వేసుకుంటే మనకు సమాధానం ఇట్టే దొరుకుతుంది.

ఇదిలా ఉంటే అఖిల్ ఎంచుకున్న సినిమాలు కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో ఆ సినిమాలు ఆడియన్స్ ను థియేటర్ల వరకూ రప్పించలేకపోతున్నాయి. అఖిల్ ఎందుకు సక్సెస్ కాలేకుండా ఉన్నాడు అంటే.. అఖిల్ చేస్తున్నవి ఫార్మాట్ సినిమాలు. వాటి రిజల్ట్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది.. అలా కాకుండా విజయ్ దేవరకొండ.. నిఖిల్.. వరుణ్ తేజ్ తరహాలో కొత్తదనం కోసం ప్రయత్నిస్తేనే ఒక్కసినిమాతో కాకపోయినా రెండు మూడు సినిమాలు చేసే సమయానికి సక్సెస్ఫుల్ హీరోగా నిలబడతాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అఖిల్ ఈ ఫెయిల్యూర్ల నుండి ఎలాంటి పాఠాలు నేర్చుకుంటాడో వేచి చూడాలి. ఏదేమైనా అఖిల్ 'స్టార్ మెటీరియల్' అనే విషయంలో మాత్రం ఎవరికీ సందేహాలు లేవు.