Begin typing your search above and press return to search.

బిగ్ డిబేట్: ఆంగ్లేయుడిని చంపితే ఆస్కార్ ఇవ్వ‌రా?

By:  Tupaki Desk   |   26 Oct 2021 7:54 AM GMT
బిగ్ డిబేట్: ఆంగ్లేయుడిని చంపితే ఆస్కార్ ఇవ్వ‌రా?
X
2022 ఆస్కార్ ఎంట్రీకి సంబంధించి భార‌తీయ చిత్రాల నామినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. మ‌ల‌యాళ చిత్ర నిర్మాత షాజ్ ఎన్ క‌ర‌ణ్ నేతృత్వంలోని 15 మంది జ్యూరీ స‌భ్యులు మొత్తం 14 చిత్రాల్ని ప‌రిశీలించి చివ‌రిగా త‌మిళ చిత్రం `కూంజ్ గ‌ల్`ని ఎంపిక‌చేసారు. భార‌త‌దేశం నుంచి అధికారిక ఎంట్రీ చిత్రంగా `కూంజ్ గల్` నిలిచింది. అయితే మిగ‌తా సినిమాల్లో వివాదాస్ప‌ద అంశాలు ఉండ‌టంతో ఎంట్రీకి నోచుకోలేద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. `షెర్నీ`..`స‌ర్దార్ ఉద్దమ్`.. `మండేలా`.. `నాయుట్టు `లాంటి చిత్రాలు నామినేష‌న్స్ లో ఉన్నా వాటిపై అన‌ర్హ‌త వేటు వేసారు. అయితే `స‌ర్దార్ ఉద్దమ్` ని త‌ప్పించ‌డానికి గ‌ల కార‌ణాలు జ్యూరీ స‌భ్యులు చెప్పాలంటూ డిమాండ్లు వ్య‌క్తం అయ్యాయి.

గొప్ప‌దేశ భ‌క్తి చిత్రాన్ని ఎందుకు రేస్ నుంచి త‌ప్పించార‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గాను వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతోంది. దీనికి జ్యూరీ స‌భ్యుడు ఇంద్ర‌దాస్ గుప్తా ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు. ``స‌ర్దార్ ఉద్ద‌మ్` అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌కు అనుగుణంగా తీసిన గొప్ప‌చిత్రం. అద్భుత‌మైన సినిమాటో గ్ర‌ఫీతో తెర‌కెక్కింది. కానీ ఇందులో కొన్ని అంశాలే వివాదాస్ప‌దంగా ఉన్నాయి. జ‌లియన్ వాలా బాగ్ ఘ‌ట‌న‌ని చాలా సుదీర్ఘంగా ఈ చిత్రంలో చ‌ర్చించారు. ఇది ఎంతో గొప్ప తో కూడిన నిజాయితీ గ‌ల ప్ర‌య‌త్నం. కానీ బ్రిటీష్ వారి ప‌ట్ల భార‌తీయులు ద్వేషాన్ని స్ప‌ష్టంగా ప్ర‌ద‌ర్శించిన‌ట్లు అవుతుంది. భార‌తీయులు..బ్రిటీష‌ర్ల మ‌ధ్య మ‌ళ్లీ చిచ్చు రేపిన‌ట్లు అవుతుంది. అందుకే ఈసినిమాని నామినేష‌న్ నుంచి తొల‌గించాం`` అన్నారు.

ఇంకా ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌పంచీక‌ర‌ణ యుగంలో త‌గాదాలు మంచిది కాదు. ద్వేషాన్ని పెంచుకోవ‌డం ఏ దేశానికి మంచిది కాదు. ఇది మ‌న‌దేశం నుంచి ఎంతో గొప్ప చిత్ర‌మే. కానీ విదేశీయులు ఈ ప్ర‌య‌త్నాన్నిఎలా తీసుకుంటారో తెలియ‌దు. సినిమా తీసిన ద‌ర్శ‌కుడికి ఎలాంటి ఎజాండా లేద‌ని తెలుసు. ఇది నిజాయితీగల ప్ర‌య‌త్నం. కానీ ఆస్కార్ కి పంపించ‌లేని ప‌రిస్థితి మ‌న‌ది అని తెలిపారు. `స‌ర్దార్ ఉద్ద‌మ్` లో విక్కీ కౌశ‌ల్ ప్ర‌ధాన పాత్ర పోషించారు. షూజిత్ సిర్కార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అమృత్ స‌ర్ లోని జలియ‌న్ వాలా బాగ్ మార‌ణ‌కాండ‌కు ప్ర‌తీకారంగా జ‌న‌ర‌ల్ డ‌య్య‌ర్ ని హ‌త్య చేసిన స‌ర్దార్ ఉద్ద‌మ్ సింగ్ జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది.