Begin typing your search above and press return to search.

‘మా’ ఎన్నికలు మరో నాలుగేళ్ల వరకు జరిగే వీల్లేదా?

By:  Tupaki Desk   |   3 July 2021 4:11 AM GMT
‘మా’ ఎన్నికలు మరో నాలుగేళ్ల వరకు జరిగే వీల్లేదా?
X
‘మా’ ఎన్నికల వ్యవహారం అంతకంతకూ చిక్కుముడులు పడుతోంది. ఇప్పటివరకు వినిపించిన వాదనకు భిన్నంగా కొత్త వాదనలు తెర మీదకు వస్తున్నాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిబంధనల ప్రకారం రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయని.. ఈసారి కరోనా కారణంగా వాయిదా పడటం తెలిసిందే. అయితే.. ‘మా’ అసోసియేషన్ నిబంధనలకు మూలంగా ఉండే బైలాస్ లోని అంశాల్ని పరిగణలోకి తీసుకుంటు షాకింగ్ నిజం ఒకటి బయటకు వచ్చింది.

దీని ప్రకారం ఎగ్జిక్యూటివ్ కమిటీ పదవీ కాలం ఎంత? అన్న విషయాన్ని ఎక్కడా పేర్కొనలేదు. రెండేళ్ల పదవీ కాలం అన్నది సంప్రదాయంగా వస్తున్నదే కానీ.. నిబంధనల ప్రకారంకాదు. ఇప్పుడు ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే.. ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం కూడా లేదంటున్నారు. బైలాస్ లో పదవీ కాలం గురించి స్పష్టంగా పేర్కొనపోవటంతో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలన్నది ఇప్పుడు ప్రశ్న.

‘మా’ ఏర్పాటైన కొత్తల్లో ఎన్నికలు.. పోటీ లాంటి సమస్యలు రాలేదు. ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగేవి. దీంతో.. నిబంధనల లోతుల్లోకి ఎవరూ వెళ్లలేదు. తాజాగా.. చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. అన్ని అంశాల మీద ఫోకస్ పెరిగింది. దీంతో.. బైలాస్ లో ఏముంది? అన్న ప్రశ్నకు సమాధానం వెతికినప్పుడు.. ఎగ్జిక్యూటివ్ కమిటీ పదవీ కాలం ఇంత? అన్నది ఎక్కడా లేదు. ఈ నేపథ్యంలో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ చట్టాల ప్రకారం ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆరేళ్లు పదవిలో కొనసాగొచ్చు. అంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా కోర్టుకు వెళ్లి.. ఇప్పుడు నిర్వహించే ఎన్నికలమీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. బైలాస్ లో పదవీ కాలం ఎంతన్నది స్పష్టంగా పేర్కొనలేదు కాబట్టి.. పదవీ కాలాన్ని ఆరేళ్లకు పొడిగించుకునే అవకాశం మొండుగా ఉందంటున్నారు. అదే జరిగితే.. మా ఎన్నికలు ఇప్పట్లో జరిగే ఛాన్సే లేదన్న మాట న్యాయ నిపుణుల నోట వినిపిస్తోంది.