Begin typing your search above and press return to search.

సాయి పల్లవి వివాదం 'విరాటపర్వం' పై ప్రభావం చూపదు కదా..?

By:  Tupaki Desk   |   17 Jun 2022 3:29 AM GMT
సాయి పల్లవి వివాదం విరాటపర్వం పై ప్రభావం చూపదు కదా..?
X
రానా దగ్గుబాటి మరియు సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం ''విరాటపర్వం''. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాని శుక్రవారం థియేటర్లోకి తీసుకొచ్చారు. కరోనా పాండమిక్ నేపథ్యంలో డిలే అవుతూ వచ్చిన ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. దీనికి తగ్గట్టుగానే చిత్ర బృందం దూకుడుగా ప్రచార కార్యక్రమాలు చేశారు. అంతా బాగా ఉందనుకుంటుండగా.. మూవీ ప్రమోషన్స్‌ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెర లేపింది.

'విరాటపర్వం' సినిమాలో తన క్యారెక్టర్ గురించి సాయి పల్లవి మాట్లాడుతూ.. నక్సల్స్ గురించి మాట్లాడింది. అదే సమయంలో అవతలి వారిని బాధపెట్టకూడదని.. అందరూ మంచి మనుషుల్లా ఉండాలని చెప్పింది. ఎవరో ఎవరినో హర్ట్ చేస్తున్నారని.. మనం కూడా అలా చేయకూడదని.. బాధితుల గురించి కూడా ఆలోచించాలని హితవు పలికింది. ఈ క్రమంలో ‘కాశ్మీర్ ఫైల్స్’ మూవీ గురించి మాట్లాడుతూ.. కశ్మీర్ లో పండిట్లను చంపడం మతపరమైన హింసే అయితే.. గోరక్షణ పేరుతో జరుగుతోంది కూడా అదేననే అర్థం వచ్చేలా చేసిన కామెంట్స్ ఆమెను చిక్కుల్లో పడేసింది.

సాయి పల్లవి మాట్లాడుతూ.. ''కొన్ని రోజుల ముందు కూడా నేను కశ్మీరీ ఫైల్స్ సినిమా చూసాను. ఆ టైంలో అక్కడ ఉన్న కశ్మీరీ పండిట్స్‌ ను ఎట్లా చంపారనేది అందులో చూపించారు. మీరు మత ఘర్షణను తీసుకుంటే.. కోవిడ్ టైంలో ఎవరో ఒక బండిలో ఆవుని తీసుకెళుతున్నారు. ఆ బండి డ్రైవ్ చేసేవాళ్లు ముస్లింగా ఉన్నారు. కొందరు జనాలు వాళ్ళను కొట్టి ‘జై శ్రీరాం.. జై శ్రీరాం’ అని చెప్పారు. అప్పుడు జరిగిన దానికి, ఇప్పుడు జరిగిన దానికీ తేడా ఎక్కడ ఉంది? సో ఇప్పుడు మనం మతం పేరుతో మంచిగా ఉండాలి. మనం మంచి పర్సన్‌ గా ఉండి ఉంటే ఎవరినీ హర్ట్ చేయం. ఒక పర్సన్ పైన ఆ ప్రెజర్ పెట్టం'' అని వ్యాఖ్యానించింది.

సాయిపల్లవి ఉద్దేశం ఏదైనా.. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఈ విషయంలో సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. సాయి పల్లవి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని.. కశ్మీరీ పండిట్స్‌ చంపిన వారిని గోరక్షకులతో పోల్చడమేంటని ఓ వర్గం మండిపడుతున్నారు.

సాయిపల్లవిపై భజరంగ్‌దళ్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో గో ప్రేమికులను కశ్మీర్‌ ఉగ్రవాదులతో పోల్చారని సుల్తాన్‌ బజార్‌ పోలీస్ స్టేషన్ లో ఆమె పై ఫిర్యాదు చేశారు. అలానే సైబర్ క్రైమ్ ని కూడా ఆశ్రయించారు. చూస్తుంటే ఈ వివాదం మరింత సీరియస్ అయ్యేలా కనిపిస్తోంది. అయితే ఇదంతా 'విరాటపర్వం' సినిమా పై ప్రభావం చూపిస్తుందా అనే చర్చ జరుగుతోంది.

1990స్ వాస్తవ సంఘటనల ప్రేరణతో నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో 'విరాటపర్వం' సినిమాని రూపొందించారు. ఇలాంటి సినిమాలకు మౌత్ టాక్ చాలా అవసరం. దీనిని బట్టే జనాలు థియేటర్లకు వచ్చేది. అయితే ఇప్పుడు సాయి పల్లవి వివాదం నేపథ్యంలో మూవీ బాగున్నా సోషల్ మీడియాలో ఎలాంటి ప్రచారం చేస్తారో అనే ఆదోళన ఆమె అభిమానులతో పాటు దగ్గుబాటి ఫ్యాన్స్ లోనూ ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.