Begin typing your search above and press return to search.

RRR తో ఆ లిస్టులో తారక్ కూడా చేరతాడా?

By:  Tupaki Desk   |   5 Nov 2019 12:47 PM IST
RRR తో ఆ లిస్టులో తారక్ కూడా చేరతాడా?
X
టాలీవుడ్ లో నటవారసుల జోరు ఎక్కువే. మెజారిటీ స్టార్లు ఏదో ఒక ప్రముఖ సినీ కుటుంబం నుంచి వచ్చినవారే. తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో సహృదయం ఉన్నవారు.. నెపోటిజం అంటూ ఎంతమంది హంగామా చేసినా వారిని ఇసుమంత కూడా పట్టించుకోకుండా ఏరికోరి వారసులను ఎంపిక చేసుకుని వారిని అభిమానిస్తూ తరిస్తూ ఉంటారు. అందుకే టాలీవుడ్ లో దాదాపుగా బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ నటవారసుల పేరిటే ఉన్నాయి.

ఇండస్ట్రీలో ఇప్పుడు అన్నీ రికార్డ్స్ 'బాహుబలి-2' పేరిట ఉన్నాయి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అవన్నీ ప్రభాస్ ఖాతాలోనే పడతాయి. మహేష్ బాబు 'శ్రీమంతుడు' తో మహేష్ బాబు కూడా నాన్ బాహుబలి రికార్డులు సృష్టించాడు. ఇక చరణ్ కూడా 'రంగస్థలం' తో తన సత్తాను చాటి నాన్ బాహుబలి రికార్డు సాధించాడు. నటవారసులు కాకుండా భారీ కలెక్షన్ల రికార్డులు మెగాస్టార్ చిరంజీవికి మాత్రం ఉన్నాయి. ఈ జెనరేషన్ స్టార్ హీరోల్లో ఎన్టీఆర్.. అల్లు అర్జున్ మాత్రం ఇలాంటి రికార్డులకు దూరంగా ఉన్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్ ఆరంభంలో 'సింహాద్రి' లాంటి సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులు సాధించినప్పటికీ ఈమధ్య మాత్రం భారీ రికార్డులు సృష్టించే సినిమాలు ఆయనకు తగలలేదు. దీంతో ఇప్పుడు అందరి కళ్ళూ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'RRR' పైనే ఉన్నాయి. ఈ సినిమాలో చరణ్ మరో హీరోగా నటిస్తున్నప్పటికీ రాజమౌళి - ఎన్టీఆర్ ఒక డెడ్లీ కాంబినేషన్. ఈ సినిమాతో ఎన్టీఆర్ రికార్డుల దుమ్ముదులపడం ఖాయమని.. మరోసారి ఎన్టీఆర్ రికార్డుల లిస్టులో అగ్రభాగాన నిలవడం లాంఛనమేనని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. అయితే ఈ సినిమాలో చరణ్ కూడా మరో హీరో కాబట్టి ఇద్దరూ కలిసి రికార్డుల క్రెడిట్ తీసుకోవాల్సి వస్తుంది.