Begin typing your search above and press return to search.

సినిమా టికెట్ రేట్ల ఇష్యూకి ఎండ్ కార్డ్ పడేనా..?

By:  Tupaki Desk   |   8 Feb 2022 10:39 AM GMT
సినిమా టికెట్ రేట్ల ఇష్యూకి ఎండ్ కార్డ్ పడేనా..?
X
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల వ్యవహారాన్ని ఓ కొలిక్కి తీసుకురావడానికి చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓవైపు హైకోర్టు సూచనతో ప్రభుత్వం నియమించిన కమిటీ దీనిపై సమావేశాలు నిర్వహిస్తోంది. మరోవైపు సినీ ప్రముఖులు ఇండస్ట్రీ సమస్యల పరిస్కారం కోసం ఏపీ సర్కారుకు విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి ముందడుగేసి ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో దీని గురించి మాట్లాడారు.

చిత్ర పరిశ్రమలోని సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లిన చిరంజీవి.. త్వరలోనే ప్రభుత్వం నుంచి సానుకూలమైన జీవో వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. సీఎంతో భేటీలో ప్రస్తావనకు వచ్చిన అంశాలను ఇండస్ట్రీలోని ప్రముఖులతో చర్చిస్తానని.. మళ్ళీ జగన్ తో సమావేశమై వివరిస్తానని చిరు తెలిపారు. ఇందులో భాగంగా ఫిలిం ఛాంబ‌ర్ ఆధ్వ‌ర్యంలో చిరంజీవి అధ్య‌క్ష‌త‌న సినీ పెద్దలతో భేటీ నిర్వహించారు.

అయితే సోమవారం ఇండస్ట్రీ పెద్దలతో మీటింగ్ ప్లాన్ చేయగా.. కొందరు కీలక సభ్యులు అందుబాటులో లేకపోవడంతో మంగళవారానికి వాయిదా వేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఏపీ సీఎం - చిరు భేటీ తర్వాత పరిశ్రమలో జరగనున్న మొదటి సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ ఈరోజు (ఫిబ్రవరి 8) కూడా భేటీ జరగలేదని సమాచారం.

పలువురు ఇండస్ట్రీ పెద్దలు అందుబాటులో లేకపోవడంతో ఈ సమావేశం జరగలేదని అనుకుంటున్నప్పటికీ.. ఈ విషయంలో సినీ ప్రముఖుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మీటింగ్ వాయిదా వేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. జగన్ తో భేటీ అవడానికి ముందు ఏ ప్రతిపాదనలు పెట్టాలనే దానిపై చర్చించాలని చిరంజీవి భావించారు. అయితే టాలీవుడ్ ప్రముఖులు దీనిపై సుముఖత వ్యక్తం చేయలేదని.. అందుకే సమావేశం జరగలేదని అనుకుంటున్నారు.

ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి జగన్ సైడ్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందనే విధంగా చిరంజీవి ఆ మధ్య మాట్లాడారు. కాకపోతే సామాన్యుడికి వినోదం అందించాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నారని తెలిపారు. సినీ పెద్దల భేటీలో దీనిపై చర్చించి టికెట్ ధరలు.. ఐదో షోకు అనుమతి వంటి పలు విషయంపై ఏకాభిప్రాయానికి తీసుకురావాలని భావించారట. కానీ సినీ ప్రముఖుల నుంచి దీనికి సానుకూల స్పందన రావడం లేదట.

మరోవైపు ఫిబ్రవరి 10న జగన్ తో చిరంజీవి అపాయిన్మెంట్ పిక్స్ అయిందని వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఈసారి చిరంజీవితో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా సీఎంను కలిసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఇండస్ట్రీలోనే చిరంజీవి - జగన్ భేటీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మీటింగ్ చిరంజీవి వ్యక్తికతమని 'మా' అధ్యక్షుడు హీరో మంచు విష్ణు హాట్‌ కామెంట్స్‌ చేశారు.

జగన్ తో చిరంజీవి భేటీ అయన పర్సనల్ అని.. అసోసియేషన్‌ భేటీగా భావించొద్దన్నారు మంచు విష్ణు. ఇండస్ట్రీ అంతా ఒక్కతాటిపైకి రావాలని.. వ్యక్తిగతంగా మాట్లాడితే సమస్యలు పరిష్కారం కావని అన్నారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యులు ప్రసన్న కుమార్ ఇటీవల ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఇప్పుడు ఏపీ సీఎంతో సమావేశం కంటే ముందు సినీ పెద్దలతో భేటీ అవుతారో లేదో అనే సందేహాలు కలుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో గురువారం ముఖ్యమంత్రితో చిరంజీవి సమావేశం ఎలా సాగుతుంది? దీనికి ఎవరిని కలుపుకొని వెళ్తారు? గత కొంతకాలంగా నలుగుతోన్న సినిమా టికెట్ ధరల ఇష్యూకి ఎండ్ కార్డ్ పడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు సినిమా టికెట్ దరల అంశం మీద హైకోర్టులో ఫిబ్రవరి 10న విచారణ జరగనుంది. ప్రభుత్వం దీనిపై కోర్టుకు నివేదిక ఇవ్వనుంది. మొత్తం మీద ఈ వారంలోనే టికెట్ రేట్ల వ్యవహారంలో ఏదోకటి తేలిపోతుందని పరిశీలకలు భావిస్తున్నారు.