Begin typing your search above and press return to search.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో మన వాళ్ళు ఆ కార్పొరేట్ సంస్థలతో పోటీ పడగలరా..?

By:  Tupaki Desk   |   9 April 2020 11:30 PM GMT
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో మన వాళ్ళు ఆ కార్పొరేట్ సంస్థలతో పోటీ పడగలరా..?
X
ప్రస్తుతం టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు సినిమాలు చూడాలంటే కేవలం సినిమా థియేటర్స్ మాత్రమే ఉండేవి.. ఆ తరువాత టీవీలు వచ్చాయి.. తరువాత స్మార్ట్ టీవీలు.. ఇప్పుడు ఓటీటీ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వచ్చాయి. అందులో కేవలం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్, టీవీ సీరియల్స్.. అబ్బో ఒకటేమిటి ఎన్నైనా చూసుకోవచ్చు ఇంట్లోనే కూర్చొని. విడుదలైన సినిమా కనీసం వారం రోజులు కూడా ఆడకుండానే ఓటీజీ ప్లాట్ ఫామ్ లో దర్శనమిస్తుంది. ఎంత పెద్ద సినిమా అయినా సరే నెల రోజుల్లో ఓటీటీ ప్లాట్ఫాంలో ప్రసారం అవ్వాల్సిందే. అయితే ఇప్పుడు నెల రోజులు కాదు రిలీజ్ రోజునే చూసే రోజులు కూడా రాబోతున్నాయి.

రాబోయే కాలంలో డిజిటల్ ప్లాట్ ఫార్మ్ రాజ్యం కాబట్టి ఇప్పటికే ఆ దిశగా పలువురు అడుగులు వేస్తున్నారు. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లో ఓ రేంజ్ లో దునియాను ఏలుతున్నాయి. ఆ తరువాత హాట్ స్టార్, సన్ నెక్స్ట్, ఆల్ట్ బాలాజీ, జీ 5, ఎం ఎక్స్ ప్లేయర్, ఎరోస్.. ఇలా చాలా మంది డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లోకి వచ్చేసారు. తాజాగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా డిజిటల్ ప్లాట్ ఫార్మ్ 'ఆహా'ని క్రియేట్ చేశారు. దీంతో శరత్ మరార్ - స్వప్న దత్ - క్రిష్ లాంటి వారు కూడా ఓటీటీ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ వైపు అడుగులు వేశారు. కాలక్రమేణా వెబ్ కంటెంట్ కి ప్రాధాన్యత పెరగడంతో వీరితోపాటు చాలా మంది బడా నిర్మాతలు ఇదే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు తాజాగా ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి కూడా ఓటీటీ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వైపు అడుగులు వేయబోతున్నారని సమాచారం. ఈగ - లెజెండ్ - యుద్ధం శరణం - విజేత లాంటి సినిమాలను నిర్మించిన సాయి కొర్రపాటి ఇప్పుడు వెబ్ సిరీస్ తీసే ఆలోచనలో ఉన్నాడట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ప్రకటించనున్నారని సమాచారం. సాయి కొర్రపాటి ప్రస్తుతం భారీ చిత్రాలైన కేజీయఫ్ 2 - ఆర్.ఆర్.ఆర్ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నాడు. మొత్తానికి ఆహా అంటూ టాలీవుడ్ నిర్మాతలు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ లోకి దిగడంతో టాలీవుడ్ లో కొత్త ఆశలు నెలకొన్నాయి. ఇక్కడి దాకా బాగానే ఉంది. కానీ ఇప్పటికే ఓటీటీ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో పాతుకుపోయిన బడా కార్పొరేట్ జయింట్స్ ని తట్టుకొని నిలబడగలరా.. వాళ్ళతో పోటీ పడగలరా అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.