Begin typing your search above and press return to search.

సోనూను ఆకాశానికి ఎత్తేసే తెలుగు మీడియా చిరును పట్టించుకోరేం?

By:  Tupaki Desk   |   28 May 2021 4:30 AM GMT
సోనూను ఆకాశానికి ఎత్తేసే తెలుగు మీడియా చిరును పట్టించుకోరేం?
X
నిస్వార్థంగా.. ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించకుండా కష్టంలో ఉన్న వారికి సాయం చేసేందుకు వీలుగా సేవా కార్యక్రమాల్ని చేపట్టే వారెవరైనా సరే అభినందించాలి. వారు చేస్తున్న మంచి పనుల గురించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీడియాకు ఉంది. సినీ నటుడు సోనూ సూద్ చేస్తున్న సామాజిక కార్యక్రమాలకు సంబంధించిన కవరేజ్.. తెలుగు మీడియా మాత్రమే కాదు ఇతర రాష్ట్రాలకు చెందిన మీడియా సంస్థలతో పాటు.. జాతీయ మీడియా సంస్థలకు ఆయనకు పెద్ద పీట వేస్తుంటాయి. మంచి పనులు చేస్తున్నప్పుడు ఆ మాత్రం ప్రచారం ఇవ్వటం తప్పేం కాదు.

కానీ.. టాలీవుడ్ ప్రముఖుడు.. తెలుగు సినీ రంగానికి మెగాస్టార్ అయిన చిరంజీవి.. ఇటీవల చేపట్టిన సామాజిక కార్యక్రమాలు.. ఆయన చేపడుతున్న పనులు.. అందుకోసం ఆయన సొంతంగా ఖర్చు చేస్తున్న వైనం ఇప్పుడు ఆసక్తికంగా మారింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తీవ్రమైన ఆక్సిజన్ కొరత ఏర్పడిన వేళ.. పెద్ద ఎత్తున ఆక్సిజన్ సిలిండర్లతో పాటు.. కాన్స్ ట్రేటర్లతో పాటు ప్రాణవాయువును అవసరమైన వారికి అందిస్తున్న ఉదంతాలెన్నో.

సరిగ్గా ఇదే కార్యక్రమాన్ని భారీగా చేపట్టిన మెగాస్టార్ చిరంజీవి.. తాజాగా గుంటూరులో ప్రత్యేక చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకును ఏర్పాటు చేస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. రానున్న రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు దీన్ని విస్తరిస్తానని చెబుతున్నారు. తమ ట్రస్టు ద్వారా ఆక్సిజన్ అవసరం అన్న వారికి వెంటనే.. తమ వాహనంలోనే ఆక్సిజన్ పంపేలా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లా (తెలంగాణలో అయితే ఉమ్మడి జిల్లాలో) కేంద్రంలో ఈ ఆక్సిజన్ బ్యాంకుల్ని ఏర్పాటు చేసి ప్రజలకు ప్రాణవాయువును అందించాలన్న భారీ సంకల్పానికి తెర తీశారు. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం.. జిల్లాలో ఏర్పాటు చేసే ఒక్కో ఆక్సిజన్ బ్యాంకు దగ్గర దగ్గర రూ.60 -70 లక్షల వరకు ఖర్చు ఉంటుందని చెబుతున్నారు.

ఇంత భారీగా ఖర్చు చేస్తున్న వేళ.. చిరంజీవికి ఉన్న ఇమేజ్ కు ఆయన చేస్తున్న మంచి పనికి సంబంధించి భారీగా వార్తలు రావాల్సి ఉంది. అదేం సిత్రమో కానీ.. తెలుగు మీడియాలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుల గురించి పెద్దగా కవర్ చేసింది లేదు. పేపర్లను పక్కన పెడదాం.. చివరకు టీవీ చానళ్లకు ఏమైంది. చిరంజీవి చేపట్టిన మెగా క్యాంప్ ను చాలా చిన్న బిట్ గా మార్చి.. సినిమా న్యూస్ కు పరిమితం చేయటం ఏమిటి? అన్న విమర్శ వినిపిస్తోంది. సామాజిక సేవా కార్యక్రమాల్ని చేపట్టే సోనూకు ఇచ్చే కవరేజీలో పది శాతం కూడా చిరుకు ఇవ్వకపోవటం దేనికి సంకేతం? ఆయన చేసే మంచి పనుల్ని సైతం చెప్పటానికి తెలుగు మీడియాకు నోరు రావట్లేదా? అంటూ పలువురు మండిపడుతున్నారు.