Begin typing your search above and press return to search.

మన దర్శకుల్లో ఆ దమ్మెంత?

By:  Tupaki Desk   |   16 Oct 2018 7:35 AM GMT
మన దర్శకుల్లో ఆ దమ్మెంత?
X
ఆస్కార్ అవార్డ్ అంటే అందనంత దూరం.. అదీ మనవల్ల కాదులే అన్న సందేహం ఉండేది. తెలుగు సినిమానే కాదు.. బాలీవుడ్ - కోలీవుడ్ సహా అందరికీ ఆస్కార్ అవార్డ్ కొట్టేంత సినిమా తీయాలని కలలు అయితే ఉన్నాయి కానీ.. వాటిని అందుకునే ప్రయత్నం చేయడం లేదు. ఎంత సేపు అదే కమర్షియల్ పంథా.. ఆరు పాటలు - మూడు ఫైట్లు - పాత చింతకాయ పచ్చడి కథ.. కొత్తగా ఆలోచించడం లేదు..

ఎన్నో రోజుల తర్వాత బహుబలితో రాజమౌళి ఆ కోరిక తీర్చాడు.. కానీ అందులోని పాటలు - ఊహకందని గ్రాఫిక్స్ తో ఆ సినిమా ఆస్కార్ కు నామినేట్ కాలేకపోయింది. ఆస్కార్ నామినేషన్ కు వెళ్లి నెగ్గాలంటే సహజత్వానికి దగ్గరగా ఉండాలి. అదీ బాహుబలిలో లేదు కాబట్టి నామినేట్ కాలేకపోయింది. పాటలు గట్రా ఉంటే వాళ్లు తిరస్కరిస్తారు..

నిజానికి ఎప్పుడో 1960లో ఇండియన్ సినిమా ఆస్కార్ కు నామినేట్ అయ్యింది. ఆ తర్వాత ఉత్తమ విదేశీ చిత్రంగా కూడా పలు సినిమాలు నిలిచాయి. కానీ ఆస్కార్ ఉత్తమ చిత్రంగా మలిచే సత్తా మన దర్శకుల్లో ఎంతుంది.? అంటే ఆమడదూరమేనని అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో వచ్చిన ‘ఘాజీ’ మూవీకి కొంత స్కోప్ ఉండేది. కానీ దాన్ని జాతీయస్తాయి అవార్డులకే పరిమితం చేశారు. అంతర్జాతీయంగా పంపితే మనకు గుర్తింపు దక్కి ఉండేది.

ఎంత సేపు డబ్బులు - లెక్కలు - కలెక్షన్ల మాయలోనే ఇండియన్ సినిమా నడుస్తోంది. తెలుగు హీరోలైతే ఫ్లాపులొద్దు అంటూ ప్రయోగాలే చేయడం లేదు. అదే కమర్షియల్ పంథా.. కొడితే విలన్లందరూ గాల్లో లేచిపోవాలి. ఇలాంటి సినిమాలు వస్తునంత సేపు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారేమో కానీ.. ఆస్కార్ అవార్డ్ కు కాదు కదా.. కనీసం జాతీయ ఉత్తమ చిత్రాల వైపు కూడా మన తెలుగు చిత్రాలు వెళ్లవు. ఇప్పటికైనా కొంచెం వినూత్న, విభిన్న చిత్రాలు తీస్తే తెలుగు సినిమా ఖ్యాతి కూడా ఇనుమడిస్తుంది. అలాంటి సినిమాలు రావలంటే ఇప్పుడున్నోళ్లతో సాధ్యం అవుతుందో..? లేక కొత్త వాళ్లు రావాలో చూడాలి మరి.