Begin typing your search above and press return to search.

మేక్ ఆర్ బ్రేక్.. నాగ్‌ కు బిగ్ డే

By:  Tupaki Desk   |   2 April 2021 5:30 AM GMT
మేక్ ఆర్ బ్రేక్.. నాగ్‌ కు బిగ్ డే
X
అక్కినేని నాగార్జున కెరీర్లో మరో పరీక్షకు సమయం ఆసన్నమైంది. కొన్నేళ్లుగా దారుణ పరాజయాలు చవిచూస్తున్న ఆయన.. తన కొత్త చిత్రం ‘వైల్డ్ డాగ్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శుక్రవారమే ఈ చిత్రం థియేటర్లలోకి దిగుతోంది. నాగ్ చివరి సినిమా ‘మన్మథుడు-2’ ఎంత పెద్ద డిజాస్టరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అంతకుముందు ‘ఆఫీసర్’ కథా తెలిసిందే. ఈ సినిమాల ధాటికి నాగ్ మార్కెట్ బాగా దెబ్బ తినేసింది. ఈ ప్రభావం ‘వైల్డ్ డాగ్’ మీదా పడింది. ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో బుకింగ్స్ లేవు. వచ్చే వారం ‘వకీల్ సాబ్’ భారీ అంచనాల మధ్య విడుదల కానున్న నేపథ్యంలో వారం రోజుల వ్యవధిలో ‘వైల్డ్ డాగ్’ వీలైనంత ఎక్కువ వసూళ్లు రాబట్టాలి. తొలి రోజు ఓపెనింగ్సే చాలా డల్లుగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్నందుకుంటుందన్నది టాక్ మీదే ఆధారపడి ఉంది.

‘వైల్డ్ డాగ్’కు చాలా మంచి టాక్ వస్తే తప్ప నాగ్‌కు ఉత్సాహాన్నిచ్చే ఫలితం రావడం కష్టం. ఈ సినిమా మంచి ఫలితం అందుకోలేదంటే.. నాగ్ మీద ట్రేడ్ నమ్మకం సడలిపోతుంది. ఆయన కెరీర్ మరింత పతనం కావడం ఖాయం. కాబట్టి ‘వైల్డ్ డాగ్’తో మేక్ ఆర్ బ్రేక్ సిచువేషన్ ఎదుర్కొంటున్నాడు అక్కినేని కథానాయకుడు. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రానికి ‘సుల్తాన్’తో పోటీ ఎదురవుతోంది. ఇంతకుముందు ‘ఊపిరి’లో నాగ్‌ తో స్క్రీన్ షేర్ చేసుకున్న కార్తి హీరోగా నటించిన చిత్రమిది. ట్రైలర్ మాస్‌ను ఆకట్టుకునేలా ఉండటంతో ఆ సినిమాకు మంచి టాక్ వస్తే ‘వైల్డ్ డాగ్’కు ముప్పు తప్పదు. ఈ నేపథ్యంలో ‘వైల్డ్ డాగ్’కు కచ్చితంగా ఫుల్ పాజిటివ్ టాక్ రావాల్సిందే. ‘మహర్షి’ రచయిత సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ్.. ఎన్ఐఏ ఆఫీసర్‌గా నటించాడు. గోకుల్ చాట్ పేలుళ్లకు బాధ్యులైన ఉగ్రవాద ముఠాను మట్టుపెట్టే అండర్ కవర్ ఆపరేషన్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.