Begin typing your search above and press return to search.

#క‌రోనా సాయంలో టాలీవుడ్‌ స్టార్స్ బేజార్‌

By:  Tupaki Desk   |   26 March 2020 3:44 AM GMT
#క‌రోనా సాయంలో టాలీవుడ్‌ స్టార్స్ బేజార్‌
X
ఎలాంటి విప‌త్తు వ‌చ్చినా చిత్ర పరిశ్రమ సాయానికి ఎప్పుడూ ముందుంటుంది. స్టార్స్.. దర్శక నిర్మాతలు తమ వంతుగా సాయం చేసి ఆదుకునేందుకు ప్రయత్నిస్తారు. కరోనా మ‌హ‌మ్మారీ వల్ల పది రోజులుగా షూటింగ్‌ లన్నీ ఆగిపోయాయి. రోజు వారి కూలీపై ఆధారపడే సినీ కార్మికుల పరిస్థితి అస్థవ్యస్తంగా మారుతోంది. పది రోజులుగా పనిలేకపోవడంతో పూటగడవని పరిస్థితి చాలా మంది కార్మికుల కుటుంబాల్లో నెలకొంది. అయినా టాలీవుడ్‌ స్టార్స్ ఎవరూ ఇంత‌వర‌కూ కనికరించడం లేదు. ఎంతో కొంత సాయం చేద్దామని ముందుకొచ్చేందుకు ఆసక్తి చూపకపోవడం గమనార్హం. అడపాదడపా స్పందిస్తున్నారు తప్పితే పెద్ద మొత్తంగా ముందుకొచ్చేందుకు ఏ స్టార్‌ హీరో ధైర్యం చేయకపోవడం బాధాకరం.

హీరో నితిన్‌ తన వంతుగా ఏపీ.. తెలంగాణ ప్రభుత్వాలకు చెరో పది లక్షలు అందించారు. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ `మనంసైతం` సేవా సంస్థకి ఐదు లక్షల విరాళ అందించారు. కాదంబరి కిరణ్‌ ద్వారా నడిచే ఈ సంస్థ ద్వారా పేద కార్మికుల.. సాంకేతిక నిపుణులకు ఆర్థిక సాయం చేయనున్నారు. అలాగే హీరో రాజశేఖర్‌ పేద కళాకారులకు నిత్యవసర వస్తువులు అందజేశారు. మాజీ `మా` అధ్యక్షుడు శివాజీ రాజా సైతం తన వంతుగా సరుకులు అందజేశారు. ఇక టాలీవుడ్ లో అగ్ర హీరోలు అని చెప్పుకునేవాళ్లు ఎవరూ క‌నీసం ఫుడ్ ప్యాకేజీలు అయినా సాయం చేయ‌లేదన్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలా ఉంటే తమిళనాట పెద్ద స్టార్స్ స్పందించి భారీ విరాళం ప్రకటించడం అభినందనీయం. ఫిల్మ్ ఎంప్లాయీస్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా(ఫెఫ్సీ) సంస్థకి రజనీకాంత్‌ రూ.50 లక్షలు.. విజయ్‌ సేతుపతి రూ.10, సూర్య.. కార్తి రూ.10 లక్షలు.. శివకార్తికేయన్‌ రూ.10 ఇప్పటికే ప్రకటించారు. వీరి జాబితాలో కమల్‌.. శంకర్‌, ధనుష్‌ కూడా చేరారు. కమల్‌ హాసన్‌ రూ.10 లక్షలు... ధనుష్‌ 15 లక్షలు.. శంకర్‌ రూ.10 లక్షలు విరాళం ప్రకటించారు. దర్శకుడు హరి వంద బస్తాల బియ్యం అందజేశారు. నిర్మాత డిల్లీబాబు 20 బస్తాల బియ్యం వితరణగా ఇచ్చారు. తమిళ సినిమా జర్నలిస్ట్ డైలీస్‌ అసోసియేషన్‌ తరఫున కొంత సాయం చేశారు. మరోవైపు నటి.. ఎమ్మేల్యే రోజా `ఫెఫ్సీ`కి వంద బియ్యం బస్తాలను అందజేశారు.

ఇదిలా ఉంటే కమల్ కేవల విరాళం ప్రకటించడమే కాదు.. తన ఇంటినే ఆసుపత్రిగా మారుస్తానంటున్నాడు. ఈ సందర్భంగా కమల్‌ స్పందిస్తూ.. ``ఈ క్లిష్ట పరిస్థితుల్లో పేదలకు సేవలందించాలనుకుంటున్నా. నా పార్టీ `ముక్కల్‌ మయ్యం`లోని వైద్యులతో కలిసి.. నా ఇంటిని ఆసుప్రతిగా మార్చాలని భావిస్తున్నా. ప్రభుత్వం అనుమతిస్తే నా ఇంటిని ఇచ్చేందుకు సిద్ధమే`` అని పేర్కొన్నాడు. దీంతో ఆయన నిర్ణయానికి సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. దీంతో కోలీవుడ్‌ స్టార్‌ భేష్‌.. టాలీవుడ్‌ స్టార్స్ బేజార్ అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.