Begin typing your search above and press return to search.

అమెజాన్ కు రజని అంత స్పెషలా

By:  Tupaki Desk   |   17 Feb 2019 5:30 PM GMT
అమెజాన్ కు రజని అంత స్పెషలా
X
డిజిటల్ ఎంటర్ టైన్మెంట్ లో కొత్త విప్లవానికి దారి తీసిన అమెజాన్ ప్రైమ్ ఇప్పటికే కీలకమైన రెండు సంక్రాంతి సినిమాలను నెల తిరగడం ఆలస్యం తన సైట్ లో పెట్టేసింది. ఎన్టీఆర్ కథానాయకుడుతో పాటు ఈ ఏడాదిలో ఇప్పటిదాకా నిలిచిన సోలో బ్లాక్ బస్టర్ ఎఫ్2 కూడా ఆన్ లైన్ లోకి వచ్చేసింది.రేపో ఎల్లుండో వినయ విధేయ రామ కూడా రానుంది. పుల్వామా ఉదంతం దేశాన్ని కుదిపేస్తున్న తరుణంలో ఇది వాయిదా వేసినట్టు సమాచారం. అయితే విదేశీ స్ట్రీమింగ్ యాప్స్ లో ఇప్పటికే అందుబాటులో ఉంది.

అయితే రజనీకాంత్ పేట గురించి సంస్థ ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. తమిళ్ లో ఇంకా రన్ కొనసాగుతోంది అనుకున్నా మరి ఇక్కడ అంత కన్నా బ్రహ్మాండంగా ఆడుతున్న ఎఫ్2 ని మొహమాటం లేకుండా పెట్టారుగా. అలాంటప్పుడు పేట మాత్రం ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారనే సందేహం రావడం సహజం. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. పేటతో పాటు రజనితో శంకర్ తీసిన విజువల్ వండర్ 2.0 హక్కులు కూడా అమెజాన్ ప్రైమ్ వద్దే ఉన్నాయి. 75 రోజులు దాటేసినా దాని ఊసు కూడా లేదు. మొత్తంగా రెండు రజని సినిమాలు పెండింగ్ లో ఉన్నాయి.

తెలుగు సినిమాలకు మాత్రం నెల లేదా నలభై రోజులని గిరి గీసుకుని మరీ ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా అర్దరాత్రే అప్ లోడ్ చేస్తున్న అమెజాన్ రజని సినిమాల విషయంలో మాత్రం ఎందుకు వెసులుబాటును పాటిస్తోందో. ఒకవేళ అక్కడి నిర్మాతలు ముందుచూపుతో గడువు విషయంలో జాగ్రత్త పడ్డారా. అదే నిజమైతే మనవాళ్ళు కూడా ఇకపై తొందరపడకుండా కాస్త థియేటర్లలో సినిమా నిలిచే దాకా ఆన్ లైన్ లోకి రాకుండా ఒప్పందాలు చేసుకుంటే బెటర్.