Begin typing your search above and press return to search.

కొత్త బంగారు లోకంలో అడుగు పెట్టింది

By:  Tupaki Desk   |   14 Dec 2018 4:44 AM GMT
కొత్త బంగారు లోకంలో అడుగు పెట్టింది
X
తెలుగు ప్రేక్షకులకు కొత్త బంగారు లోకం చిత్రం తో చిన్న వయస్సులోనే హీరోయిన్‌ గా పరిచయం అయిన శ్వేత బసు ప్రసాద్‌ మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత కూడా ఈమె కు తెలుగు లో మంచి ఆఫర్లు వచ్చాయి. కాని శ్వేత బసు అదృష్టం కలిసి రాకపోవడంతో పెద్దగా స్టార్‌ డంను దక్కించుకోలేక పోయింది. ఐటెం సాంగ్స్‌, స్టేజ్‌ షోలతో అలరిస్తూ వచ్చిన శ్వేత బసు హిందీ బుల్లి తెర కు వెళ్లి అక్కడ సెటిల్‌ అయ్యింది.

బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ అనురాగ్‌ కశ్యప్‌ వద్ద అసిస్టెంట్‌ గా ఉన్న సమయంలో రోహిత్‌ మిట్టల్‌ తో పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరి వివాహ నిశ్చితార్థం గత సంవత్సరంలోనే జరిగిందని వార్తలు వచ్చాయి. ప్రేమ గురించి, పెళ్లి గురించి ఇంత కాలం మౌనంగా ఉంటూ వచ్చిన శ్వేత బసు తాజాగా పెళ్లి కూడా చాలా సైలెంట్‌ గా చేసుకుంది. ఈ జంట నిన్న పెళ్లితో ఒక్కటి అయ్యారు. అతి కొద్ది మంది బందు మిత్రుల సమక్షంలో వీరిద్దరు మార్వాడీ పద్దతిలో ఏకం అయ్యారు.

పెళ్లి గురించి ఇప్పటి వరకు వీరిద్దరు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాని వీరి పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలు బందువులు మరియు స్నేహితుల ద్వారా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కెరీర్‌ లో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్న శ్వేత బసు కొత్త బంగారు లోకం వంటి వైవాహిక జీవితంలో అడుగు పెట్టింది. శ్వేత బసు ప్రసాద్‌ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ పెళ్లి శుభాకాంక్షలు.