Begin typing your search above and press return to search.

గోడకు కొట్టిన బంతిలా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడా..?

By:  Tupaki Desk   |   27 Oct 2022 2:49 AM GMT
గోడకు కొట్టిన బంతిలా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడా..?
X
టాలీవుడ్ లో పూరీ జగన్నాథ్ కు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అనే పేరుంది. తన కెరీర్ లో ఎంతో మంది హీరోలకు స్టార్ డమ్ ని తెచ్చిపెట్టిన పూరీ.. ఎన్నో బ్లాక్ బస్టర్లు - సూపర్ హిట్లు - హిట్లు అందుకున్నాడు. అలానే ప్లాప్స్ - డిజాస్టర్స్ కూడా రుచి చూసాడు. పరాజయాలు పలకరించినప్పుడు పూరీ పని అయిపోయింది అని కామెంట్స్ చేసిన ప్రతీసారి గోడకు కొట్టిన బంతిలా దర్శకుడు బౌన్స్ బ్యాక్ అవుతూ వస్తున్నారు. ఇప్పుడు పూరీ మరోసారి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది.

విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన "లైగర్" సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చవిచూసింది. దీంతో ఒక్కసారిగా పూరీ చుట్టూ నెగిటివిటీ చేరడమే కాదు.. ఆర్థికంగా దెబ్బ తీసిందనే వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ముంబైలో గత మూడేళ్ళుగా ఉంటున్న విలాసవంతమైన ఫ్లాట్ ని కూడా ఖాళీ చేయనున్నారనే రూమర్స్ వచ్చాయి. బాలీవుడ్ లో పని అవ్వకపోవడంతో.. తిరిగి హైదరాబాద్ కు రానున్నాడని అందరూ అనుకున్నారు. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది.

'లైగర్' తో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలని బొక్కబోర్లా పడ్డ పూరీ.. ఎక్కడైతే పోగొట్టుకున్నాడో అక్కడే తిరిగి రాబట్టాలని నిర్ణయించుకున్నాడట. బాలీవుడ్‌ లోనే ఓ భారీ ప్రాజెక్ట్ కోసం ప్లాన్ చేస్తున్నాడట. ఈ కారణంతోనే అగ్ర దర్శకుడు తన ముంబై అపార్ట్మెంట్ ను ఖాళీ చేయకుండా.. ప్రస్తుతం అక్కడే మకాం వేయాలని నిర్ణయించుకున్నాడట. తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'జనగణమన' కి మరింత పదును పెడుతున్న పూరీ.. హిందీ హీరోతో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి.

'లైగర్' రిజల్ట్ చూడకముందే విజయ్ - పూరీ కాంబినేషన్ లో 'JGM' ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల షూటింగ్ జరిపిన తరవాత.. బ్రేక్ ఇచ్చారు. కానీ లైగర్ ప్లాప్ తర్వాత అంత బడ్జెట్ వర్కౌట్ అవుతుందో లేదో అనే సందేహంలో ఈ చిత్రాన్ని పూర్తిగా పక్కన పెట్టేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజా నివేదికల ప్రకారం పూరీ ఇప్పుడు 'జన గణ మన' సినిమాని రణ్‌ వీర్ సింగ్ లేదా విక్కీ కౌశల్‌ లలో ఎవరో ఒకరితో తీయాలనే ఆలోచన చేస్తున్నాడట.

ఏదేమైనా పూరీ ఈసారి బ్లాక్ బస్టర్ అందుకొని మరోసారి తన స్టామినా ఏంటో బాక్సాఫీస్ కు చూపించాలని అభిమానులు కోరుతున్నారు. పూరీ జగన్నాథ్ సైతం 'లైగర్' ప్లాప్ నుంచి బయటకు వచ్చి తదుపరి ప్రాజెక్ట్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇటీవల 'గాడ్ ఫాదర్' ప్రమోషన్స్ లో ఫెయిల్యూర్ నుంచి బయటకు రావడం గురించి చిరంజీవి తో పూరీ మాట్లాడారు. సినిమా సక్సెస్ అయితే ఎనర్జీ వస్తుంది.. ఫెయిల్యూర్ వస్తే ఉన్న ఎనర్జీ మొత్తం పోతుందని.. సక్సెస్ ఉన్నప్పుడు జీనియస్ లా కనిపిస్తే.. ఫెయిల్ అయితే ఫూల్ లా కనిపిస్తామని పూరీ అన్నారు.

ప్లాప్ అయినప్పుడు చాలా ఒత్తిళ్లు వస్తుంటాయి. ఆ టైమ్ లో ధైర్యంగా ఉండాలంటే చాలా స్ట్రెంత్ కావాలి. ఇప్పడు హీలింగ్ టైమ్ తక్కువ ఉండేలా చూసుకోవాలి అని దర్శకుడు చెప్పారు. ఆస్తులు పోయినా.. యుద్ధాలు జరిగినా ఎన్ని జరిగినా రికవరీ టైమ్ పీరియడ్ ఒక నెల కంటే ఎక్కువ ఉండకూడదని పూరీ పేర్కొన్నారు. అన్నీ వన్ మంత్ లో మర్చిపోయి మళ్ళీ తర్వాతి పని చేసుకోవాలని చెప్పారు.

'లైగర్' సినిమా సీరియస్ గా ఎంజాయ్ చేశాను. బట్ ఫెయిల్యూర్ వచ్చింది. రిజల్ట్ మన చేతుల్లో లేదు. ఇంకో మూడేళ్లు ఏడవలేను కదా అని పూరీ జగన్నాథ్ వివరించారు. దర్శకుడు చెప్పినదాన్ని బట్టి చూస్తే పరాజయం నుంచి చాలా తక్కువ టైం లోనే బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. కాకపోతే బయ్యర్ల సెటిల్ మెంట్ వ్యవహారం ఇప్పుడు పూరీని వివాదంలోకి లాగింది. నష్టపోయిన వారిని ఆదుకోవాలని పూరీ ముందుకు రాగా.. పరిహారం లేట్ అవుతోందని ఎగ్జిబిటర్స్ ధర్నా చేయడానికి రెడీ అయ్యారు.

ఈ నేపథ్యంలో బ్లాక్ మెయిల్స్ కు తాను భయపడనని పూరీ మాట్లాడిన ఓ ఆడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ సమస్యని వీలైనంత త్వరగా సామరస్యంగా పరిష్కరించుకొని.. పూరీ జగన్నాథ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై దృష్టి సారించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అందరూ ఆశిస్తున్నట్లుగానే త్వరలోనే దర్శకుడి తదుపరి సినిమాపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.