Begin typing your search above and press return to search.

నైజాం గడ్డ మీద దిల్ రాజుకు పోటీగా నిలుస్తారా..?

By:  Tupaki Desk   |   11 Nov 2022 6:30 AM GMT
నైజాం గడ్డ మీద దిల్ రాజుకు పోటీగా నిలుస్తారా..?
X
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా ఎగ్జిబిటర్ గా రాణిస్తున్నారు. ముఖ్యంగా నైజాం ఏరియాలో అగ్ర నిర్మాత ఆధిపత్యం కొనసాగుతోంది. చేతిలో అధిక సంఖ్యలో థియేటర్స్ ఉండటంతో కొత్తగా ఏ పంపిణీదారు వచ్చినా నిలదొక్కుకోలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ వారు నైజాంలోకి ఎంటర్ అవుతున్నారు.

ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రీ మూవీస్ ఇప్పుడు నైజాంలో ప్రాంతంలో డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి దిగుతోందని తెలుస్తోంది. మరో పంపిణీదారుడితో కలసి అక్కడ సినిమాలు పంపిణీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబరు 2న కొత్త ఆఫీస్ ను ప్రారంభించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అయితే నైజాంలో దిల్ రాజుకు చెక్ పెట్టడానికే మైత్రీ టీమ్ రంగంలోకి దిగుతోందని సినీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు "వాల్తేరు వీరయ్య" మరియు "వీర సింహా రెడ్డి" చిత్రాలను సొంతంగా మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ద్వారా విడుదల చేయనున్నారని సమాచారం.

మైత్రీ మువీ మేకర్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ రెండు చిత్రాలూ సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి రాబోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి మరియు నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రాలు ఒకేసారి వస్తుండటంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కానీ చిరు - బాలయ్య చిత్రాలకు పోటీగా "వారసుడు" వంటి డబ్బింగ్ సినిమా కూడా పొంగల్ బరిలో దిగుతోంది. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు నైజాంలో మెజారిటీ థియేటర్స్ తన సినిమాకే కేటాయిస్తున్నారనే టాక్ నడుస్తోంది. అంతేకాదు అజిత్ కుమార్ "తునివు" చిత్రాన్ని కూడా దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం వుందని అంటున్నారు.

రెండు తెలుగు పెద్ద సినిమాలు పండుగలకు రిలీజ్ అవుతున్నప్పుడు.. రెండు డబ్బింగ్ చిత్రాలను ఎందుకు ప్రమోట్ చేస్తున్నాడంటూ ఇప్పటికే ఓ వర్గం సోషల్ మీడియాలో దిల్ రాజు పై ఫైర్ అవుతున్నారు. చిరంజీవి మరియు బాలకృష్ణ సినిమాలు రెండూ నైజాంలో మైత్రీ టీమ్ సొంతంగా విడుదల చేసుకోవాలని నిర్ణయించుకోవడం.. వైజాగ్ ప్రాంతంలో మైత్రి ఇప్పటికే దిల్ రాజును పక్కన పెట్టడం కారణంగానే.. అగ్ర నిర్మాత తమిళ డబ్బింగ్ చిత్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని మరికొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ కార్యాలయాన్ని ఓపెన్ చేస్తున్న మైత్రీ వారు.. ఇప్పుడు థియేటర్లను కొనుగోలు చేయడానికి వివిధ స్థానిక డిస్ట్రిబ్యూటర్లు మరియు ఎగ్జిబిటర్లను సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. నైజాంలో దిల్ రాజుతో పాటుగా ఏషియన్ సినిమాస్ చేతుల్లో ఎక్కువ థియేటర్స్ ఉన్నాయి. "ఏజెంట్" సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వకపోతే మాత్రం ఏషియన్ వారి థియేటర్స్ చిరంజీవి - బాలయ్య చిత్రాలకు ఇచ్చే అవకాశం కలుగుతుంది.

ఏదేమైనా కీలకమైన నైజాం - వైజాగ్ వంటి రెండు ఏరియాల్లో మైత్రీ వారి సినిమాలు దిల్ రాజుకు దూరమయ్యాయి. ఇండస్ట్రీలో మైత్రీ మూవీస్ టీమ్ కు పలు నిర్మాతలతో సన్నిహిత సంబంధాలు వున్నాయి కాబట్టి.. రానున్న రోజుల్లో దిల్ రాజుకు పోటీగా మారుతారేమో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.