Begin typing your search above and press return to search.

'భీమ్లా నాయక్' ఇట్లా చేస్తాడని ఎవరూ అనుకోలే!

By:  Tupaki Desk   |   1 March 2022 7:30 AM GMT
భీమ్లా నాయక్ ఇట్లా చేస్తాడని ఎవరూ అనుకోలే!
X
పవన్ కల్యాణ్ లో అభిమానులు ఎక్కువగా ఇష్టపడేది ఆయనలోని ఆవేశాన్నే. ఆవేశమనేది ఆయన బాడీ లాంగ్వేజ్ లో కలిసిపోయి కనిపిస్తుంది. ఆవేశం .. దూకుడు ఆయనకి అలంకారమనే అభిమానులు అంటారు. అలాంటి పవన్ కి ఆవేశంతో కూడిన పాత్ర పడితే ఎలా ఉంటుంది? అలాంటి ఒక పవర్ఫుల్ పాత్ర చుట్టూ కథ చేతులు కట్టుకుని తిరిగితే ఎలా ఉంటుంది? అనే ప్రశ్నకి సమాధానంగా 'భీమ్లా నాయక్' కనిపిస్తుంది. ఫిబ్రవరి 25వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లను కొల్లగొడుతూ వెళుతోంది.

సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే - సంభాషణలు అందించాడు. ఈ సినిమాకి తమన్ బాణీలను సమకూర్చాడు. ఈ సినిమాకి వెళ్లినవారు 'అంత ఇష్టమేందయ్యా' పాట ఇక వస్తుంది .. ఇక వస్తుంది అనుకుంటూ శుభం కార్డు పడేవరకూ వెయిట్ చేశారు .. కానీ ఆ పాట మాత్రం రాలేదు. ఇది పవన్ - నిత్యామీనన్ కాంబినేషన్లో వచ్చేపాట. ఈ సినిమాలో ఈ ఇద్దరూ భార్యాభర్తలు. తన భర్త ముద్దుముచ్చట్లకు మురిసిపోయే నిత్యామీనన్ వైపు నుంచి వచ్చే పాట ఇది.

తమన్ ఇచ్చిన ట్యూన్ .. చిత్ర ఆలాపన ఈ పాటను అందరి మనసులకు కనెక్ట్ చేశాయి. సున్నితంగా సాగుతూ .. సుతారంగా మనసు పొరలను మీటే పాట ఇది. సాధారణంగా పవన్ సినిమాల్లో ఈ తరహా పాటలు తక్కువగా పడుతుంటాయి. అలాంటిది ఈ పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

చాలా కాలం తరువాత చిత్ర గల పరిమళాన్ని పరిచయం చేసిన పాట ఇది. అలాంటి ఈ పాట సినిమాలో లేకపోవడం ఒక వెలితిగానే కనిపించింది. ఈ పాటను ఎందుకు తీసేశారనే ఆలోచనతోనే థియేటర్లలో నుంచి జనాలు బయటికి వచ్చారు.

అయితే ఈ సినిమా నిడివి ఎక్కువైందనే కారణంగా తొలగించిన కొన్ని సన్నివేశాలను, రెండవ వారం నుంచి యాడ్ చేయనున్నారనే ఒక టాక్ బలంగానే వినిపిస్తోంది. దాంతో ఈ పాటను కూడా యాడ్ చేస్తారనే అభిమానులు భావిస్తున్నారు. కానీ అసలు ఆ పాటనే చిత్రీకరించలేదనేది వాళ్లకి నిరాశను కలిగించే విషయం.

ఈ సాంగ్ ను రికార్డు చేశామనీ .. అయితే కథకి అడ్డుపడుతుందనే ఉద్దేశంతో చిత్రీకరించలేదని తాజా ఇంటర్వ్యూలో సాగర్ కె చంద్ర చెప్పాడు. దాంతో 'భీమ్లా నాయక్' ఇంతపని చేశాడేంటబ్బా అనుకుంటూ అభిమానులంతా ఉసూరుమంటున్నారు.