Begin typing your search above and press return to search.

అన్ని గంటల సేపు ప్రేక్షకులను థియేటర్లో కూర్చోబెడుతుందా..?

By:  Tupaki Desk   |   31 Aug 2022 6:30 AM GMT
అన్ని గంటల సేపు ప్రేక్షకులను థియేటర్లో కూర్చోబెడుతుందా..?
X
వైవిధ్యమైన మరియు ప్రయోగాత్మక చిత్రాలతో విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే వర్సటైల్ హీరో చియాన్ విక్రమ్‌. ప్రతీ సినిమాలోనూ ఏదైనా కొత్తగా ట్రై చేయాలని చూసే విక్రమ్.. ఈ క్రమంలో తెలుగులోనూ మంచి మార్కెట్ ఏర్పరచుకున్నారు. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు "కోబ్రా" అనే సినిమాతో థియేటర్లలోకి వస్తున్నారు.

విక్రమ్ నటించిన 'కోబ్రా' సినిమా ఈరోజు (ఆగస్ట్ 31) వినాయక చవితి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. దాదాపు మూడేళ్ల తర్వాత థియేటర్స్‌ లో విడుదలవుతున్న విక్రమ్‌ సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. థియేట్రికల్ ట్రైలర్ మరియు దూకుడు ప్రమోషన్స్ తెలుగు మార్కెట్‌ లో అందరి దృష్టిని ఆకర్షించాయి.

నివేదికల ప్రకారం, 'కోబ్రా' సినిమా మొత్తం రన్-టైమ్ 3 గంటల 3 నిమిషాలు వచ్చిందని తెలుస్తోంది. ఫస్టాఫ్ 1.34 నిమిషాలు.. సెకండాఫ్ 1.26 నిమిషాలు వచ్చిందట. సాధారణంగా సినిమా నిడివి 2.20 గం. నుంచి 2.30 గంటల మధ్య ఉండేలా కట్ చేస్తుంటారు.

ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టటానికి క్రిస్పీగానే సినిమా ఉండాలని కోరుకుంటారు. కానీ ఇప్పుడు 'కోబ్రా' సినిమా 3 గంటల నిడివితో వస్తోంది. కంటెంట్ కొంచెం తేడా కొట్టినా ఇది మైనస్ గా మారే ప్రమాదం ఉంది.

గతంలో మహానటి - అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు.. ఇటీవల RRR - KGF 2 వంటి సినిమాలు దాదాపు 3 గంటలు లేదా అంతకంటే ఎక్కువ లెన్త్ తో వచ్చాయి. స్ట్రాంగ్ కంటెంట్ ఉండటంతో ఆ చిత్రాలకు లాంగ్ రన్-టైమ్ అనేది వర్క్ ఔట్ అయింది. నిడివి కారణంగా ప్లాప్ అయిన సినిమాలు కూడా లేకపోలేదు.

ఇప్పుడు ఒక స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన 'కోబ్రా' సినిమా 3 గంటల నిడివితో రాబోతోంది. మరి ఆడియన్ ను అంతసేపు సీట్ లో కూర్చోబెట్టే ఎంగేజింగ్ కంటెంట్ ఏముందనేది మరికొన్ని నిమిషాల్లో తెలిసిపోతుంది.

కాగా, జీవితంలోని ప్రతీ క్షణాన్ని అంకెలతో.. ప్రతీ సమస్యకు గణితశాస్త్రంలో పరిష్కారం కనుగొనగల మ్యాథమ్యాటికల్ జీనియస్ గా విక్రమ్ ఈ సినిమాలో కనిపించనున్నారు. విలక్షణ నటుడు ఇందులో దాదాపు 9 గెటప్‌ లలో మల్టిపుల్ వేరియేషన్స్‌ ఉన్న పాత్రలో చూడబోతున్నాం.

కోబ్రా ఎలాగైతే కుబుసాన్ని వదులుతూ, దాక్కుని శత్రువులపై దాడి చేస్తుందో.. విక్రమ్ పాత్ర కూడా అలానే అనేక అవతారాల్లో సంచరిస్తూ.. మ్యాథ్స్ ఉపయోగించి నేరాలకు పాల్పడుతుంటాడని ట్రైలర్ ని బట్టి అర్థమవుతుంది.

ఇందులో విక్రమ్ సరసన 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్రలో నటించగా.. రోషన్ మాథ్యూ - మియా జార్జ్ - కేఎస్ రవికుమార్ - మృణాళిని రవి ఇతర పాత్రలు పోషించారు.

ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. హరీష్ కన్నన్ సినిమాటోగ్రఫీ అందించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌ పై ఎస్ఎస్ లలిత్ కుమార్ ఈ సినిమాని నిర్మించారు. 'కోబ్రా' చిత్రాన్ని తెలుగులో ఎన్వీఆర్ సినిమా బ్యానర్ లో ఎన్వీ ప్రసాద్ విడుదల చేయనున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.