Begin typing your search above and press return to search.

'ఉప్పెన' కు జరిగిందే 'లవ్ స్టోరీ' కి జరుగుతోందా..!

By:  Tupaki Desk   |   7 May 2021 3:30 AM GMT
ఉప్పెన కు జరిగిందే లవ్ స్టోరీ కి జరుగుతోందా..!
X
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య - సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ప్రేమకథా చిత్రం ''లవ్ స్టోరీ''. ఏప్రిల్ 16న తెలుగు కన్నడ మలయాళ భాషల్లో రిలీజ్ కావల్సిన ఈ సినిమా కోవిడ్ సెకండ్ వేవ్ కారణంతో వాయిదా పడింది. నిజానికి గతేడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ వల్ల డిలే అయింది. ఆ మధ్య ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కి వెళ్తోందని రూమర్స్ కూడా వచ్చాయి. అయితే మేకర్స్ మాత్రం ఇది థియేటర్స్ లో చూడాల్సిన సినిమా అని ఓటీటీ ఆఫర్ కి మొగ్గు చూపలేదు. ఎట్టకేలకు ఈ సమ్మర్ లో విడుదల అవుతుందని అనుకుంటుండగా మళ్ళీ మహమ్మారి వైరస్ వల్ల పోస్ట్ పోన్ చేయాల్సి వచ్చింది. ఇందంతా చూస్తుంటే 'ఉప్పెన' సినిమాకి జరిగినట్లే 'లవ్ స్టొరీ' కి జరుగుతోందని అర్థం అవుతోంది.

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ బుచ్చిబాబు సానా అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన చిత్రం 'ఉప్పెన'. గతేడాది ఉగాదికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనేక అవాంతరాలతో వాయిదా పడుతూ వచ్చింది. కరోనా లాక్ డౌన్ సమయంలో ఓటీటీ రిలీజ్ కి వెళ్లే సినిమా అంటూ దీనిపై వచ్చినన్ని వార్తలు మరే సినిమాపై రాలేదు. అయితే అన్ని అడ్డంకులు దాటుకుని చివరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో థియేటర్స్ లో రిలీజైన 'ఉప్పెన' మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఈ క్రమంలో పాండమిక్ తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన ఫస్ట్ సినిమా అయింది. దీనికి 100 శాతం ఆక్యుపెన్సీ.. పెద్ద సినిమాలు లేకపోవడం వంటివి ప్లస్ అయ్యాయని చెప్పవచ్చు. ఇప్పుడు అదే సిమిలారిటీస్ ఉన్న 'లవ్ స్టోరీ' కూడా అదే సెక్షన్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ రూపొందించబడింది. ఇప్పటికే విడుదలైన టీజర్ - పాటలు విశేష స్పందన తెచ్చుకున్నాయి.

కాకపోతే అక్కడ 'ఉప్పెన' కరోనా ఫస్ట్ వేవ్ ని మాత్రమే ఎదుర్కొంటే.. ఇక్కడ 'లవ్ స్టొరీ' కరోనా ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్ లను కూడా చూడాల్సి వచ్చింది. 'ఉప్పెన' సినిమా మాదిరి వేచి చూడాలంటే మేకర్స్ కు ఆర్థిక భారమే అవుతుంది. థియేట్రికల్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తే మంచిదని భావించడానికి త్వరలోనే కోవిడ్ థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ పరిస్థితులు చక్కబడి సినిమాలు విడుదల చేసే అవకాశం వచ్చినా వెంటనే 100 శాతం థియేటర్ ఆక్యుపెన్సీకి అనుమతి ఉండకపోవచ్చు. అంతేకాకుండా థియేటర్స్ రీ ఓపెన్ చేసిన వెంటనే జనాలు సినిమాలు చూడటానికి వస్తారన్న గ్యారెంటీ లేదు. ఇదంతా చూసుకుంటే 'లవ్ స్టోరీ' ని ఎక్కువ కాలం ఉంచుకోవడం డిఫికల్ట్ టాస్క్ అనే అనుకోవాలి. ఈ నేపథ్యంలో మేకర్స్ రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.