Begin typing your search above and press return to search.

'మా' ఎన్నికలు 'మెగా - మంచు' ఫ్యామిలీల మైత్రీపై ప్రభావం చూపుతాయా..?

By:  Tupaki Desk   |   30 Jun 2021 4:30 AM GMT
మా ఎన్నికలు మెగా - మంచు ఫ్యామిలీల మైత్రీపై ప్రభావం చూపుతాయా..?
X
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా - మంచు ఫ్యామిలీల మధ్య దశాబ్దాలుగా ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మెగాస్టార్‌ చిరంజీవి - కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు మొదలుకొని.. ఇప్పుడు రామ్ చరణ్ - మంచు మనోజ్ - విష్ణు వరకు ఈ సాన్నిహిత్యం కొనసాగుతూ వస్తోంది. గతంలో ఎన్నో సినిమాలలో కలిసి నటించిన చిరు - మోహన్ బాబు మధ్య అప్పట్లో కొన్ని పొరపచ్చాలు వచ్చాయి. కానీ అవన్నీ టీ కప్పులో తుఫానులా మర్చిపోయి ఇప్పుడు ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆదరాభిమానాలు చూపించుకుంటున్నారు. సినిమా ఫంక్షన్స్ కు కలసి వెళ్తున్నారు.. ఔటింగ్ లకు వెళ్తున్నారు.. సందర్భం వచ్చినప్పుడల్లా ఒకరిపై ఒకరికున్న అభిమానాన్ని వ్యక్త పరుస్తున్నారు. అయితే ఇప్పుడు 'మా' ఎన్నిక‌లు ఈ ఇద్ద‌రు మిత్రుల మ‌ధ్య స్నేహబంధాన్ని దెబ్బ తీస్తాయేమో అనే సందేహాలు ఫిలిం సర్కిల్స్ లో వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌లు సెప్టెంబర్ నెలలో జరగనున్నాయి. అయితే ఈసారి ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయని అర్థం అవుతోంది. ఎందుకంటే ఎన్నికల కోసం ప్రకటన ఇవ్వకుండా అధ్యక్ష బరిలో మేమున్నాం మేమున్నాం అంటూ ఇప్పటి నుంచే పోటాపోటీగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల స్థాయిలో అప్పుడే పరస్పర వ్యతిరేక వ్యాఖ్యలు.. వ్యూహ రచనలు మొదలుపెట్టారు. 'మా' అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు - ప్ర‌కాష్ రాజ్ - జీవిత‌ రాజశేఖర్ - హేమ‌ - సీవీఎల్ న‌ర‌సింహారావు వంటి వారు పోటీ పడనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా మెగా మద్దతు ఎవరికి ఉంటే వారికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా చిరంజీవి ఎవరి పక్కన నిలిస్తే వారే 'మా' అధ్యక్ష పీఠం మీద కూర్చోనున్నారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు మీడియా ముఖంగా 'మా' ఎన్నికల్లో తనతో పాటుగా చిరంజీవి మద్దతు కూడా ప్ర‌కాష్ రాజ్‌ కూడా ఉందని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఇదే ఇప్పుడు మెగా - మంచు సంబంధాలను దెబ్బ తీస్తుందేమో అని సందేహాలు రేకిత్తించేలా చేసింది. మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు బరిలో నిల్వనున్నట్లు ప్రకటించారు. దీంతో చిరంజీవికి ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది. నిజంగానే ప్రకాశ్ రాజ్ కు సపోర్ట్ చేస్తే మోహన్ బాబు హర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. చిరంజీవి ప్రత్యక్షంగా ఎవరికీ మద్దతు ఇవ్వరు. కానీ పరోక్షంగా ప్రకాష్ రాజ్ కు ఓటేస్తే మాత్రం మోహ‌న్ బాబు - చిరంజీవి మ‌ధ్య సత్సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని సినీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.