Begin typing your search above and press return to search.

సినిమాకైతే మంచి బజ్ వచ్చింది.. మరి ఆశించిన ఫలితం దక్కేనా..?

By:  Tupaki Desk   |   21 Sep 2022 7:48 AM GMT
సినిమాకైతే మంచి బజ్ వచ్చింది.. మరి ఆశించిన ఫలితం దక్కేనా..?
X
విభిన్నమైన చిత్రాలు విలక్షణమైన పాత్రలతో వర్సటైల్ యాక్టర్ అనిపించుకున్నాడు శ్రీవిష్ణు. తన సినిమాల కోసం వేచి చూసే ఓ వర్గం ప్రేక్షకులను సంపాదించుకున్నాడు. ఇప్పుడు ''అల్లూరి'' అనే సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. రిలీజ్ కు రెడీ అయిన ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

''అల్లూరి'' సినిమాలో శ్రీవిష్ణు పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమా ప్రీ రిలీజ్ కు హాజరవడంతో కావాల్సినంత బజ్ ఏర్పడింది.

బన్నీ తో ఉన్న మంచి రాపో వల్ల 'అల్లూరి' సినిమాకు సపోర్ట్ చేయమని కోరినట్లు శ్రీవిష్ణు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ''నాకు పది పన్నెండు ఏళ్లుగా అల్లు అర్జున్ గారు తెలుసు. మొదట కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం. అప్పుడు నేను యాక్టర్ కాదు అనుకునేవారాయన. 'ప్రేమ ఇష్క్ కాదల్' చేసినప్పటి నుంచి.. నన్ను పిలిపించుకొని మాట్లాడుతూ వుంటారు''

''మేము చాలా విషయాల గురించి డిస్కస్ చేస్తాం. కొత్త దర్శకుల గురించి.. కథల గురించి.. అతని సినిమాల మీద నా అభిప్రాయం అడుగుతారు. అతని గురించి ఏమనుకుంటున్నారో ఫీడ్ బ్యాక్ అడుగుతూ వుంటారు. నేను నిజాయితీగానే మొహమాటం లేకుండా చెబుతుంటాను''

''అయితే నేను ఎప్పుడు కూడా నా సినిమా కోసం ఇలా రండి అని అడగలేదు.. అడగాలి అనుకోలేదు. నేనే ఓ వర్క్ లో ఉంటే ఫోన్ ఎత్తలేను. అలాంటిది అంత పెద్ద వ్యక్తి ఇంకెంత బిజీగా ఉంటారు? అందుకే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని అనుకుంటాను. కానీ ఈ సినిమాకి ప్రమోషన్స్ చాలా అవసరం. ఈ సినిమాకి నాకు కొత్త ఆడియెన్స్ కావాలి. అందుకు నా ఒక్కడి బలం సరిపోదు. టైం కూడా లేదు''

''అలాంటి సమయంలో బన్నీ గారు దేవుడిలా అనిపించి అతని దగ్గరికి వెళ్ళా.. 'సినిమా చాలా బాగుంది. నేను ప్రమోషన్స్ చేయలేకపోతున్నా. ఏమి చెయ్యాలో తెలియటం లేదు.. మీరు హెల్ప్ చేస్తారా?' అని అడిగా. ఆయన ఏదైనా ట్రైలర్ లాంచ్ చేస్తారేమో అనుకున్నా. కానీ ఏకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తానని అన్నారు. అది ఆయన పెద్ద మనసు. అందుకే బన్నీ గారి మీదున్న గౌరవం మరింత పెరిగింది. అలాగే నాని అన్న - రవితేజ గారు కూడా అడిగిన వెంటనే సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది'' అని శ్రీ విష్ణు చెప్పుకొచ్చారు.

ఓ ఫిక్షనల్ పోలీస్ క్యారెక్టర్ తీసుకొని.. వాస్తవ సంఘటనల ఆధారంగా.. పోలీసు వ్యవస్థ మరియు కొందరు పోలీసుల జీవితాల ఆధారంగా ''అల్లూరి'' చిత్రాన్ని తెరకెక్కించినట్లు శ్రీ విష్ణు తెలిపారు. ఈ సినిమా మీద అతను చాలా కాన్ఫిడెంట్ గా వున్నాడు. తమ మనసుకి దగ్గరైన చిత్రం కావడంతో జనాల్లోకి తీసుకెళ్లాడనికి బాగా కష్టపడుతున్నాడు.

శ్రీవిష్ణు పోలీస్ రోల్ చెయ్యడం ఏంటి అని అనుకున్నవాళ్ళు అందరూ.. సినిమా చూసాక వీడేంటిరా ఇంత బాగా చేసాడు అనుకోని వస్తారని ధీమాగా చెబుతున్నాడు. ఎలా అయితేనేం శ్రీ విష్ణు తన ''అల్లూరి'' సినిమా చుట్టూ మంచి బజ్ సంపాదించాడని చెప్పాలి. మిగతాది ఇంక సినిమా మాట్లాడాలి. ఈ చిత్రం విలక్షణ నటుడికి ఎలాంటి హిట్ అందిస్తుందో చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.