Begin typing your search above and press return to search.

ఉలుకు ప‌లుకు లేని భార‌తీయుడు! అస‌లేం జ‌రుగుతోంది?

By:  Tupaki Desk   |   15 Feb 2021 10:13 AM IST
ఉలుకు ప‌లుకు లేని భార‌తీయుడు! అస‌లేం జ‌రుగుతోంది?
X
ఊహించ‌ని కొన్ని వైప‌రీత్యాలు.. ఆర్థిక ఇబ్బందులు భార‌తీయుడు 2కి తొలి నుంచి ఇబ్బందిక‌రంగా మారిన సంగ‌తి తెలిసిందే. 2.0 ప‌రాజ‌యం భారీ న‌ష్టాల నేప‌థ్యంలో అప్ప‌టికే ప్ర‌క‌టించేసిన భార‌తీయుడు 2కి భారీ పెట్టుబ‌డులు పెట్టేందుకు లైకా సంస్థ సంశ‌యించింది. అయితే ఎంత‌కూ రాజీకి రాని శంక‌ర్ బ‌డ్జెట్ల ప‌రంగానూ కుద‌ర‌ద‌ని అన్నారు.

ఆ త‌ర్వాత ర‌క‌ర‌కాల గొడ‌వ‌ల‌తో ఆ ప్రాజెక్ట్ కి బ్రేకులు ప‌డ్డాయి. దీనికి తోడు సెట్స్ లో భారీ క్రేన్ యాక్సిడెంట్ శంక‌ర్ అసిస్టెంట్ల మ‌ర‌ణం వ‌గైరా టీమ్ ని తీవ్రంగా క‌ల‌వ‌ర‌పెట్టాయి. పోలీస్ కేసులు ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. ఇలాంటిది శంక‌ర్ ఎప్పుడూ చూడ‌లేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో శంక‌ర్ క‌ల‌త‌లు ఇంకా తీరిన‌ట్టు లేవు. ఈలోగానే క‌రోనా మ‌హ‌మ్మారీ విరుచుకుప‌డ‌డం మ‌రో పెద్ద శాపంగా ప‌రిణ‌మించింది. 9 నెల‌ల పాటు షూటింగు అన్న‌దే లేదు. `భార‌తీయుడు 2` కి అన్ని విధాలుగా ఏదీ క‌లిసిరాలేద‌నే చెప్పాలి.

అయితే మ‌హ‌మ్మారీ విజృంభ‌ణ త‌గ్గుముఖం పట్టాక.. లాక్ డౌన్ ఎత్తేశాక కూడా శంక‌ర్ - లైకా బృందంలో ఎలాంటి క‌ద‌లికా లేదు. ఇత‌రులు షూటింగుల‌తో బిజీగా ఉంటే వీళ్ల‌లో మాత్రం క్లారిటీ మిస్స‌య్యింది. అస‌లేం జ‌రుగుతోంది. ఇంత‌కీ భార‌తీయుడు 2 ఉన్న‌ట్టా లేన‌ట్టా? అన్న‌దానికి శంక‌ర్ కానీ లైకా వాళ్లు కానీ ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోవ‌డం సందేహాల‌కు తావిస్తోంది. కొంత షెడ్యూల్ పూర్త‌య్యాకా ఎందుకీ డైల‌మా? ఇండియన్ 2 షూటింగ్ ‌ను తిరిగి ప్రారంభించక‌పోవ‌డానికి కార‌ణ‌మేమిటి? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి.

అంతేకాదు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల మ‌ధ్య క‌ల‌త‌లు తీర‌క‌పోవ‌డంతో ఈ చిత్రం పూర్తిగా నిలిపేశార‌ని ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవలే శంకర్ రామ్ చరణ్ తో కొత్త సినిమాని ప్రకటించడంతో దీనికి మ‌రింత ఆజ్యం పోసిన‌ట్ట‌య్యింది. ఇండియన్ 2 ఆగిపోయిన‌ట్టేన‌న్న సందేహాలు మ‌రింత బ‌ల‌ప‌డ్డాయి. ఇంత జ‌రుగుతున్నా లైకా ప్రొడక్షన్స్ నుండి అధికారిక ప్ర‌క‌ట‌న రాక‌పోవ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. క‌నీసం ఇప్ప‌టికి అయినా టీమ్ స‌భ్యులు డ్యామేజ్ కంట్రోల్ చేస్తారా లేదా? అన్న‌ది చూడాల్సి ఉంది.