Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ కృష్ణ పార్దివ దేహాన్ని గచ్చిబౌలి స్టేడియంకు తీసుకురాలేదెందుకు?

By:  Tupaki Desk   |   16 Nov 2022 4:11 AM GMT
సూపర్ స్టార్ కృష్ణ పార్దివ దేహాన్ని గచ్చిబౌలి స్టేడియంకు తీసుకురాలేదెందుకు?
X
అనూహ్యంగా అనారోగ్యానికి గురి కావటం.. ఆ వెంటనే ఆసుపత్రికి తరలించటం.. రోజులో పరిస్థితి విషమించటం.. చివరకు తిరిగి రాని లోకాలకు సూపర్ స్టార్ కృష్ణ పయనం కావటం పలువురిని కలత చెందేలా చేసింది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన సూపర్ స్టార్ మరణం ఆయన అభిమానులతో పాటు.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్ని వేదనకు గురి చేసింది. ఆయన్ను కడసారి చూసేందుకు పలువురు ఉత్సాహాన్ని చూపించారు. ఇందుకోసం ప్రభుత్వం తరఫు నుంచి ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి కూడా.

గచ్చిబౌలి స్టేడియంలో సూపర్ స్టార్ కృష్ణ పార్దివ దేహాన్ని ప్రజల సందర్శనార్ధం ఉంచాలని భావించారు. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో తీసుకున్నారు. ఆ వెంటనే ఏర్పాట్లు పెద్ద ఎత్తున మొదలయ్యాయి. సాయంత్రం ఐదు గంటల నాటికి అన్ని ఏర్పాట్లు పక్కాగా పూర్తి అయిన వేళ.. గచ్చిబౌలి స్టేడియంకు తీసుకురావాల్సిన సూపర్ స్టార్ కృష్ణ పార్దివదేహాన్ని నానక్ రాం గూడలోని ఆయన నివాసంలోనే ఉంచేశారు.

ఎందుకిలా జరిగింది? ఇంటి నుంచి స్టేడియంకు ఎందుకు తరలించలేదు? అన్నీ ఏర్పాట్లు అయిన తర్వాత ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. ఇదే విషయాన్ని సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. గచ్చిబౌలి స్టేడియంకు సూపర్ స్టార్ పార్దివ దేహాన్ని తీసుకురావటం లేదన్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకు మించి మాట్లాడేది లేదన్న ఆయన.. వారి కుటుంబ సభ్యులు ఏమనుకున్నారో తనకు తెలీదని. వారు ఇవ్వమన్న సమాచారాన్ని బాధ్యతగా ఇస్తున్నట్లుగా చెప్పారు.

విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో మొదట్లో ఓకే చెప్పినా.. తర్వాత కుటుంబ సభ్యుల మధ్య జరిగిన చర్చలో మాత్రంస్టేడియం కంటే కూడా ఇంట్లో ఉంచటమే సరైన నిర్ణయంగా భావించినట్లుగా చెబుతున్నారు.

ఈ కారణంతోనే గచ్చిబౌలి స్టేడియంలో అన్ని ఏర్పాట్లుచేసినా.. ఆయన కడసారి ఉండే కొన్ని గంటలైనా.. ఆయనకు ఎంతో ఇష్టమైన ఇంట్లోనే ఉంచేసి.. ఆ తర్వాత పద్మాలయ స్టూడియోకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి మహాప్రస్థానానికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో సూపర్ స్టార్ కృష్ణ అంతిమ సంస్కారాలు జరుగుతాయన్న విషయం తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.