Begin typing your search above and press return to search.

'ఆదిపురుష్' అంతసేపు కూర్చోబెడతాడా..?

By:  Tupaki Desk   |   28 Oct 2022 3:44 AM GMT
ఆదిపురుష్ అంతసేపు కూర్చోబెడతాడా..?
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మైథలాజికల్ డ్రామా ''ఆదిపురుష్''. రామాయణం ఇతిహాసం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తుండగా.. టీ-సిరీస్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.

'ఆది పురుష్' చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 12న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల వచ్చిన టీజర్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగిన నేపథ్యంలో.. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది.

అయితే లేటెస్టుగా 'ఆది పురుష్' మూవీ రన్ టైం గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ పౌరాణిక గాథ నిడివి దాదాపు 3 గంటల 15 నిమిషాలు వచ్చిందని ప్రచారం జరుగుతుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

రామాయణం వంటి మహా కావ్యం ఆధారంగా రూపొందుతున్న సినిమా కావడంతో.. నిడివి ఎక్కువగా వచ్చిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో మరీ రన్ టైం అంత అంటే కష్టమేమోననే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల కాలంలో ఓటీటీలకు అలవాటు పడిపోయిన జనాలను థియేటర్లలో కూర్చోబెట్టటానికి.. బోర్ కొట్టకుండా సినిమా లెన్త్ క్రిస్పీగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. అదే సమయంలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు 3 గంటలు లేదా అంతకంటే ఎక్కువ నిడివితో వచ్చినా ప్రేక్షకులు ఆదరించారు.

2022 లో వచ్చిన 'ది కాశ్మీర్ ఫైల్స్' - KGF - RRR - 'విక్రమ్' - 'పొన్నియన్ సెల్వన్' వంటి కొన్ని చిత్రాలు నిడివి అనేది సమస్య కాదని నిరూపించాయి. ప్రభాస్ నటించిన 'బాహుబలి' నిడివి కూడా ఎక్కువే. మంచి కంటెంట్ ఉంది కాబట్టే ఆ సినిమాలకు లాంగ్ రన్ టైమ్ వర్క్ ఔట్ అయింది.

ఇప్పుడు 'ఆది పురుష్' కూడా అదే స్థాయిలో ఉంటే మాత్రం.. 3 గంటలైనా ప్రేక్షకులు థియేటర్ లో కూర్చునే అవకాశం ఉంటుంది. అందులోనూ ఇది మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో 3డీలో తీసిన సినిమా కాబట్టి.. విజువల్స్ - వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉంటే లెన్త్ గురించి పెద్దగా పట్టించుకోకపోవచ్చు.

కాకపోతే అవుట్ ఫుట్ ఏమాత్రం తేడా కొట్టినా భీభత్సమైన ట్రోలింగ్ ఎదుర్కోవలసి వస్తుంది. అదే మైనస్ గా మారుతుంది. ఇటీవల టీజర్ విషయంలో అదే జరిగింది. కానీ 3డీలో ప్రదర్శించిన టీజర్ కు మాత్రం ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రేపు థియేటర్లలో ఈ చిత్రానికి ఏవిధమైన స్పందన లభిస్తుందో చూడాలి.

కాగా, 'ఆది పురుష్' సినిమాలో రాఘవగా ప్రభాస్.. జానకిగా కృతి సనన్ నటిస్తున్నారు. లంకేశ్ గా సైఫ్ అలీఖాన్ - లక్ష్మణ్ గా సన్నీ సింగ్ కనిపించనున్నారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో భారీ స్థాయిలో ఈ సినిమా విడుదల కాబోతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.