Begin typing your search above and press return to search.

అరవింద సమేత.. సమయానికి వస్తుందా?

By:  Tupaki Desk   |   30 Aug 2018 1:30 AM GMT
అరవింద సమేత.. సమయానికి వస్తుందా?
X
జూనియర్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘అరవింద సమేత’ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇంకో నెలన్నర రోజుల్లోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఐతే దసరా రిలీజ్ కోసం డెడ్ లైన్ పెట్టుకున్న ఈ చిత్రం అనుకున్న సమయానికి వస్తుందా రాదా అని ముందు నుంచే సందేహాలున్నాయి. ఈ ఏడాది వేసవిలో మొదలుపెట్టిన ఈ చిత్రాన్ని తన కెరీర్లోనే అత్యంత వేగంగా పూర్తి చేయాలని త్రివిక్రమ్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆ ప్రకారమే చకచకా షూటింగ్ చేస్తూ వచ్చాడు. ఐతే ఎంతైనా ఇది భారీ సినిమా కాబట్టి అన్నీ కుదరడం.. అనుకున్న ప్రకారం షూటింగ్ జరగడం కష్టమే. ఎక్కడో ఒకచోట ఇబ్బందులు సహజం. దీంతో షూటింగ్ కొంచెం ఆలస్యం అవుతోందని.. అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ డేట్ అందుకునేందుకు త్రివిక్రమ్ టీం ప్రయత్నిస్తోందని వార్తలొచ్చాయి.

ఐతే ఇప్పుడు ఈ చిత్ర బృందానికి అనుకోని అవాంతరం ఎదురైంది. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ హఠాత్తుగా మరణించారు. తారక్ కు తండ్రి అంటే ఎంతిష్టమో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ‘నాన్నకు ప్రేమతో’ చేస్తున్నపుడు అతనెంతో ఉద్వేగానికి గురయ్యాడు. వేదిక మీద తన తండ్రిని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంకా పలు సందర్భాల్లో హరికృష్ణ విషయంలో ఉద్వేగాన్ని ప్రదర్శించాడు. అలాంటి తండ్రి ఇంత హఠాత్తుగా చనిపోతే అతడి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తీవ్ర విషాదంలో ఉన్న ఎన్టీఆర్ కొన్ని రోజుల పాటు షూటింగ్ కు దూరం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది ‘అరవింద సమేత’ టీంకు ఇబ్బందే. ఈ విషయంలో అతడిని బలవంత పెట్టనూ లేరు. ఈ నేపథ్యంలో అనుకున్న సమయానికి టాకీ పార్ట్ పూర్తి కాకుంటే దసరా రిలీజ్ డేట్ అందుకోవడం కష్టమే అవుతుంది.