Begin typing your search above and press return to search.

నేచుర‌ల్ స్టార్ నానిని మ‌ళ్లీ ఒంట‌రిని చేస్తారా?

By:  Tupaki Desk   |   23 Dec 2021 12:56 PM GMT
నేచుర‌ల్ స్టార్ నానిని మ‌ళ్లీ ఒంట‌రిని చేస్తారా?
X
సినిమా రిలీజ్ డేట్ లు క్లాష్ వ‌చ్చిన‌ప్పుడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని అడ్డంగా బుక్ చేసి పోటీ నుంచి తప్పించేసారు. అలాగే సినిమా రిలీజ్ టైమ్ లో ఏదైనా ఇబ్బందులు త‌లెత్తితే.. నిర్మాత‌ల‌కు అండగా నిలిస్తే అడ్డంగా నేచుర‌ల్ స్టార్ నానిని ఆడేసుకుంటున్నారు. ఇవి ఇటీవ‌ల ఇండ‌స్ట్రీలో జ‌రిగిన రెండు ప్ర‌ధాన మార్పులు. ఈ ఇద్ద‌రిలో ఏ ఒక్క‌రి ప‌క్షాన కూడా ఇండ‌స్ట్రీ నిల‌బ‌డ‌లేదు స‌రి క‌దా .. ఇదేంటి ఇలా చేస్తున్నార‌ని ప్ర‌శ్రించిన వారు లేరు. హీరో నాని దారుణంగా ఆడుకున్నారు కూడా. ఒక విధంగా చెప్పాలంటే ఒంట‌రిని చేశారు అని చెప్పొచ్చు.

మ‌ళ్లీ తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో అదే సీన్ రిపీట్ కాబోతోందా? అంటే అవున‌నే సంకేతాలు వినిపిస్తున్నాయి. నాని న‌టించిన `ట‌క్ జ‌గ‌దీష్‌` చిత్రాన్ని నిర్మాత‌లు అప్పుడున్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఓటీటీలో రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఆ నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డిన నాని త‌న వంతు బాధ్య‌త‌గా నిర్మాత‌ల‌కు అండ‌గా నిలిచాడు. అయితే ఈ విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకున్న డిస్ట్రిబ్యూట‌ర్‌లు, ఎగ్జిబిట‌ర్లు, కొంత మంది బ‌డా నిర్మాత‌లు క‌లిసి నానిపై తిరుగు బాటు చేశారు. ఎంత‌లా అంటే మ‌రొక హీరో అయితే ఇండ‌స్ట్రీ వ‌దిలి పారిపోయేంత‌.

`ట‌క్ జ‌గ‌దీష్‌` ఓటీటీలో రిలీజ్ అయితే నాని సినిమాల‌ని స‌మూలంగా బ్యాన్ చేస్తామ‌ని, త‌నని ఇండ‌స్ట్రీలో లేకుండా చేస్తామ‌ని మీడియా సాక్షిగా కొంత మంది డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్లు బూతులు తిట్టినంత ప‌ని చేయ‌డమే కాకుండా బెదిరింపుల‌కు దిగ‌డం తెలిసిందే. వారి మాట‌లు బాధించినా నాని ఏ మాత్రం చ‌లించ‌లేదు. తాను నిర్మాత‌ల మాట‌కు క‌ట్టుబ‌డి `ట‌క్ జ‌గ‌దీష్` చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయ్యేలా చేశాడు. ఆ త‌రువాత జ‌రిగిన తొంద‌ర పాటుకు హీరో నానికి డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్లు సారీ చెప్పాల్సి వ‌చ్చింది.

ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో నేచుర‌ల్ స్టార్ ఒంట‌రి అన‌డం కంటే ఇండ‌స్ట్రీ అత‌న్ని ఒంట‌రిని చేసింది అన‌డం క‌రెక్టేమో. ఇప్పుడు కూడా అత‌న్ని ఇండ‌స్ట్రీ ఒంట‌రిని చేస్తున్న‌ట్టుగానే జ‌రుగుతున్న ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయి. నాని న‌టించిన `శ్యామ్ సింగ రాయ్‌` ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొస్తోంది. ఈ సంద‌ర్భంగా నాని చేసిన వ్యాఖ్య‌లు ఫిల్మ్ ఇండ‌స్ట్రీతో పాటు ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఏపీ ప్ర‌భుత్వం సినిమా టిక్కెట్ లు పెంచుకునే వీలు లేకుండా జీవోని తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. దీని వల్ల పెద్ద సినిమాలు చాలా వ‌ర‌కు న‌ష్ట‌పోతున్నాయి. ఇదే విష‌యాన్ని హీరో నాని గురువారం మీడియా ముఖంగా ప్ర‌స్తావించారు.

రాజ‌కీయ నాయ‌కులు, సినిమా వాళ్లు అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే ప్రేక్ష‌కుల్ని అవ‌మానించేలా ఈ నిర్ణ‌యం ఉంద‌న్నారు నాని. ఏపీ ప్ర‌భుత్వం టికెట్ ధ‌ర‌లు త‌గ్గించి ప్రేక్ష‌కుల్ని అవ‌మానించింది. ఏది ఏమైనా ఆ నిర్ణ‌యం స‌రైంది కాదు. థియేట‌ర్ల కంటే ప‌క్క‌న ఉన్న కిరాణా షాపుల క‌లెక్ష‌న్ ఎక్కువ‌గా వుంది. టికెట్ ధ‌ర‌లు పెంచినా కొనే సామ‌ర్థ్యం ప్రేక్ష‌కుల‌కు ఉంది. అయితే నేను ఇప్ప‌డు ఏది మాట్లాడినా వివాద‌మే అవుతుంది` అని చెప్పాడు నాని. ఇదే ఇప్నుడు వివాదంగా మారుతోంది.

నాని ఏపీ ప్ర‌భుత్వంపై తీసుకున్న టిక్కెట్ రేట్ల గురించి మాట్లాడాడో లేదో వెంట‌నే న‌ట్టికుమార్ రంగంలోకి దిగాడు. ఏపీ ప్ర‌భుత్వానికి నాని క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే అంటూ నట్టికుమార్ కౌంట‌ర్ ఇచ్చారు. ఇలాంటి వ్యాఖ్య‌ల వ‌ల్ల పెద్ద సినిమాలు ఇబ్బందులు ప‌డ‌తాయి. సినిమా విడుద‌ల త‌రువాత రెండు వారాల పాటు రేట్లు పెంచుకునే అవ‌కాశం ల‌భిస్తుందన్న న‌మ్మ‌కం వుంది. అన్ని వైపుల నుంచి చిన్న చిన్న త‌ప్పులు జ‌రిగాయి. ఇప్ప‌డున్న‌ రేట్ల ప్ర‌కారం నానిగారి సినిమాకు ఇబ్బందిలేదు. నాకు బిసీ సెంట‌ర్ల‌లో థియేట‌ర్లున్నాయి. నేనూ బాధ‌ప‌డుతున్నా` అని నట్టికుమార్ తెలిపారు. అయితే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి మాత్రం నానికి ఎలాంటి స‌పోర్ట్ ల‌భించ‌లేదు. దీంతో మ‌ళ్లీ నానిని ఒంట‌రిని చేస్తారా? అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.