Begin typing your search above and press return to search.

ఏపీలో అన్ని సినిమాలూ 'అఖండ' విజయం సాధించేనా..?

By:  Tupaki Desk   |   14 Dec 2021 3:30 AM GMT
ఏపీలో అన్ని సినిమాలూ అఖండ విజయం సాధించేనా..?
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం లేకుండా ప్రభుత్వమే ధరలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. మున్సిపల్ కార్పొరేషన్లు - మున్సిపాలిటీలు - నగర పంచాయతీలు - గ్రామ పంచాయతీలకు ప్రాంతాల వారీగా థియేటర్లలో టికెట్ల ధరను ప్రభుత్వం నిర్ణయించింది.

కొత్త ధరల ప్రకారం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని మల్టీప్లెక్స్ లలో ప్రీమియం టికెట్ ధర అత్యధికంగా రూ.250 ఉంటే.. గ్రామ పంచాయతీల్లో నాన్-ఏసీ థియేటర్లలో ఎకానమీ క్లాస్ లో టికెట్ రేట్ అత్యల్పంగా రూ.5 గా ఉంది. అయితే ప్రభుత్వం నిర్ణయించిన ధరలపై సినీ పరిశ్రమ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

థియేటర్లలో రోజుకు నాలుగే ఆటలు ప్రదర్శించడం.. టికెట్ల రేట్లు తగ్గించడం వల్ల థియేటర్ల యాజమాన్యాలు - డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతారని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పెద్ద నిర్మాతలు ఈ ధరలతో సినిమాలు రిలీజ్ చేస్తే తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అభిప్రాయ పడుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్లలో కి వచ్చిన పెద్ద సినిమా ''అఖండ''. నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తొలి రోజే హిట్ టాక్ తెచ్చకున్న ఈ సినిమా.. రెండో వారంలోనూ సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్ సీస్ లోనూ అదరగొడుతోంది.

'అఖండ' సినిమా 10 రోజుల్లోనే 100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టడమే కాకుండా.. యూఏస్ఏలో ఒక మిలియన్ డాలర్స్ దిశగా పరుగెడుతోంది. రెండో వారంలోనూ స్ట్రాంగ్ గా ఉన్న బాలయ్య సినిమా.. 11వ రోజు కూడా మంచి వసూళ్ళు సాధించింది. రూ.54 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన అఖండ.. ఇప్పటి వరకు 62.08 కోట్లు (100 కోట్ల గ్రాస్) రాబట్టి ప్రాఫిట్ జోన్ లోకి వచ్చింది. ప్రస్తుతానికి ఈ సినిమా 8 కోట్ల లాభంతో కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో కరోనా సెకండ్ వేవ్ పాండమిక్ తర్వాత బిగ్గెస్ట్ హిట్ గా.. బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాగా ''అఖండ'' సినిమా నిలిచింది. ఏపీలో అంత తక్కువ టికెట్ రేట్లతో ఈ స్థాయి వసూళ్ళు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. అయితే అన్ని సినిమాలకు అలాంటి ఫలితమే వస్తుందని అనుకోవడం అత్యాశే అవుతుంది.

ఎందుకంటే టాలీవుడ్ లో ఏడాదికి ఎన్ని సినిమాలు విడుదలైనా అందులో విజయవంతంమయ్యే చిత్రాలు ఎన్నంటే వేళ్ళతో లెక్కబెట్టవచ్చు. సక్సెస్ రేట్ అనేది ఇండస్ట్రీలో చాలా తక్కువ. ఇప్పుడు 'అఖండ' సినిమాకి ఫస్ట్ డే సూపర్ హిట్ టాక్ వచ్చి, విశేష ప్రేక్షకాదరణ దక్కడంతో లాభాల బాట పట్టింది. కాకపోతే తెలంగాణలో ప్రాఫిట్స్ వచ్చాయి కానీ.. ఏపీలో బ్రేక్ ఈవెన్ మాత్రమే అయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఒకవేళ ఏపీలో టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఉండుంటే 'అఖండ' సినిమాకు వచ్చిన టాక్ కి, బాక్సాఫీస్ వసూళ్ళు ఇంకా ఎక్కువగా ఉండేవి. ఏదైతేనేం బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడనే విషయాన్ని కాదనలేం. కాకపోతే ఇకపై రాబోయే రోజుల్లో వచ్చే సినిమాలన్నీ ఇదే స్థాయిలో కలెక్షన్స్ సాధిస్తాయా అనేది చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద హిట్ టాక్ వస్తే అఖండ సినిమా అక్కడ బ్రేక్ ఈవెన్ అయింది.

థియేటర్లలోకి వచ్చిన ప్రతీ సినిమా హిట్ టాక్ తో నడవడం సాధ్యం కాదు. పాజిటివ్ టాక్ తో అఖండ మాదిరిగా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతాయని అనుకోలేం. టాలీవుడ్ లో సినిమాల సక్సెస్ రేట్ ని చూసి కూడా అలాంటి ఫలితాన్ని ఆశించడం అతిశయోక్తి అవుతుంది. దీనిని బట్టి చూస్తే రాబోయే సినిమాలు మిశ్రమ స్పందన తెచ్చుకుంటే మాత్రం ఏపీలో ఆ చిత్రాలకు నష్టాలు తప్పవనే అనుకోవాలి.

కరోనా నేపథ్యంలో ఇప్పటికే ఇండస్ట్రీ కుదేలయింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టాలీవుడ్ నిర్మాతలు.. కప్పు టీ కంటే తక్కువ టికెట్ ధరలతో సినిమాలు రిలీజ్ చేస్తే మరింత ఆర్థిక నష్టాలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సినీ పెద్దలు టికెట్ రేట్లపై పునరాలోచించాలని ఏపీ ప్రభుత్వాన్ని, సీఎం వైఎస్‌ జగన్‌ కు విజ్ఞప్తి చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద సినిమాలు థియేటర్లలోకి వస్తుండటంతో వీలైనంత తర్వాత ఈ వ్యవహారం ఓ కొలిక్కి వస్తే బాగుంటుందని అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వం వైపు నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని అనుకుంటున్నారు. మరి ఏమి జరుగుతుందో చూడాలి.