Begin typing your search above and press return to search.

ప్ర‌తిష్ఠాత్మ‌క ప్ర‌భుత్వ అవార్డ్.. హీరోకి అన్యాయం?

By:  Tupaki Desk   |   16 Aug 2019 8:49 AM GMT
ప్ర‌తిష్ఠాత్మ‌క ప్ర‌భుత్వ అవార్డ్.. హీరోకి అన్యాయం?
X
త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తిపై భాజ‌పా ప్ర‌భుత్వం కుట్రకు పాల్ప‌డిందా? అత‌డికి అందాల్సిన క‌ళైమామ‌ణి పుర‌స్కారాన్ని ద‌క్క‌కుండా మోకాల‌డ్డుతోందా? అంటే అవున‌నే సోష‌ల్ మీడియాలో ఇటీవ‌ల ప్ర‌చారం సాగింది. క‌శ్మీర్ విష‌యంలో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు బిల్లును ఆమోదించ‌డం స‌రికాద‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసినందుకు సేతుప‌తికి ఇవ్వాల్సిన పుర‌స్కారం ఇవ్వ‌లేద‌ని ఫ్యాన్స్ లో ముచ్చ‌ట సాగింది.

అయితే ఇందులో నిజం ఎంత‌? అంటే.. సామాజిక మాధ్య‌మాల్లో జ‌రుగుతున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేద‌ని తాజాగా తెలుస్తోంది. ఇటీవ‌ల త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎడ‌ప్ప‌డి ప‌ళ‌నిస్వామి రాష్ట్ర ప్ర‌భుత్వ అవార్డుల్ని విజేత‌లకు అంద‌జేశారు. 2017 లో రిలీజైన విక్ర‌మ వేద చిత్రానికి గాను విజ‌య్ సేతుప‌తికి అప్ప‌ట్లోనే ప్ర‌భుత్వం క‌ళైమామ‌ణి అవార్డును ప్ర‌క‌టించింది. అప్ప‌ట్లో పుర‌స్కార గ్ర‌హీత‌ల పేర్ల‌ను ప్ర‌క‌టించారు. ఆ పుర‌స్కారాల్ని మంగ‌ళ‌వారం (ఆగ‌స్టు 13) నాడు అంద‌జేశారు. అయితే ఈ వేదిక‌పై విజ‌య్ సేతుప‌తి పేరును పిల‌వ‌క‌పోవడం వ‌ల్ల‌నే ఈ అపార్థం జ‌రిగింది. సేతుప‌తిని కావాల‌నే అవార్డుల వేదిక‌పైకి పిల‌వ‌లేద‌ని ప్ర‌చారం సాగింది.

అయితే ఈ అపార్థం వెన‌క కార‌ణం వేరేగా ఉంది. చెన్న‌య్ క‌ళైవ‌న‌ర్ అరంగ‌మ్ వేదిక‌గా సాగుతున్న అవార్డుల పంపిణీ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యేందుకు విజ‌య్ సేతుప‌తి చాలా ముందే బ‌య‌ల్దేరినా ట్రాఫిక్ వ‌ల్ల రెండు గంట‌ల ఆల‌స్యం అయ్యింది. దాంతో అతడు వెన్యూ వ‌ద్ద లేర‌నే ఉద్ధేశంతో వేదిక‌పై వ్యాఖ్యాత ఆ పేరును పిల‌వ‌లేద‌ట‌. ఆల‌స్య‌మైనా అవార్డుల కార్య‌క్ర‌మానికి వెళ్లాల‌నే ప‌ట్టుద‌ల‌తో విజ‌య్ సేతుప‌తి అక్క‌డికి హాజ‌ర‌య్యారు. కానీ అతడి పేరును పిల‌వ‌క‌పోవ‌డంతో అపార్థం చోటు చేసుకుంద‌ని తెలుస్తోంది. ఆర్టిక‌ల్ 370ని వ్య‌తిరేకించినందుకే సేతుప‌తిపై రాజ‌కీయం చేశార‌ని దీనివ‌ల్ల‌ ప్ర‌చార‌మైంది. అయితే అప్పుడు ఇవ్వ‌క‌పోయినా ఈ వారంలో ఆ అవార్డును ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి స్వ‌యంగా విజ‌య్ సేతుప‌తికి అందించ‌నున్నార‌ని తెలుస్తోంది. సేతుప‌తి టాలీవుడ్ చిత్రం సైరా-న‌ర‌సింహారెడ్డిలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ప‌లు భారీ చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు.