Begin typing your search above and press return to search.

దిగ్గజ దర్శకుడు అంతసేపు జనాలను థియేటర్లలో కూర్చోబెడతాడా..?

By:  Tupaki Desk   |   20 Sep 2022 6:54 AM GMT
దిగ్గజ దర్శకుడు అంతసేపు జనాలను థియేటర్లలో కూర్చోబెడతాడా..?
X
లెజెండరీ దర్శకుడు మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పీరియాడిక్ యాక్షన్ ఫిలిం "పొన్నియిన్ సెల్వన్-1" రిలీజ్ కు రెడీ అయింది. సెప్టెంబర్ 30న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 'నవాబ్' మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన మణిరత్నం.. దాదాపు నాలుగేళ్ళ గ్యాప్ తర్వాత వస్తుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది.

'పొన్నియన్ సెల్వన్' అనేది మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా పేర్కొనబడుతోంది. ప్రసిద్ధ రచయిత కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా చోళుల కాలం నాటి కథాంశంతో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందించాలని ప్లాన్ చేసుకున్నారు. 'PS 1' రిలీజైన తొమ్మిది నెలల్లో రెండో పార్ట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

విడుదల తేదీ దగ్గర పడటంతో మణిరత్నం అండ్ టీమ్ దూకుడుగా సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పీఎస్-1 నిడివి 2 గంటల 50 నిమిషాలు వచ్చిన నేపథ్యంలో.. ఇటీవల మీడియా ఇంటరాక్షన్ లో రన్ టైమ్ పై దిగ్గజ దర్శకుడు స్పందించారు.

సుదీర్ఘ రన్ టైం అనేది సినిమాకి అడ్డంకిగా మారుతుందా అని ప్రశ్నించగా.. రన్ టైం సమస్యే అయితే కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' సినిమా దాదాపు 3 గంటల నిడివితో బాక్సాఫీస్ వద్ద ఎలా పనిచేసిందని మణిరత్నం తిరిగి ప్రశ్నించారు.

నిజానికి బోర్ కొట్టకుండా ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టటానికి క్రిస్పీగానే సినిమా ఉండాలని మేకర్స్ భావిస్తారు. అందుకే ఒకానొక సమయంలో ఎక్కువ రన్ టైమ్ ని రిస్క్ గా పరిగణించేవారు. అయితే దాదాపు 3 గంటలు లేదా అంతకంటే ఎక్కువ లెన్త్ తో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.

మహానటి - అర్జున్ రెడ్డి - బాహుబలి - KGF - RRR మరియు ది కాశ్మీర్ ఫైల్స్ వంటి అనేక చిత్రాలు నిడివి ఎప్పుడూ సమస్య కాదని నిరూపించాయి. మంచి కంటెంట్ ఉండటంతో ఆ సినిమాలకు లాంగ్ రన్-టైమ్ అనేది వర్క్ ఔట్ అయింది. అదే సమయంలో ఈ మధ్య 3 గంటల నిడివితో వచ్చిన 'కోబ్రా' సినిమా ప్లాప్ అయిన సంగతి తెలిసిందే.

'పీఎస్' లాంటి పీరియాడిక్ చిత్రాలకు ప్రేక్షకులకు సంతృప్తికరమైన అనుభవాన్ని అందించడానికి.. పాత్రలను పూర్తిగా అన్వేషించడానికి లాంగ్ రన్ టైం అవసరం అవుతుంది. కంటెంట్ గ్రిప్పింగ్గా ఉంటే నిడివి అనేది సమస్య కాదు. ఒకవేళ కంటెంట్ కొంచం తేడా కొడితే మాత్రం అది సినిమాకు మరింత మైనస్ గా మారుతుందని చెప్పాలి. మరి ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

కాగా, 'పొన్నియిన్ సెల్వన్' చిత్రంలో విక్రమ్ - ఐశ్వర్యరాయ్ - త్రిష - కార్తీ - జయం రవి - శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రకాష్ రాజ్ - ప్రభు - విక్రమ్ ప్రభు - ఐశ్వర్య లక్ష్మీ - శరత్ కుమార్ - జయరామ్ - రెహమాన్ - రాధాకృష్ణన్ పార్థీవన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

లైకా ప్రొడక్షన్స్ మరియు మణిరత్నం మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై సుభాస్కరన్ - మణిరత్నం సంయుక్తంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు. తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.