Begin typing your search above and press return to search.

8 వారాల ఓటీటీ కండీష‌న్ వ‌ర్కౌట్ అవుద్దా?

By:  Tupaki Desk   |   20 Aug 2022 10:30 AM GMT
8 వారాల ఓటీటీ కండీష‌న్ వ‌ర్కౌట్ అవుద్దా?
X
ఎనిమిది వారాల త‌ర్వాతే ఓటీటీలోకి సినిమా రిలీజ్ చేయాల‌ని నిర్మాత‌ల మండ‌లి కొత్త నిబంధ‌న తీసుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయి గైడ్ లైన్స్ ని ఇంకా రివీల్ చేయలేదు. అన్ని సినిమాల‌కు ఇదే ప్రాతిప‌దిక‌నా? లేక చిన్న సినిమాల‌కు మిన‌హ‌యింపు ఉందా? అన్న‌ది క్లారిటీ లేదు. కానీ ప్లాప్ అయిన సినిమా సైతం ఎనిమిది వారాల త‌ర్వాత రిలీజ్ అవ్వ‌డం అంటే? సినిమా పూర్తి స్థాయిలో కిల్ అవ్వ‌డానికి అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

థియేట‌ర్లోనూ స‌క్సెస్ అవ్వ‌క‌..ఓటీటీలోనూ ఫెయిలైతే మ‌రింత న‌ష్టం త‌ప్ప‌దు అన్న వాద‌న తెర‌పైకి వ‌స్తుంది. ప్లాప్ అయిన అగ్ర హీరో సినిమా సైతం ఇదే ప‌రిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుందంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ థియేట‌ర్ రిలీజ్ లో వ‌చ్చిన న‌ష్టాల్ని కొద్దో గొప్ప వెంట‌నే ఓటీటీ రిలీజ్ తో భ‌ర్తీ చేసుకునేవారు. కానీ ఇప్పుడా ప‌రిస్థితి ఉండ‌దు.

ఎనిమిది వారాల త‌ర్వాత అంటే ఓటీటీ ఆడియ‌న్స్ సైతం వీక్షించ‌డానికి ఆస‌క్తి చూపించ‌ర‌న్న‌ది ఓ అంచ‌నాగా వినిపిస్తుంది. పైగా ఇలా చేస్తే ఓటీటీకే బిజినెస్ తాళాలు అప్ప‌గించిన‌ట్లు అవుతుంది. ఓటీటీ యాజ‌మాన్యాలు ఎంత చెబితే అంత‌కు విక్ర‌యించాల్సిందే. నిర్మాత‌కు డిమాండ్ చేయ‌డానికి ఛాన్స్ ఉండ‌దు. థియేట‌ర్ రిలీజ్ త‌ర్వాతనే ఓటీటీ అగ్రిమెంట్ జ‌రుగుతుందంటున్నారు.

అప్పుడు థియేట‌ర్ ర‌న్ లో స‌క్సెస్ ..ఫెయిల్యూర్ ని బ‌ట్టి ఓటీటీ మార్కెట్ ధ‌ర నిర్దారించ‌బ‌డుతుంది. తొలుత ఓటీటీలో సినిమా నాలుగు వారాల త‌ర్వాత రిలీజ్ అయ్యేది. అటుపై అదే రిలీజ్ ఆరు వారాల‌కు పోడిగించారు. ఇప్పుడు మ‌రో రెండు వారాలు క‌లిపి ఎనిమిది వారాల‌కు తోసేసారు. ఇదంతా కేవ‌లం థియేట‌ర్ కి ఆడియ‌న్స్ రాక‌పోవ‌డం చేత త‌లెత్త‌ని స‌మ‌స్య‌. ఓటీటీ వ్య‌వ‌స్థ‌ని తీసుకొచ్చింది నిర్మాత‌లే. ఇప్పుడ‌దే ఓటీటీ నిర్మాత‌ల‌కు గుది బండ‌గా మారుతుంది.

ఆ మ‌ధ్య టిక్కెట్ ధ‌ర‌ల విష‌యంలోనూ నిర్మాత‌లు ఇలాంటి విధానాన్నే అనుస‌రించారు. ముందుగా భారీగా ధ‌ర పెంచేసే విక్ర‌యించారు. ఆ బాదుడు త‌ట్టుకోలేక ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ థియేట‌ర్ కి దూర‌మ‌య్యారు. దీంతో వెంట‌నే టిక్కెట్ ధ‌ర‌లు త‌గ్గించి ట్ర‌య‌ల్ వేసారు. దీంతో నిర్మాత‌ల‌కి అస‌లు సంగ‌తి అర్ధ‌మైంది. టిక్కెట్ ధ‌ర‌లు స‌హా ఓటీటీ కూడా థియేట‌ర్ ఆక్యుపెన్సీపై ప్ర‌భావం చూపిస్తుంద‌ని.

తాజాగా తీసుకొచ్చి న 8 వారాల కండీష‌న్ విష‌యంలో మ‌ళ్లీ ఈమార్పులు చోటు చేసుకోవ‌డానికి అవ‌కాశం ఉంద‌ని నిపుణులు భావిస్తున్నారు. ప్ర‌స్తుతం ఉన్న స‌మస్య నుంచి గ‌టెక్క‌డం కోస‌మే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా క‌నిపిస్తుంది. సినిమా భ‌విష్య‌త్ ఓటీటీదే అన్న‌ది వాస్త‌వం. కాల‌క్ర‌మంలో తాజా నిబంధ‌న‌లో చాలా మార్పులొచ్చే అవ‌కాశం ఉందంటున్నారు.