Begin typing your search above and press return to search.

షారుఖ్ ఖాన్ కుమారుడికి బెయిల్ పై ఉత్కంఠ? రంగంలోకి క్రిమినల్ లాయర్

By:  Tupaki Desk   |   4 Oct 2021 10:30 AM GMT
షారుఖ్ ఖాన్ కుమారుడికి బెయిల్ పై ఉత్కంఠ? రంగంలోకి క్రిమినల్ లాయర్
X
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్, రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ముంబై క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నందుకు ఆర్యన్ ఖాన్ ను ఎన్.సీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడు జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నాడు.

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తన కుమారుడు ఆర్యన్ తో మాట్లాడారు. ఆర్యన్ ఖాన్ ను ఎన్.సీబీ అధికారులు నిన్న అరెస్ట్ చేసిన తర్వాత షారుఖ్ రెండు నిమిషాల పాటు ఫోన్ లో మాట్లాడినట్టు అధికారులు తెలిపారు. బెయిల్ ప్రక్రియలో భాగంగా ఆర్యన్ తండ్రితో మాట్లాడారని అధికారులు తెలిపారు.

ఇక విచారణ సమయంలో ఆర్యన్ ఒక దశలో కన్నీటి పర్యంతమైనట్లు ఆ వర్గాలు తెలిపాయి. నేడు ఆర్యన్ ను మరోసారి కోర్టు ఎదుట ప్రవేశపెట్టనున్నారు. ఈ క్రమంలోనే కొడుకుకు బెయిల్ ఇప్పించేందుకు షారుఖ్ ఖాన్ రంగంలోకి దిగినట్టు సమాచారం. తన స్నేహితుడు, అగ్రహీరో సల్మాన్ ఖాన్ కూడా ఇందుకు సహకరిస్తున్నట్టు తెలిసింది.

ఆర్యన్ తోపాటు ఆదివారం మధ్యాహ్నం మరో ఇద్దరు నిందితులు అర్బాజ్ సేథ్ మర్చంట్ మరియు మున్మున్ ధమేచాలతో కలిసి అరెస్టు చేశారు. వారికి నేటికి రిమాండ్ విధించారు. వారు ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 8 (c), 20 (b), 27 మరియు 35 కింద బుక్ చేయబడ్డారు.

ప్రస్తుతం ఆర్యన్ ఎన్సీబీ బృందంతో కలిసి కోర్టుకు బయలు దేరారు. ఆదివారం కోర్టు అతడిని ఒకరోజు కస్టడీకి పంపింది. ఈరోజు మళ్లీ ఆర్యన్ ను కోర్టు ముందు హాజరుపరుస్తున్నారు. కోర్టుకు తీసుకెళ్లే ముందు ఆర్యన్ ను ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించారు. ఎన్సీబీ రిమాండ్ కోసం అడగడం లేదని.. ఈకారణంగానే ఆర్యన్ కు ఈరోజు బెయిల్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

ఆర్యన్ ఖాన్ కేసు వాదించే బాధ్యతను క్రిమినల్ లాయర్ సతీష్ మానెషిండేకు అప్పజెప్పినట్లు సమాచారం. రాంజెఠ్మాలనీ వద్ద ఆయన పనిచేశారు. బాలీవుడ్ కు చెందిన చాలా హైప్రోఫైల్ కేసులను ఆయనే వాదించారు. 1993లో బాంబే బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్ తరుఫున వాదించి బెయిల్ ఇప్పించారు. 2002లో సల్మాన్ ఖాన్ పై నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసును సతీషే వాధించారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులోనూ రియా చక్రవర్తి తరుఫున సతీష్ వాదించారు. తాజాగా ఆర్యన్ ఖాన్ కేసును వాదిస్తున్నారు.

తన క్లైంట్ ఆర్యన్ ను నిర్వాహకులే నౌకలోకి ఆహ్వానించారని.. ఆర్యన్ వద్ద ఎటువంటి నిషేధిత పదార్థాలు స్వాధీనం చేసుకోలేదని ఈ లాయర్ వాదిస్తున్నాడు. ఇక వాటిని వాడినట్లు ఎటువంటి ఆధారాలు లేవని సతీష్ చెబుతున్నాడు. మరి కోర్టు ఈ వాదనతో బెయిల్ ఇస్తుందో లేదో చూడాలి.