Begin typing your search above and press return to search.

ద‌బాంగ్ 3.. ప్రేమపావురాలు రేంజులో

By:  Tupaki Desk   |   15 Nov 2019 7:08 AM GMT
ద‌బాంగ్ 3.. ప్రేమపావురాలు రేంజులో
X
స‌ల్మాన్ ఖాన్- భాగ్య‌శ్రీ జంట‌గా న‌టించిన క్లాసిక్ ప్రేమ‌క‌థా చిత్రం 'మైనే ప్యార్ కియా' సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. స్వ‌చ్ఛ‌మైన ప్రేమికుల అంద‌మైన ప్రేమ‌గాధ‌ను అంతే క్లాసిక్ గా తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు సూర‌జ్ భ‌ర్జాత్యా. 1990 జూలై 6 న 'ప్రేమ పావురాలు' పేరుతో ఈ సినిమా తెలుగులోకి డ‌బ్బింగ్ అయ్యి రిలీజైంది. స‌ల్మాన్ - భ‌గ్యాశ్రీ జంట రొమాన్స్.. రామ్ ల‌క్ష్మ‌ణ్ అద్భుత‌మైన మెలోడీ స్వ‌రాల ప్ర‌భావంతో ఈ సినిమా తెలుగులోనూ మ్యూజిక‌ల్ హిట్ చిత్రంగా నిలిచింది. అప్ప‌ట్లోనే స‌ల్మాన్ ని టాలీవుడ్ లో అద్భుతంగా ప్ర‌మోట్ చేశారు భ‌ర్జాత్యా త‌దిత‌ర‌ చిత్ర‌బృందం. గాన గంధ‌ర్వుడు ఎస్.పి.బాల‌సుబ్ర‌మ‌ణ్యం- చిత్ర వంటి వారు ఆల‌పించిన మెలోడీ పాట‌లు ఇప్ప‌టికీ ట్రెండ్ సెట్టింగ్ అనే చెప్పాలి.

నీ జ‌త లేక పిచ్చిది కాదా.. మ‌న‌సంతా.. ఆ మ‌న‌సేమో నా మాటే విన‌దంటా! ... పాట‌ను ఇప్ప‌టికీ యూత్ హ‌మ్ చేస్తుంటుంది. దాదాపు రెండున్న‌ర‌ ద‌శాబ్ధాల క్రితం స‌ల్మాన్ పాన్ ఇండియా స్టార్ గా ఆవిర్భ‌వించ‌డం వెన‌క 'మైనే ప్యార్ కియా' ప్రాభ‌వం అంతా ఇంతా కాదు. ఆ సినిమా సాధించిన విజ‌యం స్ఫూర్తితోనే అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో ఆ త‌ర‌హా ప్రేమ‌క‌థా చిత్రాలెన్నో తెర‌కెక్కి ఘ‌న‌విజ‌యం సాధించాయి. మైనే ప్యార్ కియా స్ఫూర్తితోనే ఆ త‌ర్వాత‌ హ‌మ్ ఆప్ హై కౌన్- దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే- నిన్నే పెళ్లాడుతా- మురారి- ప్రేమించుకుందాం రా- ప్రేమంటే ఇదేరా- నువ్వు నాకు న‌చ్చావ్ .. ఇలా ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు ఇదే లైన్ తో తెరకెక్కి ఘ‌న‌విజ‌యాలు సాధించాయి.

అయితే గ‌త కొద్ది కాలంగా స‌ల్మాన్ న‌టించిన చిత్రాల్ని తెలుగులో రిలీజ్ చేసేందుకు ప్ర‌య‌త్నించినా ఎందుక‌నో ఇక్క‌డ పెద్దంత‌గా విజ‌యం సాధించ‌డం లేదు. అయినా ఇప్ప‌టికీ స‌ల్మాన్ ని పాన్ ఇండియ‌న్ స్టార్ గా ప్ర‌మోట్ చేసేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతూనే ఉన్నాయి. కండ‌ల హీరో ప్ర‌స్తుతం ద‌బాంగ్ 3లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని హిందీ స‌హా తెలుగు-త‌మిళంలోనూ భారీగా రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. తెలుగులో డి.సురేష్ బాబు వంటి అగ్ర‌నిర్మాత కం పంపిణీదారుడు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. డిసెంబ‌ర్ 20న క్రిస్మ‌స్ కానుక‌గా ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేప‌థ్యంలో ఈ చిత్రానికి తిరిగి `ప్రేమ‌పావురాలు` రేంజు హైప్ తెచ్చేందుకు ప్ర‌య‌త్నాల్లో ఉన్నార‌ట‌.

దాదాపు పాతికేళ్ల క్రితం వ‌చ్చిన ప్రేమ పావురాలు ఇప్ప‌టికీ తెలుగు అభిమానుల గుండెల్లో స్థిరంగా నిలిచి ఉంది. అంత‌టి గొప్ప క్లాసిక్ చిత్ర‌మ‌ది. తిరిగి ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయాల‌న్న పంతం స‌ల్మాన్- ప్ర‌భుదేవా బృందంలో ఉందిట‌. ఇక ద‌బాంగ్ 3 కి పోటీగా బాల‌కృష్ణ‌- రూల‌ర్.. సాయిధ‌ర‌మ్- ప్ర‌తి రోజు పండ‌గే చిత్రాలు రిలీజ‌వుతున్నాయి. స్ట్రెయిట్ తెలుగు సినిమాలు సల్మాన్ కి ఠ‌ఫ్ పోటీని ఇవ్వ‌బోతున్నాయి. అయినా కండ‌ల హీరోకి మెట్రోలు స‌హా న‌గ‌రాల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా మ‌ల్టీప్లెక్సుల్లో ఆద‌ర‌ణ బావుంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీసీ సెంట‌ర్ల‌లో ఆడియెన్ ద‌బాంగ్ 3ని చూస్తారా లేదా? అన్న‌ది అటుంచితే ఒక సెక్ష‌న్ పైనే ఆధార‌ప‌డి ఈ సినిమాని రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఏ సెంట‌ర్ల వ‌ర‌కూ ద‌బాంగ్ 3 వ‌ల్ల‌ ఎన్బీకే.. సాయిధ‌ర‌మ్ ల‌కు దెబ్బ ప‌డే ఛాన్సుంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అయితే డ‌బ్బింగ్ స‌రిగా లేక‌పోతే అనువాదాల‌కు ఆద‌ర‌ణ స‌రిగా ఉండ‌దు. ఈ విష‌యంలో ద‌బాంగ్ 3ని రిలీజ్ చేస్తున్న డి.సురేష్ బాబు ఏమేర‌కు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు అన్న‌ది చూడాలి.